సెంచరీ బాదేసిన జగన్.. క్రిస్‌గేల్ రికార్డు బద్దలు..
posted on May 31, 2021 @ 7:00PM
అవును. మీరు చదివింది కరెక్టే. సీఎం జగన్ సెంచరీ కొట్టారు. సెంచరీలు కొట్టడంలో మాస్టర్ అయిన క్రిస్‌గేల్ రికార్డు బద్దలు కొట్టారు. బ్యాట్ పట్టుకొని బాదుతూ.. ఒక్కో పరుగు జత చేస్తూ.. సైలెంట్‌గా సెంచరీ చేసేశారు. స్కోర్ బోర్డ్ గిర్రున తిరిగి.. మీటర్ 100 చూపిస్తే కానీ తెలీలేదు జనాలకు.. జగన్ సెంచరీ బాదేసిన విషయం. ఇలా.. జగన్‌పై క్రికెట్ బాషలో ఆసక్తికర కామెంట్స్ చేసింది మరెవరో కాదు నారా లోకేశ్. ఇంతకీ, సెంచరీ ఎందులోనో తెలుసా...
ఏపీలో లీటర్ పెట్రోల్ ధర వంద దాటేసింది. విజయవాడలో సక్సెస్‌ఫుల్‌గా సెంచరీ కొట్టింది. రాష్ట్ర ప్రభుత్వం అధిక పన్నులు బాదడం వల్లే పెట్రోల్ రేట్ ఏపీలో వంద రూపాయలకు చేరిందంటూ టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఆ సందర్భంగా క్రికెటర్ క్రిస్‌గేల్‌తో సీఎం జగన్‌రెడ్డిని కంపేర్ చేస్తూ లోకేశ్ వేసిన పంచ్‌లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ కామెంట్స్ ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి.
పెట్రోల్ ధర రూ.100 దాటడంపై నారా లోకేశ్ సీఎం జగన్‌పై బౌన్సర్లు విసిరారు. ఐపీఎల్‌లో క్రిస్ గేల్ సుడిగాలి సెంచరీతో రికార్డు స్థాపించాడని.. ఇప్పుడా రికార్డును ఇండియన్ పెట్రోల్ లీగ్ (ఐపీఎల్)లో.. 3 క్యాపిటల్స్ జట్టు కెప్టెన్.. బాదుడురెడ్డి బద్దలు కొట్టారంటూ.. జగన్‌రెడ్డిపై సెటైర్లు వేశారు నారా లోకేశ్.
దేశంలో లీటరు పెట్రోల్ రేటు సెంచరీ దాటించిన రాష్ట్రాల్లో ఏపీని అగ్రస్థానంలో నిలపడం ద్వారా, అవినీతిలోనూ, ధరలు పెంచడంలోనూ తానే ఏ1 అని జగన్ నిరూపించుకున్నారని లోకేశ్ ఎద్దేవా చేశారు.
ట్యాక్సులు తగ్గించుకుంటే పెట్రోల్, డీజిల్ తక్కువ ధరలకే ఇవ్వొచ్చని నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ బాదుడు రెడ్డి ఫేక్ కబుర్లు చెప్పారని ఆరోపించారు. కానీ, అధికారం చేపట్టాక మామూలు ట్యాక్స్ లను రెండింతలు చేసి, దానికి జే ట్యాక్స్ కూడా కలిపి మరీ పెట్రోల్ ధరను సెంచరీ దాటించారని లోకేశ్ మండిపడ్డారు. కామెంట్లతో పాటు గతంలో విపక్షనేతగా జగన్ చేసిన వ్యాఖ్యల వీడియోను.. బాదుడే బాదుడు అనే టైటిల్‌తో ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు నారా లోకేశ్.
ఏపీలో పెట్రోల్ ధర వంద మార్క్‌ను టచ్ చేయడంపై సామాన్యులు మండిపడుతున్నారు. జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుటి నుంచీ ఏపీలో అన్నిరకాల ధరలు పెరిగాయని గుర్తు చేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగితే.. అవి పరోక్షంగా నిత్యవసరాల ధరలూ పెరిగేందుకు కారణమవుతాయని.. అప్పుడు ప్రజలందరి మీద భారం పడక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఖజానా ఖాళీ చేసి.. అప్పులతో పాలనను నెట్టుకొస్తున్న జగన్.. ఇంధనంపై ఎడాపెడా పన్నులు బాదేయడం వల్లే చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా ఏపీలో పెట్రోల్ రేట్ సెంచరీ కొట్టిందంటూ సీఎం జగన్‌రెడ్డిపై వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.