బీ అలర్ట్.. అక్టోబర్ తో బ్యాంకింగ్ లో కీలక మార్పులు..
posted on Oct 1, 2021 @ 12:36PM
అక్టోబర్ వచ్చేసింది .. వస్తూ వస్తూ మన దైనందిన జీవితంపై ప్రభావం చూపే అనేక మార్పులు తీసుకొంచ్చింది.ముఖ్యంగా బ్యాంకుల లావాదేవీలలో,అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. ఆటోపే రూల్స్ ఈరోజు నుంచే మారి పోయాయి... పాత చెక్ బూక్కులు ఇక పనిచేయవు. అన్నీ కాదు కానీ, చాలా వరకు బ్యాంక్ల చెక్బుక్లు ఇక చిత్తూ కాయితాలే.. అంటే కొత్త చెక్కు బుక్కులు మాత్రమే ఇకపై చెల్లుతాయి.ఆటో డెబిట్, నిరుపయోగంగా మారిపోతుంది. పోస్టాఫీస్ ఏటీఎంల వినియోగానికి ఛార్జీల భారం పడుతుంది. పోస్టాఫీస్ ఛార్జీలు సహా ఇంకా అనేక ఇతర అంశాలు ఇందులో ఉన్నాయి.వాహనాల ధరలు పెరుగ్తున్నాయి. ఇందులో పెన్షనర్లకు ఓ చిన్న శుభ వార్త కూడా ఉంది. ఇక పెంశానర్లు జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లోనూ..లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేయవచ్చును.. ఇలాగే ..ఇంకా ఏమేమి మార్పులున్నాయో ... అవేమిటో చూడండి ..
ఆర్బీఐ గతంలోనే తెలిపిన విధంగా బ్యాంకులు ఆటో డెబిట్ రూల్స్లో భారీ మార్పులకు అక్టోబర్ ఒకటిన శ్రీకారం చుట్టింది. సో .. ఇకపై ఆటో డెబిట్ సదుపాయం వినియోగించుకోవడం అంత సులువు కాదు. క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ఇకపై ఆటో డెబిట్ సదుపాయాన్ని వినియోగించుకోవాలంటే.. ఆ పేమెంట్కు అదనపు ధ్రువీకరణ (ఏఎఫ్‌ఏ) తప్పనిసరి. పెన్షనర్లు ప్రతి సంవత్సరం సమర్పించవలసిన లైఫ్ సర్టిఫికేట్ దాఖలు విషయంలో అనేక సమస్యలు ఎదుర్కోవడం చాలామందికి అనుభవంలో ఉన్నదే, ఇకపై ఆ సమస్య లేకుండా జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లోనూ..లైఫ్ సర్టిఫికేట్ దాఖలు చేయవచ్చును. 80 అంతకన్నా ఎక్కువ వయసున్న పెన్షనర్లకు ఇది సుభ వార్త. వారంతా తమకు దగ్గర్లో ఉన్న జీవన్ ప్రమాణ్ కేంద్రాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికేట్ను సమర్పించేందుకు వీలుంది. దేశవ్యాప్తంగా ఉన్న హెడ్ పోస్టాఫీసుల్లో ఈ కేంద్రాలు ఉంటాయి. అక్టోబర్ 1 నుంచి- నవంబర్ 30 వరకు ఈ సదుపాయం వినియోగించుకోవచ్చు.
