జగన్ సర్కార్ కు మరో షాక్.. రాజద్రోహం కేసులో సుప్రీం కీలక ఆదేశాలు
posted on May 31, 2021 @ 6:26PM
నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు కేసులో ఏపీ సర్కార్ కు మరోసారి చుక్కెదురైంది. ఎంపీ రఘురామ కేసులో మీడియా సంస్థలపై ఎటువంటి తీవ్రమైన చర్యలు చేపట్టరాదని.. ఏపీ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. టీవీ5, ఏబీఎన్ ఛానెళ్లపై రాజద్రోహం కేసు పెట్టడాన్ని తప్పుబట్టింది. రాజద్రోహం కేసు నమోదు చేసేంత తప్పు ఏం చేశారని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ప్రశ్నించింది. ఎంపీ రఘురామ వ్యాఖ్యలను ప్రసారం చేయడం.. రాజద్రోహం ఎలా అవుతుందని కామెంట్ చేసింది. ఏ సందర్భంలో రాజద్రోహం కేసు పెట్టాలో.. స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాల్సిన అవసరం ఇప్పుడు ఏర్పడిందని ధర్మాసనం తెలిపింది. సెక్షన్ 124ఏ, 153 పై సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తెలిపింది. ప్రతి చిన్నవిషయానికి రాజద్రోహం కేసు పెడితే.. అసలు ఏ వార్తలు కూడా మీడియా ప్రసారం చేయలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. గంగానదిలో మృతదేహాన్ని పడేస్తున్న దృశ్యాన్ని ఓ టీవీ చానల్ చూపించిందని, మరి ఆ చానల్‌పై దేశద్రోహం కేసు పెట్టలేదా..? అని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.
ఎంపీ రఘురామతో కలిసి ఏబీఎన్, టీవీజ్ఞ కుట్రచేసినట్టు.. ఎఫ్‌ఐఆర్‌లో దర్యాప్తు సంస్థ ధృవీకరించలేదని న్యాయమూర్తి అన్నారు. మీడియాను గుప్పిట్లో ఉంచుకునేందుకు, భయపెట్టేందుకు.. రాజద్రోహం కేసు నమోదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వంపై చేసే ప్రతి విమర్శ రాజద్రోహం కాదని, ప్రతివాదులైన ఏపీ ప్రభుత్వానికి, సీబీసీఐడీ, తెలంగాణ ప్రభుత్వానికి.. కేంద్ర హోంశాఖకు, కేంద్ర సమాచార ప్రసార శాఖకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణ ఆరు వారాలకు వాయిదా వేసింది. నాలుగు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను సుప్రీంకోర్టు ఆదేశించింది.
మరోవైపు ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ పి.సి.పంత్‌ను ఎంపీ రఘురామకృష్ణరాజు కలిశారు. విచారణ సందర్భంగా ఏపీ సీఐడీ పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని, మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డారని ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఎన్‌హెచ్‌ఆర్సీకి రఘురామ తనయుడు భరత్ ఫిర్యాదు చేశారు. భరత్ ఫిర్యాదుపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం, డీజీపీ, సీఐడీకి నోటీసులు జారీచేస్తూ అంతర్గత విచారణకు ఎన్‌హెచ్‌ఆర్సీ ఆదేశించింది. ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్ పంత్‌ను కలిసి సీఐడీ అధికారులు వ్యవహరించిన తీరును స్వయంగా రఘురామకృష్ణరాజు వివరించారు.