నిర్భయకు ఎప్పటికి న్యాయం జరిగేను...
posted on Dec 19, 2019 @ 10:03AM
పాత తీర్పు పై సమీక్ష అక్కర్లేదు..ఉరి తీయాల్సిందే.. అని నిర్భయకేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశం ఇవ్వడంతో బాధితుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. ఆ దుర్మార్గులకు త్వరలోనే ఉరి అనే వార్తలొచ్చాయి. కానీ, అంతలోనే ఆ ఆశలన్నీ అడియాశలయ్యాయి. ఉరికి ఇంకా సమయం పట్టేలా ఉంది. నిర్భయ మరణించి 7 ఏళ్ళు గడిచినా ఇప్పటికి దోషులు హాయిగా జైల్లో జీవితాన్ని గడుపుతునే ఉన్నారు. ఉరికి రంగం అంతా సిద్ధం,ఉరి తాళ్ళు కూడా సిద్ధం అన్న మాటలకు మళ్లీ బ్రేక్ పడింది..నిర్భయ కేసులో దోషులకు డెత్ వారెంట్ పై ఢిల్లీ కోర్టు విచారణను వాయిదా వేసింది .ఈ కేసు విచారణ జనవరి 7డవ తేదీకి వాయిదా పడింది. తక్షణమే డెత్ వారెంట్ విడుదల చేయాలన్న నిర్భయ తల్లిదండ్రుల పిటిషన్ ను న్యాయస్థానం పక్కనపెట్టింది. దోషులకు కూడా కొన్ని హక్కులుంటాయని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పు పై కన్నీరుమున్నీరయ్యారు నిర్భయ తల్లిదండ్రులు.14 రోజుల్లో ఆ నలుగురిని ఉరి తీయాలని నిర్భయ తల్లిదండ్రులు పిటిషన్ లో పేర్కొన్నారు. తీహార్ జైలు అధికారులకు కూడా పాటియాలా హౌస్ కోర్టు నోటీసులు జారీ చేసింది. రాష్ట్రపతికి క్షమాభిక్ష పెట్టుకునే ఆలోచన ఉందేమో కనుక్కోవాలని తీహార్ జైలు అధికారులకు సూచించింది. అందుకు వారం రోజులు గడువు విధించింది. కాగా, పాటియాలా హౌస్ కోర్టు తీర్పు పై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు నిర్భయ తల్లిదండ్రులు. తమ బిడ్డను పొట్టన పెట్టుకున్న మృగాళ్లు జీవించటానికి న్యాయస్థానం మరింత కాలాన్ని ఇవ్వడం దారుణమన్నారు. నిందితులకు డెత్ వారెంట్ విడుదల చేయకపోవడం పై నిర్భయ తల్లి కన్నీరుమున్నీరయ్యారు. న్యాయస్థానం తమ వాదనలు పట్టించుకోవడం లేదని, ఏడేళ్ళపాటు క్షోభ అనుభవించామని వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు.ఎందుకు కోర్టు నిందితులకి సహకరిస్తుందో వారి విషయంలో ఎక్కువ జీవితం గడిపే సమయాన్ని ఎందుకు కల్పిస్తుందో తెలీక వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.