టీపీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి! ఏఐసీసీలోకి కోమటిరెడ్డి, పొన్నం
posted on May 31, 2021 @ 6:26PM
తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేసీఆర్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అయిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారు. ఆయన ఢిల్లీకి వెళ్లి కాషాయ పార్టీ పెద్దలతో చర్చలు కూడా సాగించారు. ఈటల రాజేందర్ ను కాంగ్రెస్ లోకి తీసుకొచ్చేందుకు.. కొందరు హస్తం పార్టీ నేతలు ప్రయత్నించినా సక్సెస్ కాలేకపోయారు. ఈటల బీజేపీలో చేరుతుండటంతో కాంగ్రెస్ పార్టీ మరింత అప్రమత్తమైంది. చాలా కాలంగా పెండింగులో ఉన్న తెలంగాణ పీసీసీ పదవిని వీలైనంత త్వరగా ప్రకటించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
తెలంగాణ పీసీసీ రేసులో కోమటికరెడ్డి వెంకట్ రెడ్డి, రేవంత్ రెడ్డి ముందున్నా.. ఎంపీ రేవంత్ రెడ్డినే రాహుల్ గాంధీ ఫైనల్ చేశారని సమాచారం. సీఎం కేసీఆర్ ను, బీజేపీ దూకుడును ఎదుర్కొవాలంటే రేవంత్ రెడ్డే సరైన నేత అని హస్తం హైకమాండ్ నిర్ణయించిందని తెలుస్తోంది. పీసీసీ పీఠం కోసం చివరి వరకు పోరాడిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఏఐసీసీ కార్యదర్శి పదవి ఇవ్వనున్నారట. ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా ఏఐసీసీలోకి వెళ్లనున్నారని కాంగ్రెస్ వర్గాల సమాచారం. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా దామోదర రాజనర్సింహ, షబ్బీర్ అలీ, మధు యాష్కి గౌడ్ ను నియమించనున్నారట. అన్ని వర్గాలకు ప్రాధాన్యత దక్కేలా సామాజిక న్యాయం చేసేలా రాహుల్ టీమ్ కసరత్తు చేసిందని సమాచారం.
దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ మూడో స్థానానికి పడిపోవడంతో.. నైతిక బాధ్యత వహిస్తూ పీసీసీ పదవికి రాజీనామా చేశారు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి. అప్పటి నుంచే ఏఐసీసీ పీసీసీ చీఫ్ కోసం కసరత్తు చేసింది. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్ డిసెంబర్ లోనే పార్టీ నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. సోనియా జన్మదినమైన డిసెంబర్ 9నే పీసీసీ ప్రకటన వస్తుందనే ప్రచారం జరిగింది. అయితే అది వాయిదా పడింది. తర్వాత నాగార్జున సాగర్ ఉప ఎన్నిక రావడంతో.. అది ముగిసేవరకు పీసీసీ ఎంపిక అపాలని జానారెడ్డి కోరడంతో మళ్లీ వాయిదా పడింది. నాగార్జున సాగర్ ఎన్నిక ముగిసి నెల రోజులు దాటినా పీసీసీ ఎంపికపై కదలిక రాలేదు. ఇంతలోనే తన మంత్రివర్గం నుంచి ఈటల రాజేందర్ ను కేసీఆర్ తప్పించడంతో రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి.
ఈటల రాజేందర్ కాంగ్రెస్ లో చేరేలా కొందరు నేతలు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. ఈటల బీజేపీలో చేరుతుండటంతో ఆయనతో పాటు మరికొందరు నేతలు కమలం గూటికి చేరే అవకాశం ఉంది. చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయనను కూడా బీజేపీ గాలం వేస్తుందని తెలుస్తోంది. అయితే పీసీసీ పగ్గాలు రేవంత్ రెడ్డికి ఇస్తే కొండా .. కాంగ్రెస్ లోనే కొనసాగుతారని చెబుతున్నారు. అంతేకాదు కేసీఆర్ సర్కార్ పై వ్యతిరేకంగా ఉన్న యువత అంతా రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారని రాహుల్ టీమ్ సర్వేలో తేలిందట. అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించాలని రాహుల్ గాంధీ డిసైడ్ అయ్యారని పక్కాగా తెలుస్తోంది.