టీడీపీలోకి పీసీసీ మాజీ చీఫ్ ?
posted on Dec 21, 2021 @ 6:00PM
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు,మాజీ మంత్రి, ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు నీలకంఠాపురం రఘువీరారెడ్డి మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లో రీ ఎంట్రీ ఇస్తున్నారా? సెకండ్ ఇన్నింగ్స్’కు సిద్దమవ్తున్నారా ? అంటే అవుననే అంటున్నారు, ఆయన వెంట నడిచే అనుచరులు. నిజానికి రఘువీరా రెడ్డి, రాజకీయ సన్యాసంలాంటిది ఏమీ ప్రకటించలేదు, కానీ, 2019లో కాంగ్రెస్ పార్టీ వరసగా రెండవసారి ఓడి పోయిన తర్వాత, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడంతో పాటుగా క్రియాశీల రాజకీయాల నుంచి హుందాగా, మౌనంగా తప్పుకున్నారు. స్వగ్రామం, అనంతపురం జిల్లా మడకశిర మండలం నీలకంఠపురానికి మకాం మార్చారు. సాధారణ రైతుగా మారి, గ్రామస్తుల సహకారంతో, గ్రామంలోని 1200 సంవత్సరాల పురాతన నీలకంటేశ్వర ఆలయ నిర్మాణానికి నడుం బిగించారు., దిగ్విజయంగా ఆలయ నిర్మాణం పూర్తి చేశారు. జూన్ నెలలో విగ్రహ ప్రతిష్ట ఇతర కార్యక్రమాలు పూర్తి చేశారు.
అప్పటి నుంచి రఘువీరా మళ్ళీ క్రియాశీల రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఓ వంక కాంగ్రెస్ నాయకులు రఘువీరతో టచ్’లోకి వచ్చారు. ఢిల్లీ నుంచి కూడా పిలుపు వచ్చింది. ఒకటి రెండు సార్లు ఆయన ఢిల్లీ వెళ్లి వచ్చారు, అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళే ఆలోచన మాత్రం ఆయనకు లేదని సహచరులు అంటున్నారు. దేవాలయ నిర్మాణం పూర్తిచేసిన రఘువీరా రెడ్డిని , టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అప్పుడే ప్రత్యేకంగా అభినందించారు. అలాగే జేసీ సోదరుడు, జేసీ ప్రభాకర రెడ్డి స్వయంగా రఘువీరాను కలిసి, రాయలసీమ నీటి హక్కుల కోసం కలిసి పోరాటం చేద్దామని సూచించారు. అయితే, రఘువీర అప్పుడు స్పందించలేదు. అయితే, ఇప్పుడు అయన మళ్ళీ క్రియాశీల రాజకీయాలోకి రీ ఎంట్రీ ఇచ్చే పక్షంలో, తెలుగు దేశం పార్టీలో చేరాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
ఇటీవల రఘువీర రెడ్డి ఒకటి రెండు సందర్భాలలో బహిరంగ వేదికల మీద కనిపించారు. అయితే ఆ రెండు సందర్భాలు కూడా రాజకీయాలతో ముడి పడిన సందర్భాలే అయినా, రాజకీయ వేదికలు కాదు. వైఎస్ సతీమణి విజయమ్మ, నిర్వహించిన వైఎస్ వర్ధంతి సభలో రఘువీరా కనిపించారు. అలాగే, ఇటీవల చనిపోయిన మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య సంస్మరణ సభలో కూడా ఆయన కనిపించారు. ఏపీ రాజకీయాలలో కాంగ్రెస్ పార్టీ ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదు. మరో జాతీయ పార్టీ బీజేపీ పరిస్థితి కూడా అదే, జెండా తేడానే తప్ప మిగిలినదంతా సేమ్ టూ సేమ్, వైసీపీలోకి వెళ్ళడం ఆయనకు ఇష్టం లేదు. సో .. ఇక మిగిలింది టీడీపీ ఒక్కటే. అదీగాక టీడీపీలో చేరడం ఉభయ తారకంగా ఉంటుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.పార్టీ అవసరం ఆయనకుంది ఆయన అవసరం పార్టీకి వుంది. అలాగే, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేతలతో ఆయనకు మొదటి నుంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే సమయంలో బీసీ సామాజికవర్గానికి చెందిన రఘువీరా టీడీపీలో చేరుతానంటే చంద్రబాబు నాయుడు కూడా కాదనరు సరికదా రెడ్ కార్పెట్ పరిచి మరీ స్వాగతం పలుకుతారు.
అందుకే సెకండ్ ఇన్నిగ్స్ లో సైకిల్ ఎక్కేందుకు రఘువీరా రెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, మళ్ళీ రాజకీయాలలోకి ఇప్పుడే రావడమా .. ఇంకొంత కాలం వేచి చూద్దామా అనే విషయంలో మాత్రం ఆయన ఇంకా కొంత డోలాయమానంగా ఉన్నారని అంటున్నారు. అదే సమయంలో ఆయన అనుచరులు ఆయనమీద వత్తిడి తెస్తున్నారు .. కాబట్టి ఇక, అట్టే జాప్యం చేయకుండా రఘువీరా రెడ్డి సైకిలెక్కడం ..ఖాయమే అంటున్నారు.