ప్రతికూలతలెన్నున్నా గుజరాత్ లో మళ్లీ బీజేపీదే అధికారం
posted on Nov 22, 2022 @ 2:50PM
ప్రస్తుతం దేశం దృష్టి గుజరాత్ పై కేంద్రీకృతమై ఉంది. గుజరాత్ అసెంబ్లీకి వచ్చే నెల మొదటి వారంలో రెండు విడతలుగా ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ వరుసగా ఆరు సార్లు విజయం సాధించి ఏడో సారి కూడా గుజరాత్ లో అధికార పీఠం దక్కించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఉండగా.. రాష్ట్రంలో కాంగ్రెస్, ఆప్ పార్టీలు గట్టి పోటీనిస్తూ బీజేపీ విజయ పరంపరకు చెక్ పెట్టాలన్న దృఢ నిశ్చయంతో ముందుకు సాగుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే గుజరాత్ ఎన్నికలపై పలు సంస్థలు సర్వేలు చేసి ఫలితాలు వెలువరించాయి. అయితే విశేషం ఏమిటంటే ఒక్కో సర్వేఒక్కో లాంటి ఫలితాన్ని వెలువరించింది. దీంతో గుజరాత్ లో పీఠం ఎవరిది? అన్న ఉత్కంఠ పెరిగిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆత్మసాక్షి సంస్థ మూడ్ ఆఫ్ గుజరాత్ పేర తన తాజా సర్వే ఫలితాన్ని వెలువరించింది. సోమవారం (నవంబర్ 21)త ఆత్మసాక్షి సర్వే సంస్థ తన సర్వే ఫలితాలన ప్రకటించింది. ఈ సర్వే మేరకు బీజేపీ 101 నుంచి 106 స్థానాలలో, కాంగ్రెస్ 65 నుంచి 68 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. ఇక ఎన్నో అంచనాలతో గుజరాత్ బరిలో దిగిన ఆప్ కేవలం 9 నుంచి 10 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు 3 నుంచి 4 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయి. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే బీజేపీకి 42శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ 38, ఆప్ 16 నుంచి 17 శాతం ఓట్లు దక్కించుకుంటాయి. ఇతరులకు 3 నుంచి 4 శాతం ఓట్లు పడే అవకాశం ఉంది. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో అధికారం దక్కించు కోవాలంటే కనీసం 92 స్థానాలలో విజయం సాధించాల్సి ఉంటుంది. ఆత్మసాక్షి సర్వే ప్రకారం బీజేపీ సునాయాసంగా ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేస్తుంది.
అయితే గత ఆరు దఫాలుగా గుజరాత్ లో అధికారంలో ఉన్న బీజేపీ ఈ సారి తీవ్రమైన యాంటీ ఇన్ కంబెన్సీ ఎదుర్కొంటోంది. అలాగే బీజేపీకి తిరుగుబాటు అభ్యర్థుల బెడద కూడా అధికంగా ఉంది. వీటికి తోడు నిరుద్యోగం, అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగుల సమస్యలు, స్కూళ్ల మూత, నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదల, మరీ ముఖ్యంగా గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు అధికార పార్టీ విజయావకాశాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం మెండుగా ఉంది. అలాగే గుజరాత్ లో లిక్కర్ మాఫియా ప్రభావం కూడా బీజేపీకి నష్టం చేస్తుందని సర్వే పేర్కొంది. రాష్ట్రంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే బీజేపీలో విద్యుత్ చార్జీలు అధికం, అలాగే గత నాలుగేళ్లుగా ప్రభుత్వ రంగంలో ఎటువంటి నియామకాలూ లేకపోవడం కూడా ప్రభుత్వం పట్ల ప్రజలలో వ్యతిరేకతకు కారణంగా ఉంది. అలాగే బీజేపీకి దన్నుగా ఉండే పటేదార్ సామాజిక వర్గ ఓట్లు ఈ సారి కాంగ్రెస్, బీజేపీల మధ్య చీలిపోనుండటం కూడా అధికార పార్టీకి ఏదో ఒక మేర నష్టం చేకూరుస్తుందని సర్వే పేర్కొంది.
అలాగే ఎస్సీఎస్టీల మద్దతు బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కవగా ఉండటం కూడా అధికార పార్టీకి కొంత మేర నష్టం చేకూరుస్తుంది. ఇక బీజేపీకి కలిసి వచ్చే అంశాలకు వస్తే ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పోటీలో ఉండటం వల్ల బీజేపీకి ఒకింత ప్రయోజనం చేకూరుతుందని సర్వే విశ్లేషించింది. ఆప్ బీజేపీ ఓట్ల కంటే కాంగ్రెస్ ఓట్లను ఎక్కువగా చీలుస్తుందని సర్వే పేర్కొంది.
దీంతో కాంగ్రెస్ ఎంతగా పుంజుకున్నా ఆప్ పోటీ కారణంగా భారీగా నష్టపోతుందని సర్వే పేర్కొంది. అహ్మద్ పటేల్ మరణం తరువాత కాంగ్రెస్ నాయకత్వ లోపంతో ఇబ్బంది పడుతోందని, క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ పెద్దగా చురుకుగా పని చేయడం లేదని ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. అదే బీజేపీ వద్దకు వచ్చే సరికి బూత్ స్థాయిలో ఆ పార్టీకి బలమైన క్యాడర్ ఉంది. రాష్ట్రంలో ఆప్ పోటీలో ఉండటం వలనే బీజేపీ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు మెరుగయ్యాయని సర్వే పేర్కొంది.