అమరావతే రాజధాని.. ఏపీ బీజేపీ నేతలకు అమిత్‌షా క్లారిటీ..
posted on Nov 15, 2021 @ 5:33PM
ఆంధ్రప్రదేశ్‌కి ఏకైక రాజధాని అమరావతినే అన్నారు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా. ఈ విషయం ఆయనే స్వయంగా రాష్ట్ర బీజేపీ నేతలకు స్పష్టం చేశారు. అమరావతి రైతుల పాదయాత్రకు ఎందుకు వెళ్లలేదని వారిని అమిత్ షా నిలదీశారు. ఏపీకి అమరావతి ఏకైక రాజధానిగా బీజేపీ తీర్మానం చేసిన తర్వాత పాదయాత్రకు మద్దతు ఇవ్వాల్సిందేనని ఆదేశించారు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్‌షా.. అమరావతినే ఏపీ రాజధాని అని తేల్చి చెప్పడం రాజకీయంగా కీలకాంశంగా మారింది.
ఇక, కొందరు పార్టీ పెద్దలు చేస్తున్న ఓవరాక్షన్‌పైనా అమిత్‌షా మండిపడ్డారు. ఇటీవల రావెల కిశోర్‌బాబు లాంటి నాయకులు అమరావతి రైతుల పాదయాత్రలో పాల్గొనగా వారిపై రాష్ట్ర బీజేపీ ఇంఛార్జ్ సునీల్ దియోధర్ మండిపడ్డారు. కొందరు నాయకులు పాద్రయాత్రలో ఎందుకు పాల్గొన్నారంటూ వివరణ అడిగారు. ఈ విషయం అమిత్‌షా దృష్టికి రావడంతో.. పాదయాత్రలో పాల్గొన్న బీజేపీ నేతలను రాష్ట్ర నాయకులు వివరణ అడగడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్రలో ఒక సామాజిక వర్గం మాత్రమే పాల్గొంటుందని కొంతమంది నేతలు చెప్పడంపై అమిత్‌షా అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీ తరపున రైతుల మహాపాదయాత్రలో పాల్గొనాలని రాష్ట్ర నేతలను షా ఆదేశించారు.
ఏపీలో అధికార పార్టీపై వ్యతిరేకత ఎక్కువుగా ఉందని, ఆ వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మలచుకోవడంలో పార్టీ నేతలు విఫలమవుతున్నారని అమిత్ షా అన్నారు. రాష్ట్ర నాయకత్వంలో అభిప్రాయ బేధాలపైనా ఫైర్ అయ్యారు. సోము వీర్రాజు, విష్ణువర్థన్‌రెడ్డిల తీరుపై అమిత్ షా అసహనం వ్యక్తం చేశారని చెబుతున్నారు.
ఇతర పార్టీల నుంచి వచ్చిన వారిని చేర్చుకోవడం, వారిని గౌరవించడం నేర్చుకోవాలని నేతలకు అమిత్‌షా దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో వైసీపీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమేనని స్పష్టం చేశారు. ఆ దిశగా ప్రభుత్వంపై గట్టిగా పోరాటం చేయాలని పార్టీ రాష్ట్ర నాయకత్వానికి షా సూచించారు. ఎవరి మీదనో ఆధారపడవద్దని పరోక్షంగా జనసేన-పవన్ కల్యాణ్ గురించి ప్రస్తావించారు. పార్టీ పొత్తుల గురించి జాతీయ నాయకత్వం చూసుకుంటుందని.. ఆ విషయంలో రాష్ట్ర నాయకులు మాట్లాడాల్సిన అవసరం లేదని అమిత్‌షా తేల్చి చెప్పారు.