అండర్ గ్రౌండ్ కు ఎంపీ సంతోష్? కేసీఆర్ సూచన మేరకేనా?
posted on Nov 22, 2022 @ 1:45PM
ఢిల్లీ లిక్కర్ స్కాం తెరాసలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎప్పుడు ఎవరిని ఈడీ విచారణకు పిలుస్తుందా అన్న గుబులు తెరాస ముఖ్య నేతలలో మొదలైంది. ఈ స్కాం బయట పడినప్పటి నుంచీ పెద్దగా ఎక్కడా బయట కనిపంచకుండా తిరుగుతున్న తెరాస ఎంపీ సంతోష్ ఇప్పుడు పూర్తిగా అండర్ గ్రౌండ్ లోకి వెళ్లిపోయారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ నజర్ సంతోష్ మీద ఉందని విశ్వసనీయంగా తెలిసిన సమాచారంతో ముఖ్యమంత్రి కేసీఆర్ సలహా మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ లోకి వెళ్లారని తెలుస్తోంది. ఈ కుంభకోణంలో తెరాస అధినేత కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితపై ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి విదితమే. ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడగానే దాని మూలాలు తెలంగాణలోనే ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
ఆ ఆరోపణలకు అనుగుణంగానే ఆ కుంభకోణం కేసు తీగ లాగితే మూలాలు తెలంగాణలో బయటపడ్డాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవిత, ఆయన సమీప బంధువు రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ సహా తెరాస అధినాయకత్వానికి సన్నిహితులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ కేసు విచారిస్తున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) హైదరాబాద్’లో పలుచోట్ల తనిఖీలు జరిపింది. కొందరికి నోటీసులు జారీ చేసింది. కొందరిని అరెస్టు చేసింది. కవిత, సంతోష్ సహా మరి కొందరు ముఖ్యులకు సన్నిహితులైన వారికి కూడా అరెస్టు చేసింది. కాగా ఈ స్కాం కు సంబంధించి తెలంగాణలొ తెరాస అగ్రనేతలకు సన్నిహితుడైన బోయనపల్లి అభిషేక్ అరెస్టు అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ అరెస్టుతో కవిత, సంతోష్ రావులకు ఢిల్లీ లిక్కర్ స్కాంలో లింకులున్నాయన్న ఆరోపణలకు బలం చేకూరినట్లైంది.
ఈ నేపథ్యంలోనే నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ కు, ఇటీవలి కేసీఆర్ పది రోజుల హస్తిన పర్యటనకు లింకు ఉందా? ఈ రెండింటి వెనుకా ఉన్నది ఢిల్లీ లిక్కర్ స్కామేనా? ఆ స్కామ్ నుంచి తన బిడ్డ కవితను, సమీప బంధువు సంతోష్ ను బయటపడేయాలన్న కేసీఆర్ ప్రయత్నాలు విఫలం కావడమే కొనుగోలు డ్రామాకు కారణమా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కేసీఆర్ ఇటీవల హఠాత్తుగా చెప్పాపెట్టకుండా హస్తిన వెళ్లి అక్కడ పది రోజుల బస చేసి అక్కడ చేసిందేమిటన్న విషయంపై సస్పెన్స్ విడిపోయిందంటున్నారు.
ఆయన హస్తిన పర్యటన తిమ్మిని బిమ్మిని చేసైనా సరే ఢిల్లీ లిక్కర్ స్కాం నుంచి తన బిడ్డ కవితను, సంతోష్ ను బయటపడేయడాని ఆయన చేయని ప్రయత్నం లేదని అంటున్నారు. తన హస్తిన పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ను కలవడానికి కేసీఆర్ చేసిన ప్రయత్నం కూడా ఫలించలేదనీ, కేసీఆర్ కు అప్పాయింట్ మెంట్ ఇచ్చేందుకు కూడా అమిత్ షా ఇష్టపడలేదని అంటున్నారు. దీంతో దిక్కు తోచని కేసీఆర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి గవర్నర్ నరసింహన్ ను తన దూతగా అమిత్ షా వద్దకు పంపారని, అయితే నరసింహన్ ప్రతిపాదన వినగానే అమిత్ షా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారనీ, ఆల్ మోస్ట్ గెటౌట్ అంటూ అవమానించారనీ చెబుతున్నారు. అదంతా పక్కన పెడితే ఇప్పుడు లిక్కర్ స్కామ్ లో సంతోష్ కు సమన్లు జారీ అయ్యే అవకాశాలున్నాయని, ఈడీ నెక్స్ట్ టార్గెట్ సంతోషేనని కేసీఆర్ కు విశ్వసనీయంగా తెలియడంతోనే కేసీఆర్ సంతోష్ ను కొద్ది రోజుల పాటు అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సూచించినట్లు తెలుస్తోంది.
ఆయన సూచన మేరకే సంతోష్ అండర్ గ్రౌండ్ కు వెళ్లారంటున్నారు. ప్రస్తుతం సంతోష్ తన సెల్ ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసేసి ఎవరికీ అందుబాటులో లేకుండా అండర్ గ్రౌండ్ కు వెళ్లి పోయారంటున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారి కస్టడీని పొడగించడంతోనే కేసీఆర్ సంతోష్ ను అజ్ణాతంలోకి వెళ్లాల్సిందిగా సలహా ఇచ్చినట్లు చెబుతున్నారు.అలాగే తన కుమార్తె కవితను కూడా బీఆర్ఎస్ నేషనల్, ఇంటర్నేషనల్ మీడియా సలహాదారు పేరు చెప్పి హస్తినకే పరిమితం చేశారని అంటున్నారు.