ఆనందయ్య ఆగం.. మందు మాయం.. అంతా వారి కుట్రేనా?
posted on Jun 21, 2021 @ 1:18PM
ఆనందయ్య. ఆనందయ్య. ఆనందయ్య. కొన్నివారాల క్రితం రోజుల తరబడి మారుమోగిన పేరు. ఇప్పుడు విందామన్నా ఆయన పేరు వినిపించడం లేదు. ఒకప్పుడు అన్ని ఛానెల్స్‌లోనూ ఆయనే బ్రేకింగ్ న్యూస్. ఇప్పుడు చూద్దామన్నా ఆయన టీవీల్లో కనిపించట్లేదు. కరోనాను జయించే సంజీవనిలాంటి మందును తయారు చేశారంటూ ఊరూరా ప్రచారం. కృష్ణపట్నంలో జాతర. సోషల్ మీడియాలో మోత. కట్ చేస్తే.. ఇప్పుడు ఆయన మందు తయారు చేస్తున్నారో లేదో తెలీదు.. ఆయనసలు కృష్ణపట్నంలో ఉన్నారో లేరో కూడా తెలీదు.. అసలెవరైనా ఆనందయ్య మందు తీసుకుంటున్నారో లేదో తెలీదు.. అసలిప్పుడు ఆనందయ్య ఊసే లేదు.. ఆయనతో పాటు ఆయన మందూ కనిపించడం లేదు.. అసలేం జరిగింది? మంత్రం వేసినట్టు ఆయన ఉనికి ఎందుకు మాయమైపోయింది? ఎవరి తంత్రానికి ఆ మందు మరుగునపడింది? మందు కోసం కృష్ణపట్నంకు జనాలు ఎందుకు క్యూ కట్టడం లేదు? ఆన్‌లైన్లో మందు సరఫరా చేస్తామన్నారు ఏమైంది? అన్నీ చిక్కుప్రశ్నలే. అంతకు మించి అనుమానాలే.
రాజకీయం తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. రాత్రికిరాత్రి ఆనందయ్యను దేవుడిని చేసేశారు ప్రజలు. రాత్రికిరాత్రి ఆ దేవుడిని కనుమరుగు చేశారు రాజకీయ నేతలు. పాలకులు తలుచుకుంటే ఏదైనా చేస్తారని చెప్పడానికి ఆనందయ్య ఎపిసోడే బెస్ట్ ఎగ్జాంపుల్. మందుకు విపరీతమైన క్రేజ్ ఉన్నప్పుడు.. కృష్ణపట్నం జనాలతో కిక్కిరిసిపోయినప్పుడు.. పరీక్షల పేరిట ప్రభుత్వం రంగంలోకి దిగింది. అది ఎంటర్ ది డ్రాగన్ అనే విషయం ఆ సమయంలో ఆనందయ్యకు కూడా తెలీకపోవచ్చు. క్రమక్రమంగా అనకొండా మింగేసినట్టు.. ఆనందయ్య మందుకున్న డిమాండ్‌ను డైల్యూట్ చేసేశారు పాలకులు. ఆ పరీక్షలు, ఈ పరీక్షలు.. ఆ అనుమతులు, ఈ అనుమతులు అంటూ వారల తరబడి ఆలస్యం చేశారు. 144 సెక్షన్‌తో కృష్ణపట్నంను ప్రజలకు దూరం చేసేశారు.
