జగనన్న వస్తున్నాడు.. షాపులు మూసేయండహో..
posted on Dec 18, 2021 @ 4:42PM
ముఖ్యమంత్రి వస్తున్నారు. జగన్మోహన్‌రెడ్డి విచ్చేస్తున్నారు. సీఎం వస్తుంటే వీధుల్లో ఒక్కరు కూడా ఉండకూడదు. ఆయన దారి రహదారిగా.. ఏ ఆటంకం లేకుండా ప్రయాణం సాగాలి. రోడ్డుకు ఇరువైపులా ఇనుప కంచెలు వేయాలి. దారి వెంట షాపులన్నీ మూసేయాలి. ఇవీ.. పోలీసులు జారీ చేసిన ఆదేశాలు. అయితే ఇలాంటి రూల్స్.. అమరావతిలో కామన్. తాడేపల్లి ప్యాలెస్ నుంచి జగన్‌రెడ్డి కాన్వాయ్ బయటకు వస్తే చాలు.. అమరావతి గ్రామాల్లో కర్ఫ్యూ విధించినంత పని చేస్తారు. షాపులన్నీ మూసేయిస్తారు. జనాలను ఫెన్సింగ్స్‌తో అడ్డుకుంటారు. ఎందుకంటే.. రాజధాని రైతులు జగన్‌ను ఎక్కడ అడ్డుకుంటారో అనే భయం. అమరావతిపై ఎవరు నిలదీస్తారో అనే టెన్షన్. అందుకే ఇలా. అమరావతిలో అయితే ఓకే.. మరి, సీఎం జగన్ పర్యటనలో భాగంగా తణుకులోనూ పోలీసులు ఇలాంటి ఆంక్షలే పెట్టడం ఆసక్తికరం.
ఈనెల 21న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా తణుకు పర్యటన సందర్భంగా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. సీఎం పర్యటన సమయంలో పట్టణంలోని దుకాణాలు సైతం మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
తణుకు మహిళా కళాశాల ఎదురుగా వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌లో హెలికాప్టర్ దిగి.. అక్కడి నుంచి ఆయన బాలుర ఉన్నత పాఠశాలలో జరిగే సభకు వెళ్తారు. మార్గమధ్యలో జగన్ పర్యటనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఇనుపరాడ్లతో ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు ఎవరూ సీఎంకు అడ్డుపడకుండా చర్యలు చేపట్టారు.
పర్యటన ముందస్తు చర్యల్లో భాగంగా 21వ తేదీన మధ్యాహ్నం 3 గంటల వరకు పట్టణంలోని అన్ని దుకాణాలు మూసివేయాలని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తణుకు చాంబర్ ఆఫ్ కామర్స్‌తో.. తమ పరిధిలోని వ్యాపార వాణిజ్య సంస్థలకు నోటీసులతో సమాచారం అందించారు.
అచ్చం అమరావతిలానే తణుకులోనూ షాపులు మూసేయాలని ఆదేశాలు జారీ చేయడంపై స్థానిక వ్యాపారుల నుంచి విమర్శలు వస్తున్నాయి. గతంలో ఎంతోమంది సీఎంలు వచ్చి పోయారు.. మునుపెన్నడూ ఇలాంటి కఠిన ఆంక్షలు పెట్టలేదని మండిపడుతున్నారు. అడ్డగోలు నిర్ణయాలతో జగన్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తుతుండటం గ్రహించే.. ప్రజలు సీఎంపై తిరగబడకుండా.. ఇలా పోలీస్ ఆంక్షల మధ్య పర్యటన కొనసాగించాల్సిన అగత్యం దాపురించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు