వేర్పాటువాదులారా.. మహాత్ముడి బాటలో నడవలేరా?
posted on Oct 2, 2012 @ 10:21AM
గాంధీ మహాత్ముడు ఎన్నుకున్న సత్యాగ్రహమనే పదునైన ఆయుధం తెల్లవాళ్లకు కంటిమీద కునుకులేకుండా చేసింది. ఎక్కడా హింసలేదు. ఎక్కడా పరుష పదజాలం లేదు. ఎక్కడా దూకుడు తత్వంలేదు. అంతా శాంతి యుతంగా సాగిపోయింది. పరాయిదేశంనుంచి వచ్చి మనపంచన చేరి తిరిగి మన జాతినే బానిస జాతిగా భావించి నెత్తికెక్కిన బ్రిటిషర్లను గాంధీ మహాత్ముడు శాంతి మార్గంలోనే మట్టికరిపించాడు తప్ప తన జీవితం మొత్తంలో ఒక్కమాటకూడా పరుషంగా మాట్లాడలేదు. రాజకీయమంటే ఇలాగే ఉండాలని మొత్తం ప్రపంచానికి చూపించిన మహనీయుడు గాంధీజీ. తన గొప్పదనంవల్లే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని తెలిసినా పదవుల్ని ఆశించకుండా దేశంకోసమే నిలిచిన త్యాగశీలి గాంధీజీ. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని చూస్తున్న గాంధీజీ ఆత్మ నిజంగా ఎంతగా క్షోభపడుతోందో.. వేర్పాటు వాదం తెగ బలిసిపోయి రాళ్లు రప్పలు విసిరేసుకుంటూ జనం విధ్వంసానికి దిగుతున్న హీన స్థితిని చూడలేకే కొండా లక్ష్మణ్ బాపూజీలాంటి గాంధేయవాది తనువు చాలించారేమో.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకోసం ఉద్యమిస్తున్న వాళ్లలో నమ్మిన సిద్ధాంతం కోసం కట్టుబడుతున్నవాళ్లు ఈ రోజు ఎంతమందున్నారు..? ప్రత్యేకరాష్ట్రంకోసం పోరాటం పేరుతో స్వలాభంచూసుకుంటున్న నేతల చేతిలో అమాయకులు చాలామంది బలైపోతున్నారన్న సత్యాన్ని గుర్తించడానికి ఎందుకు ఎవరూ ఇష్టపడడంలేదు..? ప్రత్యేక రాష్ట్రంకోసం ఉద్యమిస్తున్న వాళ్లందరూ మహాత్ముడి జీవితంనుంచి సత్యమార్గంలో ఎంతటి ఫలితాన్నైనా సాధించుకోవచ్చన్న విషయం ఎందుకు తట్టడంలేదో..! ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పేరుతో అభివృద్ధి నిరోధకులుగా మారిన కుటిల రాజకీయ నేతలకు మహాత్ముడి ఆత్మ మూడు ప్రశ్నలు వేస్తోంది. మహాత్ముడి బాటలో నడిచి సత్యాగ్రహాలతో మీక్కావాల్సినందాన్ని మీరు సాధించుకోలేరా..? మీమీద మీకు ఆమాత్రం నమ్మకంలేదా..? నిజంగా మీక్కావాల్సింది ప్రత్యేక రాష్ట్రమా.. లేక అంతులేని స్వలాభమా..?