సీఎం వస్తే బంద్.. రఘురామ పాఠాలు.. గింజ కూడా కొనడట..టాప్ న్యూస్@7PM
posted on Dec 18, 2021 @ 6:30PM
సీఎం జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటనకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. 21వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్ తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసు ద్వారా సమాచారం అందించారు.
------
మూడు రాజధానులతో రాష్ట్రాభివృద్ధి జరుగుతుందంటున్న సీఎం జగన్ మాటలను ప్రజలు నమ్మేస్థితిలో లేరని టీడీపీ ఎమ్మెల్సీ అశోక్‌బాబు అన్నారు. మూడు రాజధానుల బిల్లుని కోర్టులో వెనక్కుతీసుకోవడమే..సీఎం, వైసీపీ ప్రభుత్వ పరాజయానికి సంకేతమన్నారు. సీఎం జగన్‌రెడ్డి అమరావతి నుంచి ఇటుకను కూడా తీసుకెళ్లలేరన్న సందేశాన్ని అమరావతి మసభ చాటిందన్నారు అశోక్‌బాబు
------
వైసీపీ ఎంపీలు ఢిల్లీలో చలికి రగ్గులు కప్పుకుని నిద్రపోవద్దు, మీ ఎంపీ రఘురామకృష్ణరాజు దగ్గరకు వెళ్తే పోరాటం ఎలా చేయాలో చెబుతారని జనసేన నేత మహేష్ హితవు పలికారు. మనం ప్రజల కోసం పనిచేయాలి గానీ.. ఒకరి మెప్పు కోసం కాదని రఘురామ నుంచి గ్రహించాలన్నారు. వైసీపీ ఎంపీలు ఇకనైనా మేల్కొని విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్‌లో గళం విప్పాలని పోతిన మహేష్ అన్నారు.
-------
కొంత కాలంగా వివాదంగా మారిన కర్నూల్ జిల్లా జడ్పీ చైర్మన్ మల్కిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి కథ రాజీనామాతో ముగిసింది. వెంకటసుబ్బారెడ్డి కలెక్టర్ కోటేశ్వరావుకు రాజీనామా పత్రాన్ని అందజేశారు. సుబ్బారెడ్డి రాజీనామాతో జడ్పీ చైర్మన్ పదవి పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాం భూపాల్‌రెడ్డి మద్దతున్న కొలిమిగుండ్ల జడ్పీటీసీ ఎర్రబోతుల పాపిరెడ్డికి దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు.
----
కడప జిల్లాలోని రిమ్స్ ఆస్పత్రిలో ఆక్సిజన్ పైప్ లీక్ అయ్యింది. ఆస్పత్రిలోని లేబర్ వార్డులో ఆక్సిజన్ పైప్ లీకవడంతో రోగులు భయంతో పరుగులు తీశారు. చంటి బిడ్డలతో అష్టకష్టాలు పడుతూ రోగులు ఆస్పత్రి నుంచి బయటకు వచ్చారు. ఆక్సిజన్ పైప్ లీక్ అవడంతో వెంటనే అప్రమత్తమైన ఆస్పత్రి సిబ్బంది లీకేజ్‌ను ఆపేందుకు చర్యలు చేపట్టారు.
-----
దుర్గాఘాట్‌లో పాముకు దుర్గగుడి వైదిక కమిటీ సభ్యులు, అర్చకులు దహన సంస్కారాలు చేశారు. ఇంద్రకీలాద్రిపై గత కొన్నేళ్లుగా రెండు పాములు సంచరిస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం ఓం టర్నింగ్ వద్ద ఒక పాము చనిపోయింది. దీంతో మనుషుల మాదిరిగానే వైదిక కమిటీ సభ్యులు పాముకు దహన సంస్కారాలు చేశారు.
--------
యాసంగిలో కిలో వడ్లు కూడా కొనబోమని సీఎం కేసీఆర్ తేల్చిచెప్పారు. యాసంగిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవని స్పష్టం చేశారు. యాసంగిలో వరిధాన్యం కొనబోమని కేంద్రం పదేపదే చెప్తోందని, ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు వివరించాలని కేసీఆర్ ఆదేశించారు. వానాకాలం పంటలసాగుపై ముందస్తు ప్రణాళిక ఉండాలన్నారు. ప్రత్యామ్నాయ లాభసాటి పంటలసాగుపై దృష్టిసారించాలని సూచించారు.
----
స్వతంత్రంగా వ్యవహరించాల్సిన కేంద్ర ఎన్నికల కమిషన్ ను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.
కేంద్ర ఎన్నికల కమిషనర్ లతో ప్రధాన మంత్రి కార్యాలయం ఉన్నతాధికారులు రహస్యంగా సమావేశంకావడం ఆక్షేపనీయమని అన్నారు. పీఎంవో తీరు భారత దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టన్నార
---------
దేశంలో ద్రవ్యోల్బణం, బాధలు, విచారం పెరగడానికి కారణం హిందుత్వవాదులేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఉత్తర ప్రదేశ్‌లోని అమేథీలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ, నేడు యుద్ధం హిందువులు, హిందుత్వవాదుల మధ్య జరుగుతోందన్నారు. హిందువులు సత్యాగ్రహాన్ని విశ్వసిస్తే, హిందుత్వవాదులు సత్తాగ్రహ్ ను నమ్ముతారని అన్నారు
--
పాకిస్థాన్ కరాచీ షేర్షా పరాచా చౌక్ ప్రాంతంలోని ఓ భవనంలో పేలుడు సంభవించి 12 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. శిథిలాల కింద పలువురు చిక్కుకుపోయారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.