ఏది నిజం.. ఏది కాదు..?
posted on Oct 8, 2021 @ 12:25PM
తెలంగాణ రాష్ట్రం పెట్టి పుట్టిన రాష్ట్రం. పుడుతూనే ధనిక రాష్ట్రంగా, మిగులు ఆదాయం ఉన్న రాష్ట్రంగా పుట్టింది. బోర్న్ విత్ ఏ సిల్వర్ స్పూన్, అంటారు చూడండి అలా, నోట్లో వెండి కాదు, ఏకంగా బంగారు చెంచాతో పుట్టింది.
అంతే కాదు, రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ధి చేసేందుకు కంకణం కట్టుకున్న తెరాస ప్రభుత్వం అద్భుతమైన ప్రణాళికలతో,ఇంకా అద్భుతంగా పరిపాలన సాగిస్తోందని,అధికార పార్టీ అదే పనిగా చెప్పుకుంటోంది. అందుకే, రాష్ట్రం ఆర్థిక వృద్ధిలో పరుగులు తీస్తోందని, దేశానికి అధిక మొత్తంలో నిధులు సమకూరుస్తున్న రాష్ట్రాలలో తెలంగాణ నాల్గవ స్థానంలో ఉందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిన్ననే (గురువారం) శాసన సభలో చెప్పారు. ముఖ్యమంత్రి కూడా అక్కడా ఇక్కడా గాలి పోగేసి, ఈ మాటలు చెప్పలేదు. 'కాగ్' నివేదికఆధారంగానే, ఈ లెక్కలు చెపుతున్నానని, ఆయనే చెప్పారు.
అయితే, ఇది తెలంగాణ నాణ్యానికి ఒక పార్శ్వం మాత్రమే. రెండో వైపు చూస్తే, నేరేడు పండు చందంగా, పేదరికం పొట్ట విప్పిచూస్తే పురుగులే బయట పడతాయి అంటున్నాయి, పేదరికానికి సూచికగా నిలిచే రేషన్ కార్డుల లెక్కలు. ఓ వంక ముఖ్యమంత్రి తెలంగాణలో అభివృద్ధి ఎలా పరుగులు తీస్తోందో వివరించిన సభలోనే,అదే రోజున పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, గడచిన ఏడు సంవత్సరాలలో ధనిక రాష్ట్రంలో దరిద్రుల సంఖ్య ఎంతగా పెరిగిందో వివరించే, రేషన్ కార్డుల లెక్కలను సభ ముందుంచారు.
ప్రభుత్వం సభ ముందుంచిన రేషన్ కార్డుల వివరాల ప్రకారం, రాష్ట్ర జనాభాలో, 71 శాతం మంది మంది ప్రజలు దారిద్ర్య రేఖకు దిగువన (బీపీఎల్) ఉన్నారు. అంటే ప్రతి వందమందిలో, 19 మంది మాత్రమె పేదరికం బయట ఉన్నారు.71 మంది పేదరికంలో మగ్గుతున్నారు.అదలా ఉంటే, సర్కార్ వారి లెక్కల ప్రకారమే, తెరాస ఏడేళ్ళ పాలనలో, 21.30 లక్షల మంది పేదరికంలోకి కూరుకుపోయారు. జీఎస్‌డీపీలో దేశంలో రాష్ట్రం 5వ స్థానంలో ఉందని, సర్ప్లస్ స్టేట్ అని ఆర్థిక శాఖ చెప్పే లెక్కలకు, సివిల్ సప్లయ్స్ శాఖ జారీ చేసే రేషన్ కార్డులకు పొంతన కుదరడం లేదు.
ఒకసారి, ఆ వివరాల్లోకి వెళితే, రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఈ ఏడేండ్లలో 6.70 లక్షలకు పైగా కార్డులు ఇచ్చినట్లు ప్రభుత్వం ప్రకటించింది.ప్రభుత్వ లెక్కల ప్రకారం పేద కుటుంబాల జనాభా 21.30 లక్షలు. రాష్ట్ర జనాభా దాదాపు 4 కోట్ల వరకు ఉండగా.. రేషన్ కార్డులు 90.49 లక్షలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 2 కోట్ల 87 లక్షల 68 వేల మంది రేషన్ లబ్ధిదారులు ఉన్నట్లు పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. దారిద్ర రేఖకు దిగువున ( బీపీఎల్) కుటుంబాలకే పౌరసరఫరాల శాఖ రేషన్ కార్డులు ఇస్తుంది. కుటుంబ సంవత్సర ఆదాయం ప్రాతిపదిక, గ్రామాల్లో లక్షన్నరలోపు పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలలోపు ఆదాయం ఉన్న కుటుంబాలనే బీపీఎల్ కుటుంబాలుగా ప్రభుత్వం గుర్తిస్తుంది.ఆ కుటుంబాలకు మాత్రమే రేషన్ కార్డు మంజురవుతుంది.
దీని ప్రకారం.. రేషన్ కార్డులున్న 90.49 లక్షల కుటుంబాలు పేదవర్గాలే. అంటే ఈ కుటుంబాల్లోని 2 కోట్ల 87లక్షల 68వేల మంది పేదరికంలో మగ్గుతున్నారు. రాష్ట్ర జనాభాలో వీళ్లు 71 శాతం ఉన్నారు.
ఈ నేపధ్యంలో ముఖ్యమంత్రి పేర్కొన్న విధంగా రాష్ట్రం అభివృద్ధి పథంలో పరుగులు తీస్తోందా, పౌర సరఫరాల శాఖ మంత్రి చెప్పిన విధంగా,రాష్ట్రంలో పేదరికం పెరుగుతోందా ? ఏది నిజం ..ఎవరిది నిజం. ఇదొక సమాధనం లేని ప్రశ్న..