మండలి రద్దు.. ఆనాడు ఏమైంది? ఇప్పుడు ఏమవుతోంది?
posted on Jun 21, 2021 @ 11:56AM
మాట తప్పును.. మడమ తిప్పను.. ఈ డైలాగ్ సీఎం జగన్‌రెడ్డికి ట్యాగ్‌లైన్. అయితే, ఇదంతా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే. అందలమెక్కాక అంతా అరాచకమే. అడుగడుగునా మాట తప్పడమే.. ప్రతీ అడుగులోనూ మడమ తిప్పడమే. అందుకు, రాజధాని అమరావతి వ్యవహారమే బెస్ట్ ఎగ్జాంపుల్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 33వేల ఎకరాలు సరిపోవు, ఇంకా చాలా పెద్ద రాజధాని ఉండాలన్న జగన్.. సీఎం కాగానే రాజధానిని మూడు ముక్కలు చేసి అమరావతి నోట్లో మట్టికొట్టారనే విమర్శ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలానే ఉన్నాయి యూటర్న్ నిర్ణయాలు. అవన్నీ తెలియాలంటే ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు.. సీఎం జగన్‌రెడ్డికి రాస్తున్న లేఖలు చూడాల్సిందే. తాజాగా, జగన్ యూటర్న్‌పై మరో లేఖాస్త్రం సంధించారు రఘురామ. ఈసారి మండలి రద్దు అంశాన్ని గుర్తు చేశారు. అప్పుడెప్పుడో మీ అవసరం కోసం మండలి రద్దు కోసం ఓవరాక్షన్ చేశారుగా.. మరి, అవసరం తీరిపోయిందనా.. ఇప్పుడు ఎందుకు సైలెంట్‌గా ఉన్నారంటూ చురుక్కులు అంటించారు.
గత ఏడాది మూడు రాజధానుల ఏర్పాటు, ఏపీ సీఆర్‌డీఏ చట్టాలను రద్దు చేస్తూ.. జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సంఖ్యాబలం ఉన్న అసెంబ్లీలో వాటిని అమోదించేసుకుంది. కానీ, పెద్దల సభలో జగన్ దూకుడుకు చెక్ పడింది. శాసన మండలిలో టీడీపీకి ఆధిపత్యం ఉండటంతో జగన్‌రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల బిల్లుకు అడ్డుకట్ట వేసింది. ఆ రోజు మండలిలో జరిగిన హైరేంజ్ పొలిటికల్ డ్రామా ఇప్పటికీ అందరికీ గుర్తే ఉండి ఉంటుంది. సర్కారు మండలిలో మంత్రులందరినీ మోహరించినా, ఛైర్మన్‌పై ఎంతగా ఒత్తిడి తీసుకొచ్చినా.. నారా లోకేశ్ వ్యూహాలతో ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తప్పలేదు. టీడీపీ సీనియర్ సభ్యుడు యనమల రామకృష్ణుడు తన అనుభవంతో వేసిన ఎత్తుగడలకు.. జగన్‌రెడ్డి సర్కారుకు మండలిలో దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి, అసహనానికి గురయ్యారు సీఎం జగన్. రాత్రికిరాత్రి మండలి రద్దుకు ప్రతిపాదించారు. తన తండ్రి వైఎస్సార్ పునరుద్దరించిన మండలి వ్యవస్థపై వేటు వేయాలనుకున్నారు. వెంటనే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. కానీ, ఇప్పటికీ మండలి రద్దు కాలేదు. ఆ మేరకు జగన్‌రెడ్డి తరఫున ఎలాంటి ప్రయత్నాలూ జరగలేదు. అప్పటినుంచి ఇప్పటివరకు పలుమార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం జగన్‌రెడ్డి.. కేంద్రం ముందు మండలి రద్దు డిమాండ్‌ను పెట్టడమే లేదు. అందుకే, ఎంపీ రఘురామ.. మండలి రద్దు నిర్ణయం ఏమైంది సీఎం గారు? అంటూ లేఖ రాయడం ఆసక్తిగా మారింది.
ఆనాడు మండలిలో తమ నిర్ణయం చెల్లుబాటు కాలేదనే అసహనంతో ఆవేశంలో తీసుకున్న నిర్ణయం అది. కానీ, కాలం గడిచే కొద్దీ.. మండలిలో వైసీపీ సంఖ్యాబలం పెరుగుతూ వస్తోంది.. ఆ మేరకు టీడీపీ బలం తగ్గిపోతోంది. అందుకే, మండలి రద్దు నిర్ణయంపై జగన్‌రెడ్డి వైఖరిలో మార్పు వచ్చింది. తమది అప్పర్ హ్యాండ్ అవగానే.. మండలి రద్దుపై మాట తప్పారు.. మడమ తిప్పారు.. అంటూ ఎంపీ రఘురామ.. సీఎం జగన్‌ను నిలదీస్తూ లేఖ రాశారు. మెజార్టీ ఉన్నప్పుడు మండలి రద్దు చేస్తే చిత్తశుద్ధిని ప్రజలు నమ్ముతారన్నారు. మెజార్టీ లేనప్పుడు మండలి రద్దుకు చేసిన తీర్మానం ప్రజల్లో సందేహాలు లేవనెత్తింద న్నారు. మండలిలో మెజార్టీ సాధించిన తర్వాత రద్దు చేస్తే ప్రజల్లో మీ గౌరవం పెరుగుతుందని రఘురామ లేఖలో ప్రస్తావించారు. మండలి కొనసాగించడం వృథా అవుతుందని జగన్ చెప్పిన మాటలను నమ్మాలంటే.. తక్షణమే మండలిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. క్రమశిక్షణ గల పార్టీ కార్యకర్తగా మండలి రద్దుకు పార్లమెంట్‌లో ప్రయత్నిస్తానన్నారు.
ఎంపీ రఘురామ లేఖతో జగన్‌రెడ్డి సర్కారు ఉలిక్కిపడుతోంది. మాట ఇచ్చాం.. మర్చిపోయాం.. మడమ తిప్పేశాం.. మరుగున పడిపోయిందనుకున్న ఆ అంశాన్ని ఇప్పుడు మళ్లీ రఘురామ లేఖతో వెలుగులోకి తీసుకురావడంతో.. ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలీక తెగ ఇబ్బంది పడుతోంది. తానే స్వయంగా పార్లమెంట్‌లో ఈ అంశాన్ని ప్రస్తావిస్తానని అనడంతో ఎంపీ రఘురామ అన్నంత పనీ చేస్తే ఎలా అని బెదిరిపోతోంది. ఒకవేళ మండలి రద్దు అయిపోతే? తమ పార్టీ రాజకీయ ఉపాధికి గండి పడుతుందని ఆందోళన చెందుతోంది. ఏ ముహూర్తాన రఘురామతో పెట్టుకున్నారో కానీ, అప్పటి నుంచి జగన్‌రెడ్డిని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదుగా....! రాజు గారు తగ్గేదే లే అంటూ తెగ రెచ్చిపోతూ ఏపీ పాలిటిక్స్‌లో కాక రేపుతున్నారు.