కేసీఆర్ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన!
posted on Jun 21, 2021 @ 1:17PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే నిరసన... ఏంటీ తప్పు చదివామని అనుకుంటున్నారా... కాని ఇది నిజం. కేసీఆర్ వరంగల్ పర్యటనలో ఈ ఘటన జరిగింది. ముఖ్యమంత్రి పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యేనే నిరసన తెలపడం కలకలం రేపుతోంది.
జిల్లాల పర్యటనలో భాగంగా సోమవారం వరంగల్ లో పర్యటించారు సీఎం కేసీఆర్. పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ప్రారంభించారు. తర్వాత సెంట్రల్ జైలు స్థానంలో నిర్మించ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. అయితే కేసీఆర్ పర్యటనలో వరంగల్ పోలీసుల తీరుపై ఇప్పుడు వివాదాస్పదమైంది. నర్సంపేట అధికార పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సుదర్శన్ రెడ్డికి కూడా చేదు అనుభవం ఎదురైందిపోలీసుల తీరు వల్లే నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి నిరసనకు దిగారని తెలుస్తోంది.
హన్మకొండ మీదుగా సీఎం కేసీఆర్ వద్దకు వెళ్తున్న పెద్ది సుదర్శన్ రెడ్డి వాహనాన్ని అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. హెడ్ క్వార్టర్స్ వద్దనే పోలీసులు నిలిపివేయడంతో మనస్థాపం చెందిన సుదర్శన్ రెడ్డి కారు దిగారు. అనంతరం హెడ్ క్వార్టర్స్ నుంచి అర్‌అండ్‌బీ అతిథి గృహం వరకు నడిచివెళ్లారు. తర్వాత ఏకశిలా పార్క్ వద్ద సీఎం కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్ది సుదర్శన్ రెడ్డి వెళ్లినా.. అక్కడ కూడా అనుమతి లేదని పోలీసులు మరోసారి అడ్డుకోవడంతో ఆయన తీవ్ర మనస్థాపం చెందారు. పోలీసుల తీరుపై ఆగ్రహంగా కారు దిగి నడుచుుకంటూ వెళ్లి నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనలో అధికార పార్టీ ఎమ్మెల్యే పాదయాత్ర చేయడం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. సొంత పార్టీ ఎమ్మెల్యే సీఎం వద్దకు వెళ్తుంటే అడ్డుకోవడం ఏంటని స్థానిక నేతలు మండిపడుతున్నారు.
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనతో వరంగల్ పోలీసులు అతి చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. తొలుత పాసులు జారీ చేసి మీడియా కవరేజ్‌కి పోలీసులు అనుమతి ఇవ్వలేదు. సీఎం వస్తున్న కారణంగా ఆయన పర్యటన దారిలో ఉన్న షాపులను పోలీసులు మూసివేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి అవాంతరాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఇలా చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. సీఎం వరంగల్ పర్యటన సందర్భంగా పోలీసుల తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.