మరో కోడికత్తి?.. అమరావతిపై తగ్గేదేలే.. ఆర్కేకు బాబు సపోర్ట్.. టాప్‌న్యూస్ @1pm
posted on Dec 13, 2021 @ 12:19PM
1. ఏపీ హైకోర్టులో అమరావతి రైతులు పిటిషన్ వేశారు. తిరుపతిలో రాజధాని రైతుల బహిరంగ సభకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తూ అమరావతి పరిరక్షణ సమితి రిట్ పిటిషన్ దాఖలు చేసింది. సభను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతోందని రైతుల తరఫు న్యాయవాది లక్ష్మినారాయణ పిటిషన్‌లో తెలిపారు. తిరుపతిలో రాజధాని రైతుల సభకు అనుమతి ఇవ్వకుండా.. పోలీసులు అసంబద్ధ కారణాలు చూపుతున్నారన్నారు.
2. రాధాకృష్ణతో సహా మరో ముగ్గురు ఏబీఎన్ సిబ్బందిపై అక్రమంగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయటం వైసీపీ ప్రభుత్వ ఉన్మాదానికి పరాకాష్ట అని తీవ్ర స్థాయిలో చంద్రబాబు మండిపడ్డారు. ప్రజా సంక్షేమం గాలికొదిలి ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించే గొంతుకలను అణిచివేయటమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని విమర్శలు గుప్పించారు.
3. టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి.. సీఎం జగన్ రెడ్డి ప్రాణాలకు హానితలపెట్టొచ్చని తీవ్ర ఆందోళన వ్యక్తం చేయడం.. మరో కోడికత్తి డ్రామా, బాత్రూమ్ బాబాయ్ గొడ్డలివేటు రిహార్సల్లాగా అనిపిస్తోందన్నారు. ఓవైపు అప్పులకుప్ప, మరోవైపు తీవ్రమైన ప్రజావ్యతిరేకతతో.. అబ్బాయ్ గారు.. ఈ సారి ఏ బాబాయ్‌కి గురిపెట్టారో! అని అయ్యన్నపాత్రుడు ట్వీట్ చేశారు.
4. ‘‘నా ఇల్లు నా సొంతం’’ ప్రజా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని, టిడ్కో ఇళ్లను స్వాధీనం చేసుకుంటామని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మ సెంటర్ దగ్గర ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కుటుంబ సమేతంగా సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. టిడ్కో ఇళ్లను లబ్దిదారులకు ఇవ్వాలని, అందరికీ సొంత ఇళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
5. విజయవాడలో రాయలసీమ సాగునీటి సాధన సమితి ఆధ్వర్యంలో రాయలసీమ ధర్మ పోరాట దీక్ష చేపట్టింది. దీక్షలో సీమ జిల్లాల రైతులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఆకలి సమస్య, తాగు నీటి సమస్యపై ప్రభుత్వం స్పందించడం లేదని మండిపడ్డారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డులో ఏముందో కూడా తెలియకుండా నాయకులు మాట్లాడుతున్నారని, కృష్ణా యాజమాన్య బోర్డు విశాఖలో పెట్టడం దుర్మార్గమన్నారు. పాలనా వికేంద్రీకరణ అంటున్న జగన్‌కు చిత్తశుద్ధి ఉంటే హైకోర్టును కర్నూలులో పెట్టాలని రాయలసీమ నేతలు డిమాండ్ చేశారు.
6. వెలిగొండ నిర్వాసితులకు సీఎం జగన్ ఇచ్చిన హామీలు కొండెక్కాయని బీజేపీ నేత లంకా దినకర్ విమర్శలు గుప్పించారు. నిర్వాసితులకు హామీ ఇచ్చిన 899 కోట్లు ఇవ్వాలేని జగన్ ప్రభుత్వం వల్ల పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రాంతం ఏడారి గా మారుతుందన్నారు. వెలిగొండ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు గొంతు నులమడం అంటే పశ్చిమ ప్రకాశం జిల్లా ప్రజల గొంతులో చుక్క నీరు లేకుండా చేయడమే అని తెలిపారు. ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలో 15 లక్షల మందికి తాగునీరు - లక్షలాది ఏకరాలకు సాగు నీరు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు.
7. విశాఖలో మంత్రి అవంతి శ్రీనివాసరావు నివాసం ముందు కేజీహెచ్‌లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఆందోళన చేపట్టారు. మంత్రి ఇంటి ముట్టడికి ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో భారీగా పోలీసులు మోహరించారు. కేజీహెచ్‌లో పనిచేస్తున్న 65 మంది ఔట్ సోర్సింగ్ సిబ్బందిని చెప్పాపెట్టకుండా విధుల నుంచి తొలగించడంతో ఉద్యోగులు ఆందోళనకు దిగారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకుని ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు.
8. గుంటూరు జిల్లాలో వస్త్ర వ్యాపారుల నిరసన కొనసాగుతోంది. వస్త్రాలపై కేంద్రం నూతన పన్నులపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. వాసవి హోల్ సేల్ మార్కెట్‌లో వ్యాపారులు నిరసన ప్రదర్శన చేపట్టారు. వస్త్రాలపై కేంద్రం అదనపు జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ చేశారు. 12 శాతం నుంచి 5 శాతానికి తగ్గించాలని వ్యాపారులు డిమాండ్ చేస్తున్నారు.
9. శిల్పా చౌదరిని కస్టడీలో మూడు రోజుల పాటు ప్రశ్నించిన పోలీసులు.. ఆమెను చంచల్‌గూడ జైలుకు తరలించారు. కస్టడీలో శిల్ప పలు కీలక విషయాలు చెప్పినట్టు తెలుస్తోంది. కావాలనే కొంతమంది ప్రముఖుల్ని శిల్ప ఇందులోకి లాగినట్టు సమాచారం. శిల్ప అకౌంట్లు, ఆస్తులపై పోలీసులు ఆరా తీశారు.
10. ఆదిలాబాద్ జిల్లా బేల మంండలం సైద్‌పూర్ సమీపంలో పులి చర్మం పట్టుబడింది. ఇద్దరు వ్యక్తులను అటవీశాఖ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహారాష్ట్ర నుంచి అమ్మకం కోసం పులి చర్మాన్ని పట్టుకొస్తునట్టు నిర్ధారించారు. నెలన్నర క్రితం ఇంద్రవెల్లి మండలం వడ్‌గాంలోనూ పులి చర్మాన్ని అధికారులు పట్టుకున్నారు.