ఇక బ్యాంకుల చెక్కు బుక్కుల విషయానికి వస్తే, కొన్ని బ్యాంక్ల పాత చెక్కు బుక్కులు అక్టోబర్ 1 నుంచి పని చేయవు..ఇందుకు సంబదించి ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ కస్టమర్లకు కీలక ప్రకటన చేసింది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఓబీసీ), యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) చెక్‌బుక్‌లు పనిచేయవని స్పష్టం చేసింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవాలని సూచించింది. గతేడాది ఏప్రిల్‌లో ఓబీసీ, యూబీఐ బ్యాంకులను పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో విలీనం చేసిన సంగతి తెలిసిందే. విలీనమైనప్పటికీ ఇప్పటివరకు పాత చెక్‌బుక్‌లనే కొనసాగించారు. అయితే అక్టోబర్ 1వ తేదీ నుంచి ఆ చెక్ బుక్‌లు పనిచేయబోవని పీఎన్‌బీ తాజాగా వెల్లడించింది. ఈ బ్యాంకుల ఖాతాదారులు వీలైనంత త్వరగా పీఎన్‌బీ ఐఎఫ్‌ఎస్‌సీ, ఎంఐసీఆర్‌లతో ఉన్న కొత్త చెక్‌బుక్‌లను తీసుకోవాలని తెలిపింది. ఏటీఎం, ఇంటర్నెట్ బ్యాంకింగ్, పీఎన్‌బీ వన్ నుంచి వీటిని దరఖాస్తు చేసుకోవాలని పేర్కొంది. లేదంటే కస్టమర్లు నేరుగా బ్యాంకు బ్రాంచీలకు వెళ్లి కూడా కొత్త చెక్‌బుక్‌లు తీసుకోవచ్చని తెలిపింది.
అలాగే అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పని చేసే జూనియర్ స్థాయి ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమలులోకి వస్తున్నాయి. జూనియర్ స్థాయి ఉద్యోగులంతా ఇకపై తమ స్థూల వేతనంలో 10 శాతం మొత్తాన్ని తాము నిర్వహిస్తున్న ఫండ్లో పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది. ఈ మేరకు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. 2023 అక్టోబర్ నాటికి ఈ పరిమితిని సెబీ20 శాతానికి పెంచనుంది.
ఇంత వరకు చాలా వరకు ఉచిత సేవలు అందిస్తున్న పోస్టాఫీస్ సేవలకు ఇక చార్జీల ఛార్జీల మోత తప్పదు. పోస్టాఫీస్లో సేవింగ్స్ ఖాతా ఉన్న వారికి.. వచ్చే నెల ఛార్జీల భారం పడనుంది. పోస్టాఫీస్ ఏటీఎంలలో జరిపే ఆర్థిక, ఆర్థికేతర లావాదేవీలపై ఛార్జీలు వసూలు చేయనున్నట్లు ఇండియా పోస్ట్ తెలిపింది. 2021 అక్టోబర్ 1 నుంచి 2022 సెప్టెంబర్ 30 కాలానికి సంబంధించి యూన్యువల్ మెయింటెనెన్స్ ఏటీఎం/డెబిట్ కార్డ్ లావాదేవీలకు రూ.125+ జీఎస్టీ ఛార్జ్ చేయనుంది ఇండియా పోస్ట్. దీనితో పాటు ఎస్ఎంఎస్ అలర్ట్ ఛార్జీల కింద రూ.12+ జీఎస్టీ వసూలు చేయనున్నట్లు పేర్కొంది.
మరో ముఖ్యమైన మార్పు అదేమంటే, వాహనాల ధరలు పెంపు.. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ టొయోటా కిర్లోస్కర్ మోటార్స్ (టీకేఎం).. వాహనాల ధరలు పెంచనున్నట్లు ప్రకటించింది. అన్ని సెగ్మెంట్లలోని వాహనాలపై 2 శాతం వరకు ధరల పెంపు ఉంటుందని తెలిపింది. వెల్ఫైర్ మోడల్కు మాత్రం ఇందుకు మినహాయింపునిచ్చింది. పెరిగిన ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి వస్తాయని టీకేఎం. స్పష్టం చేసింది. దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ మరోసారి ధరల పెంపు నిర్ణయం తీసుకుంది. వాణిజ్య వాహనాల ధరలను 2 శాతం వరకు పెంచనున్నట్లు తెలిపింది. కొత్త ధరలు అక్టోబర్ 1 నుంచే అమలులోకి రానున్నట్లు వెల్లడించింది.