అమెరికా నెత్తిన సుడిగుండం.. టోర్నడోలతో అగ్రరాజ్యం ఆగమాగం..
posted on Dec 13, 2021 @ 11:36AM
రష్యా అంటే భయం లేదు. చైనా అంటే బెదురులేదు. కొరియా కోరలు పీకేసింది. ఇరాన్‌ను ఇరగదీసేసింది. ఆర్థికం, అణ్వాయుధం, మేధోసంపత్తి, సైన్స్ అంట్ టెక్నాలజీ.. ఇలా అన్ని రంగాల్లో అమెరికాదే ఆధిపత్యం. ప్రపంచానికి తానే పెద్దన్నలా ఫోజులు కొట్టే యునైటెడ్ స్టేట్స్.. ప్రకృతి పేరెత్తితే మాత్రం గజగజా వణికిపోతోంది. ప్రకృతి ప్రకోపం ముందు మాత్రం పిల్లిలా తోకముడుస్తుంది. చలి, వేడి గాలులు.. సైక్లోన్లు.. టోర్నడోలు.. ఎప్పుడూ ఏదో ఒకలా వాతావరణం అమెరికాతో ఓ ఆటాడుకుంటుంది. ఆ దేశం చేస్తున్న పర్యావరణ హననంపై ఏదో రూపంలో రివేంజ్ తీసుకుంటోంది. తాజాగా, టోర్నడోతో విరుచుకుపడుతోంది. సుడిగుండం అమెరికా పాలిట పెనుగండంగా మారింది. వందేళ్లలో ఏన్నడూ లేనంత బీభత్సం సృష్టిస్తోంది.
టోర్నడోల దెబ్బకు అమెరికాలోని పలు రాష్ట్రాలు, కౌంటీలు దారుణంగా దెబ్బతింటున్నాయి. సుడిగుండం చుట్టేసి.. భవనాలు, పరిశ్రమలు, స్తంభాలు, వృక్షాలను అమాంతం నేలమట్టం చేస్తున్నాయి. టోర్నడో ధాటికి ఇప్పటికే అమెరికావ్యాప్తంగా 100 మందికి పైగా మృతి చెందారు. ఆరు రాష్ట్రాలను.. 30 వరకూ టోర్నడోలు అల్లకల్లోలం చేసేశాయి. కెంటకీ స్టేట్ పరిస్థితి మరీ అధ్వానంగా ఉంది. ఆ రాష్ట్రంలోనే 70 మంది వరకూ మరణించి ఉంటారని అంటున్నారు. కెంటకీలో ఎమర్జెన్సీ ప్రకటించారు. కెంటకీతో పాటు ఆర్క్‌న్సస్, ఇల్లినాయిస్, మస్సోరీ, మిసిసిప్పీ, టెనెస్సీ రాష్ట్రాల్లోనూ టోర్నడోలు బీభత్సం సృష్టించాయి. ఇల్లినాయిస్‌లోని అమెజాన్ వేర్‌హౌజ్ పైకప్పు కుప్పకూలి చాలామంది అమెజాన్ ఉద్యోగులు మృత్యువాతపడ్డారు.
ఒకదాని తర్వాత ఒకటిగా టోర్నడోలు గంటకు 200 మైళ్ల వేగంతో విరుచుకుపడడంతో.. ఆరు రాష్ట్రాలు అల్లకల్లోలంగా మారాయి. అనేక ఇళ్లు నేలమట్టమయ్యాయి. రోడ్డు మార్గాలు ధ్వంసమయ్యాయి. విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. మరో రెండు రోజుల్లో వాటి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందనే హెచ్చరికతో అమెరికన్లు భయంతో బెదిరిపోతున్నారు.. ఇల్లు వదిలి చెదిరిపోతున్నారు. అమెరికా చరిత్రలో అతిపెద్ద విపత్తుల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుందని అధ్యక్షులు బైడెన్ ఆవేదన వ్యక్తం చేశారు.
యూఎస్‌లో డిసెంబరులో భీకర తుపాన్లు రావడం చాలా అరుదు. కానీ, ప్రస్తుత టోర్నడో తీవ్రత, విస్తృతి వాతావరణ శాస్త్రవేత్తల్ని కూడా ఆశ్చర్య పరుస్తోంది. టోర్నడో ఇంతలా విరుచుకుపడటానికి వేడి వాతావరణం ఓ ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.