అదే సమయంలో నాయకులు ముసుగు తీసేశారు. ఆనందయ్యను హైజాక్ చేసేసి.. రహస్యంగా టన్నులకు టన్నులు మందు తయారు చేయించుకున్నారు. రాత్రికి రాత్రే.. కార్లల్లో, డబ్బాల్లో ఆనందయ్య మందు ప్రభుత్వ పెద్దలకు, రాజకీయ ప్రముఖులకు, పక్కరాష్ట్ర సన్నిహితులకు చేరవేశారు. ఈ గూడుపుఠాని అంతా స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్థన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిందనేది టీడీపీ నేత సోమిరెడ్డి మాట. రోజుల తరబడి మందు తయారు చేయించుకుని.. తమ వారందరికీ పంచేసుకొని.. ఇక చాలు అనుకున్నాకే ఆనందయ్యను వదిలేశారు. ఆ తర్వాత కూడా ఆయన్ను వైసీపీ ప్రజాప్రతినిధులే మళ్లీ హైజాక్ చేశారు. ముందు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు మాత్రమే ఆనందయ్య మందు ఇవ్వాలంటూ కండీషన్ పెట్టడం దారుణం. మరోవైపు, ఆనందయ్య కుమారుడిని, శిష్యులను తీసుకుపోయి.. మరో జిల్లా ఎమ్మెల్యే చెవిరెడ్డి తన వారికోసం.. తన పేరుతో, తన ఫోటోతో మందు పంపిణీ చేసుకోవడం వివాదాస్పదమైంది. ఆ తర్వాత వైజాగ్ ఎంపీ, ఒంగోలు ఎంపీల కోసం మాత్రమే మందు తయారు చేయాల్సి వచ్చింది ఆనందయ్యకు.
వారాలు గడుస్తున్నా.. ఆనందయ్య మందు వైసీపీ పాలకులకు మాత్రమే అందుబాటులోకి వస్తోంది కానీ, సామాన్య ప్రజలకు మాత్రం ఇంకా అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. పెద్ద ఎత్తున మందు తయారు చేసి, రాష్ట్ర ప్రజలందరికీ మందు పంపిణీ చేసేందుకు తాను సిద్ధమని.. అందుకు ప్రభుత్వం సహకరించాలంటూ ఆనందయ్య స్వయంగా సీఎం జగన్‌కు లేఖతో మొరపెట్టుకున్నా ఆయన వేదనను వినేవారెవరూ లేకుండా పోయారు. కనీసం.. మందు తయారు చేసేందుకు అవసరమైన గిన్నెలు, వనమూలికలు, కరెంట్ సరఫరా చేసేందుకూ సర్కారు ముందుకురాకపోవడం దారుణమైన విషయం అంటున్నారు. మొదట ఆనందయ్య మందును తయారు చేసేందుకు టీటీడీ సిద్ధమైంది. కానీ, ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడో మరే కారణమో తెలీదు కానీ ఆ తర్వాత టీటీడీ సైడ్ అయిపోయింది. ఇక, ఆన్‌లైన్‌లోనూ అడ్డగోలుగా అమ్ముకునే ప్రయత్నం చేసినా.. సోమిరెడ్డి ఎంట్రీతో ఆ కుతంత్రానికి ఆదిలోకే అడ్డుపడింది.
ఇప్పటికీ ఆనందయ్య మందు కరోనా పాలిట బ్రహ్మాస్త్రంగానే భావిస్తున్నారు అంతా. ప్రజల్లో ఆ మందుపై ఎలాంటి అనుమానమూ లేదు. కాకపోతే, జనానికి అందుబాటులో లేకుండా చేయడంతో.. ఇక మనకు ఆనందయ్య మందు దక్కే ప్రాప్తం లేదులే అనే అభిప్రాయానికి వచ్చేశారు బాధితులు. సంజీవనిలాంటి మందును అంతా మర్చిపోయేలా చేయడంలో పాలకులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. ఆనందయ్య మీడియా ముందుకు రాకుండా, ఆనందయ్య మందు కోసం ఎవరూ రాకుండా.. గట్టిగా కట్టడి చేశారు.
ఆయుష్ సైతం ఓకే అంది. హైకోర్టూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. సర్కారూ సై అంది. ఆ తర్వాత ఏదో జరిగింది. తెర వెనుక పావులు కదిపారు పెద్దలు. ఇక అంతే. ఆనందయ్య మందు జనానికి అందుబాటులో లేకుండా పోయింది. ఆ కుట్రలు, కుతంత్రాలకు కారకులెవరు? ఇదంతా రాజకీయమా? పాలకుల సాయంతో డ‌్రగ్ మాఫియా పన్నిన పన్నాగమా? మెడికల్ మాఫియా మామూళ్ల కోసం ప్రభుత్వ పెద్దలు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారా? అందరివాడు ఆనందయ్యను అందరికీ దూరం చేసేసినట్టేనా? ప‌్రాణాలు నిలపే మందుకు పాతరేసినట్టేనా? సమాధానం లేని ప్రశ్నలివి.