రేషన్ బియ్యంతో నక్సల్స్ ఆచూకీ!.. 26 మందిని వేటాడిన సీ-60..
posted on Nov 15, 2021 @ 4:50PM
గడ్చిరోలి ఎన్‌కౌంటర్ సంచలనంగా మారింది. దట్టమైన అడవిలో.. పక్కాగా ట్రైనింగ్ క్యాంప్ నిర్వహిస్తున్న సమాచారం భద్రతా బలగాలకు చిక్కిన విషయం మరింత సంచలనం. ఇటీవలే కేంద్ర కమిటీ నేత ఆర్కే మరణం తర్వాత.. ఒకే ఎన్‌కౌంటర్‌లో 26మందిని కోల్పోవడం మావోయిస్టులు ఊహించని షాక్. ఇంతకీ మావోల శిబిరం గురించి బలగాలకు ఎలా తెలిసింది? అడవిలో అన్నల అడ్రస్ ఎలా పసిగట్టారు? ఆ వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
ఎంఎంసీ జోన్‌లో మావోయిస్టు పార్టీ విస్తరణ, కొత్త రిక్రూట్‌మెంట్‌ల బాధ్యతలు నిర్వహిస్తున్న మిలింద్ తేల్టుంబ్డే ఇటీవలికాలంలో 100 మందికిపైగా యువతను దళంలో చేర్పించినట్టు తెలిసింది. కొత్త రిక్రూటీలు, పలు దళాల కమాండర్లు, సభ్యులంతా గ్యారాపత్తి, కోట్గుల్ పరిసర ప్రాంతాల్లోని అడవుల్లో క్యాంపులు పెట్టారు. వంద మందితో శిబిరం అంటే మాటలా.. వారికి భోజనాలు పెట్టాలంటే పెద్ద మొత్తంలో సరుకులు కావాల్సి ఉంటుంది. అందుకోసం స్థానిక రేషన్ డీలర్‌ను బెదిరించి.. ట్రక్కు ద్వారా బియ్యం బస్తాలు తెప్పించుకున్నారు మావోయిస్టులు. అదే వారు చేసిన తప్పని ఆ సమాయానికి వారికి తెలీకపోవచ్చు. మావోలకు బియ్యం సరఫరా చేసిన ప్రభుత్వ రేషన్ ట్రక్కుకు జీపీఎస్ ట్రాకింగ్ అమర్చి ఉంది. ఆ ట్రక్కు అడవుల్లో గ్యారాపత్తి సమీపంలో ఎక్కువసేపు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ అధికారులు, పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. అనుమానించిన భద్రతా బలగాలు.. గ్యారాపత్తిలో పెద్ద సంఖ్యలో నక్సల్స్ అక్కడ మకాంవేసి ఉంటారనే భావించారు. ఇతరత్రా నెట్‌వర్క్‌తో ఆ విషయాన్ని కన్ఫామ్ చేసుకున్నారు. ఇక మావోయిస్టుల డెన్‌పై అటాక్ చేయాలని డిసైడ్ అయి.. అందుకోసం స్పెషల్‌గా ట్రైనింగ్ పొందిన సీ-60 కమాండోలను రంగంలోకి దించారు.
శనివారం తెల్లవారుజాము నుంచే సీ-60 కమాండోలు గ్యారాపత్తి అటవీ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. పకడ్బందీగా కూంబింగ్ చేపట్టారు. మావోయిస్టులు ఎదురుపడగా.. భారీ ఎన్‌కౌంటర్ జరిగిందని అంటున్నారు. ఘటనలో కేంద్ర కమిటీ సభ్యుడు తేల్టుంబ్డేతో పాటు 26మంది చనిపోయారు. 70మంది వరకూ అడవుల్లోకి పారిపోయి ఉంటారని తెలుస్తోంది. వారి కోసం కూంబింగ్ మరింత ముమ్మరం చేశారు. డ్రోన్లతో అడవులను జల్లెడ పడుతున్నారు. మహారాష్ట్ర గడ్చిరోలి ఎన్‌కౌంటర్ బూటకమని.. న్యాయ విచారణ జరిపించాలని మావోయిస్టు పార్టీ డిమాండ్ చేసింది.