ధూళిపాళ్ల అరెస్టుకు మళ్లీ స్కెచ్!.. డ్రగ్స్‌కు సాక్షాలు ఇవ్వాలంటూ నోటీసులు..
posted on Oct 8, 2021 @ 10:26AM
ఎన్నెన్నో అంటుంటారు. అన్నిటికీ సాక్షాలు ఉంటాయా ఏంటి? రాజకీయాలు అన్నప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు కామన్. అలాంటి విమర్శలు చేసినప్పుడే.. మీడియా అటెన్షన్ పెరిగి అసలు నిజాలు బయటకు వస్తాయి కూడా. నిప్పులేనిదే పొగరాదు. అదిగో పొగ అంటే.. నిప్పు ఏది..చూపించండి అంటే ఎలా? ఏపీని డ్రగ్స్ వ్యవహారం కుదిపేస్తోంది. ముంద్రా పోర్టులో పట్టుబడిన వేల కోట్ల డ్రగ్స్.. విజయవాడ అడ్రస్‌తో బుక్ అయ్యాయి. ఆశి ట్రేడింగ్ కంపెనీ సైతం బెజవాడలోనే రిజిష్టర్ కావడం.. సుధాకర్‌కు సైతం వైసీపీ నేతలతో లింకులుండటం.. కాకినాడ పోర్టు డ్రగ్స్ దందాకు కేంద్రంగా మారిందనే ప్రచారం.. ఎమ్మెల్యే ద్వారంపూడి కనుసన్నల్లో డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందనే అనుమానం.. ఇలా డ్రగ్స్ ఎపిసోడ్ ఏపీ పాలిటిక్స్‌ను షేక్ చేస్తోంది. పలువురు టీడీపీ నేతలు వైసీపీకి అంటిని ఈ డ్రగ్స్ మరకపై బాగానే నిలదీస్తున్నారు. అయితే, ప్రతిపక్షం నోరు మూయించేందుకు ప్రభుత్వం పోలీసులను రంగంలోకి దింపిందనే విమర్శలు వస్తున్నాయి. తాజాగా, కాకినాడ పోలీసులు టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్రకు నోటీసులు ఇవ్వడం కలకలం రేపుతోంది.
డ్రగ్స్ వ్యవహారంలో ధూళిపాళ్ల నరేంద్ర వైసీపీ నేతలపై చేసిన ఆరోపణలకు సాక్ష్యాలివ్వాలంటూ కాకినాడ పోలీసులు ధూళిపాళ్ల నరేంద్ర ఇంటికి వెళ్లారు. కాకినాడ నుంచి గుంటూరు జిల్లా చింతలపూడిలో ఉన్న ధూళిపాళ్ల ఇంటికి పోలీసులు ప్రత్యేకంగా నోటీసులు ఇవ్వడానికే వెళ్లారంటే ఖాకీలపై ఎంత ఒత్తిడి ఉందో తెలుస్తోంది. గతంలో సంగం డెయిరీ కేసులో ధూళిపాళ్లను అరెస్టు చేసి.. జైల్లో పెట్టి కక్ష్య తీర్చుకుంది జగన్ సర్కారు. అది సరిపోలేదనుకున్నారో.. లేక, కేసులకు భయపడకుండా మళ్లీ మళ్లీ నోరెత్తుతున్నారని కన్నెర్ర జేస్తున్నారో.. కారణం తెలీదు కానీ, డ్రగ్స్ ఎపిసోడ్‌లో పలువురు టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నా.. ప్రత్యేకించి ధూళిపాళ్లకే పోలీసులు నోటీసులు ఇవ్వడం వెనుక భయపెట్టే వ్యూహం ఉందనే అనుమానం వ్యక్తం అవుతోంది.
ధూళిపాళ్ల చేసిన విమర్శలు, ఆరోపణలకు సాక్ష్యాలివ్వకపోతే .. గతంలో అరెస్ట్ చేసినట్లుగా తెల్లవారు జామునే వచ్చి అరెస్ట్ చేస్తారా? అంటూ ప్రచారం జరుగుతోంది. డ్రగ్స్ కేసులో చంద్రబాబు, లోకేష్‌పై సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆరోపణలు చేశారు. రాజకీయాల్లో ఇలాంటివన్నీ సాధారణం. మరి, ఇలాంటి వాటిని పట్టుకుని పోలీసులు నేరుగా ఎందుకు రంగంలోకి దిగుతున్నారో? పాలకుల ఒత్తిడే కారణమని ఇట్టే తెలిసిపోతోంది. పోలీసులు అధికార పార్టీ వారి కోసమే పని చేస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే, సుప్రీంకోర్టు సీజేఐ ఎన్వీ రమణ పదే పదే పోలీసులు ప్రభుత్వంతో అంటకాగడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.