జాతీయ రహదారి చెక్ పోస్ట్ లు అధికారుల లంచాలకు అడ్డాగా మరాయా?
posted on Dec 19, 2019 @ 11:25AM
పట్ట పగలు అని కూడా లెక్క చేయకుండా జాతీయ రహదారి పై అధికారులు చేతివాటం తెగ చూపించేస్తున్నారు. ఏపీ నుండి పొరుగు ప్రాంతాలకు అదే విధంగా రాష్ట్ర సరిహద్దు మీదుగా ఇసుకను ఎలాంటి అక్రమ రవాణాకు తావు లేకుండా నిబంధనల మేరకు ఆయా ప్రాంతాలకు తరలించే క్రమంలో ప్రభుత్వం అన్ని జిల్లాల్లో తనిఖీ చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. పంచాయితీ రాజ్ ఆధ్వర్యంలో అన్ని చెక్ పోస్టులలో ప్రత్యేక శిబిరంతో పాటుగా తనిఖీ గేటును ఏర్పాటు చేసి సీసీ కెమెరాలకు అనుసంధానం చేసేలా తగిన చర్యలను ఉన్నతాధికారులు తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులోని పెరియవట్టు కుప్పం వద్ద జాతీయ రహదారి పై ప్రత్యేక తనిఖీ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. 24 గంటల పాటు ఇసుక రవాణా పై అప్రమత్తంగా ఉండేలా తగిన పోలీస్ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఇక్కడ డ్యూటీ చేస్తున్న సిబ్బందికి చేతి వాటం పెరిగింది. వచ్చిన వాహనంలో ఏముందని గుర్తించకుండా ఇతరత్ర వాహనాల పై దృష్టిపెడుతున్నారు. ఆంధ్రా మీదుగా తమిళనాడులోకి ప్రవేశించి ఓ అట్టల చెత్త లారీని డ్యూటీ పోలీసులు ఆపారు. వాహనంలో ఏముందంటూ మాటలు కలిపాడు. రవాణాకు చెందిన కాగితాలు ఉన్నాయా అంటూ డ్రైవర్ చూపించిన కాగితాలను చూసి సరే అన్నాడు. మరి తన సంగతి ఏంటంటూ నిర్భయంగా పట్టపగలే కాసులు డిమాండ్ చేస్తూ చేయిచాచాడు. వాహన డ్రైవర్ ఇచ్చిన నగదు సరిపోకపోవటంతో మరింత కావాలనీ అడిగి మరీ తీసుకొని కానీ వాహనానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు.చెత్తను తరలించే వాహనానికి చెయ్యి తడపాలన్న డ్యూటీ సిబ్బంది అక్రమ ఇసుకను తరలించే వాహనాల వస్తే పండుగ చేసుకున్నట్లే అవుతోంది. మరి ఇక ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారులే రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఇలాంటి తంతుల పై ఏం చెబుతారో చూద్దాం.