ఈటలకు పోటీగా రాజేందర్... తెరాస కొత్త ఎత్తు
posted on Oct 8, 2021 @ 11:01AM
కోటి విద్యలు కూటి కొరకే..అలాగే,ఎన్నికల సమయంలో రాజకీయ నాయకులు వేసే వేషాలన్నీ కూడా ఓట్ల కోసమే. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీలో ఉన్న పార్టీలన్నీ, ఇలాంటి ఎన్నో వేషాలు వేశాయి. వేస్తూనే ఉన్నాయి. ప్రత్యర్ధులను దెబ్బతీసేందుకు ప్రతి పార్టీకూడా ఎప్పటి కప్పుడు కొత్త ఎత్తులు వేస్తూనే ఉంటుంది. పాత ఎత్తులను కొత్తగా ప్రయోగిస్తూనే ఉంటాయి ఇది అనేక సందర్భాలలో రుజువైన నిజం.
పేరులో నేముంది? అని అనుకుంటాం కానీ, ఎన్నికల సమయంలో పేరులోనే పెన్నిది ఉందని రుజువైన సందర్భాలున్నాయి. ఒక అభుర్ది పేరును పోలిన పేరున్న మరో పది మంది చేత నామినేషన్ వేయించి, ఓటర్లు గందరగోళానికి గురిచేసి, ఓట్లను దరి మళ్లించే ఎత్తుగడలకు పార్టీలు పాల్పడడం కొత్త విషయం కాదు. ప్రత్యర్ధి పార్టీల అభ్యర్ధిని దెబ్బ కొట్టేందుకు, ఆ అభ్యర్ధి పేరును పోలిన ఇండిపెండెంట్ అభ్యర్ధులను బరిలో దించడం, ప్రత్యర్ధి పార్టీ ఎన్నికల గుర్తును పోలిన గుర్తున్న చిన్న చితకా పార్టీలకు డబ్బులిచ్చి ఆ పార్టీ అభ్యర్ధులను బరిలో దించడం వంటి ట్రిక్కులు అన్ని పార్టీలు ప్లే చేస్తూనే ఉంటాయి.
ఇక ప్రస్తుతానికి వస్తే, హుజూరాబాద్ ఉపఎన్నికల్లో ఓటమి నుంచి తప్పించుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకొని అధికార తెరాస ఇప్పుడు అదే ఎత్తును తెరపైకి తెచ్చింది. తెరాస ప్రధాన ప్రత్యర్దిగా భావిస్తున్న బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ పేరును పోలి ఉన్న వారితో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రాజేందర్ పేరున్న వారి కోసం వేట మొదలు పెట్టింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక బాధ్యతను తమ భుజస్కందాలపైకి ఎత్తుకున్న, మంత్రి హరీష్ రావు, బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్ పేరును పోలిన వారిని వెతికి పట్టుకోమని పార్టీ క్యాడర్’ను ఆదేశించినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా హుజురాబాద్‌కు చెందిన ఇల్లందుల రాజేందర్ (ఇ. రాజేందర్) అనే వ్యక్తిని తెరాస నాయకులు గుర్తించారు. నామినేషన్ వేయాలని టీఆర్ఎస్ నాయకులు ఆయన్ని సంప్రదించారు. కాదంటే వత్తిడి తెచ్చారని ఆయన బంధువులు ఆరోపించారు. ఈటల రాజేందర్ పేరుతో పోలి ఉన్నందుకే ఈయనతో నామినేషన్ వేయించేందుకు ప్రయత్నిస్తున్నారని బంధువులు అంటున్నారు. నామినేషన్ వేస్తే.. ఇంటి పన్ను చెల్లిస్తాం, వ్యాక్సిన్ వేయిస్తామని చెప్పినట్లు వారు తెలిపారు. గోడౌన్లో హమాలీ పనిచేసే ఇల్లందుల రాజేందర్ చేత నామినేషన్ వేయించాలనుకోవడం వెనక కుట్ర ఉందని వారుంటున్నారు. ఈ విషయంపై ఈసీ స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని ఇల్లందుల రాజేందర్ బంధువులు విజ్ఞప్తి చేశారు.
అయితే, ఇలాంటి విషయాలలో ఈసీ కూడా చేయగలిగింది ఏమీ ఉండదు అనేది ఒకటైతే, ఈసారి ఎన్నికల్లో హుజూరాబాద్ ఓటర్లు ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని, ఇలాంటి చిల్లర వేషాలు చెల్లవని స్థానికులు అంటున్నారు.