హోదాపై పాత పాట.. కేసీఆర్ పై యుద్ధం.. పార్లమెంట్ లో కలకలం..టాప్ న్యూస్@7PM
posted on Dec 21, 2021 @ 5:58PM
1. టీడీపీ నేత వెంకటనారాయణపై వైసీపీ రాక్షస మూకల చర్యలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్రంగా ఖండించారు. టీడీపీ అధినేత చంద్రబాబుని ధూషిస్తోన్న వైసీపీ శ్రేణులను ప్రశ్నించడమే నేరమా? తప్పుని తప్పని చెబితే చంపేస్తారా? మంచి చెప్పే మనుషుల ప్రాణాలే తీసేస్తారా? అడ్డుకోవాల్సిన పోలీసులేమయ్యారు? అని నిలదీశారు నారా లోకేష్.
2. గుంటూరు నగరంలో వైసీపీ కార్యకర్తలు అరాచకం సృష్టించారు. టీడీపీ కార్యకర్త వెంకటనారాయణపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. హోంమంత్రి సొంత నియోజకవర్గం పత్తిపాడు మండల పరిధిలోని బోయపాలెం జాతీయ రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. వెంకటనారాయణపై మద్యం సీసాలతో దాడి చేసి పెట్రోల్ పోసి తగలబెట్టే ప్రయత్నం చేశారు. స్పృహ కోల్పోయిన వెంకటనారాయణను గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు.
3. సీఎం కేసీఆర్‌పై యుద్ధం చేయాలని బీజేపీ నాయకులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదేశించారు. తెలంగాణలో జరిగిన బియ్యం కుంభకోణాన్ని బయటపెట్టాలన్నారు. కేసీఆర్ అవినీతికి సంబంధించిన విషయాలను ప్రజలకు వివరించాలని సూచించారు. హుజురాబాద్ తరహాలోనే రాబోయే ఎన్నికల్లో గెలవాలని నాయకులకు పిలుపునిచ్చారు.
4. తెలంగాణలో ఏడేళ్లలో 7 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వైఎస్ షర్మిల మండిపడ్డారు. 70 రోజుల్లో 200 మంది రైతులు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క రైతు కుటుంబాన్నైనా కేసీఆర్ పరామర్శించారా? ధాన్యం కొనలేని సీఎం మనకు అవసరమా? ఉద్యోగాలు ఇవ్వని సీఎం మనకు అవసరమా? అని ప్రశ్నించారు. కేసీఆర్ చేతగాని తనంవల్లే రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని విమర్శించారు.
5. తెలంగాణ ప్రభుత్వం రైతులను అయోమయానికి గురిచేస్తోందని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ తప్పుబట్టారు. గత రబీలో అదనంగా 20 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనేందుకు సీఎం కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. ఉప్పుడు బియ్యాన్ని అదనంగా తీసుకునేందుకు కూడా కేంద్రం అంగీకరించిందని.. ఈ అవకాశం కేవలం తెలంగాణకు మాత్రమే ఇచ్చామన్నారు. ఇప్పటివరకు టీఆర్ఎస్ ప్రభుత్వం ధాన్యాన్ని ఎఫ్‌సీఐకి తరలించలేదని మండిపడ్డారు.
6. ప్రత్యేక హోదాపై కేంద్రం మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాకు బదులుగానే ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ఇచ్చామని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో తెలిపారు. ప్రత్యేక హోదా కలిగిన రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ పథకాలలో 90శాతం కేంద్రం వాటా, 10శాతం రాష్ట్ర వాటా ఉంటుందన్నారు. ఆ మేరకు పొందే ఆర్థిక ప్రయోజనాలను ప్రత్యేక ఆర్థిక సహాయం కింద ప్రకటించాలని ఏపీ ప్రభుత్వం కోరిన దరిమిలా రాష్ట్రానికి ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించిందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
7. పుట్టినరోజు నాడు సీఎం జగన్ ఓటీఎస్ పథకాన్ని రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు డిమాండ్ చేశారు. రాముడిగా మంచి పేరు తెచ్చుకుంటారో.. రావణుడిగా చెడ్డపేరు తెచ్చుకుంటారో ముఖ్యమంత్రి చేతిలో ఉందని జగన్‌కు రఘురామ సూచించారు. ఈ పథకానికి సంబంధించి ఇప్పటి వరకు డబ్బులు కట్టినవారికి తిరిగి ఇచ్చేయాలన్నారు.
8. ఒంగోలులో వైసీపీ కార్యకర్త సుబ్బారావు గుప్తాపై ఆ పార్టీ నాయకుల దాడిని నిరసిస్తూ అనంతపురంలో ఆర్యవైశ్య సంఘం నిరసన ర్యాలీ నిర్వహించింది. ఆర్యవైశ్యులకు మంత్రి కొడాలి నాని, బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వంలో సామాన్యులపై హింసాకాండ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేసింది.
9. పార్లమెంట్‌లో కరోనా కలకలం రేపింది. బీఎస్పీ ఎంపీ డానిష్ అలీకి కరోనా సోకింది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఆయన రెగ్యులర్‌గా సభకు హాజరవుతున్నారు. తనను కలిసిన ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని.. అంతా పరీక్షలు చేసుకోవాలని.. ఐసోలేషన్‌లో ఉండాలని ఎంపీ సూచించారు.
10. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాకయ్యాయి. కుమార్తె మిరాయా వాద్రా (18), కుమారుడు రైహాన్ వాద్రా (20) ఫోన్లు హ్యాక్ అయినట్టు ప్రియాంక గాంధీ వెల్లడించారు. మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ చేసిన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. వారు ఫోన్ల ట్యాపింగ్ మాత్రమే కాదని, తమ పిల్లల ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను కూడా హ్యాక్ చేస్తున్నారని ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు.