అమరావతి సభకు సర్వం సిద్దం.. తేలని పీఆర్సీ.. డీఎస్ రిటర్న్.. టాప్ న్యూస్@8PM
posted on Dec 16, 2021 @ 6:34PM
అమరావతి రైతుల మహా పాదయాత్ర ముగింపు సందర్భంగా తిరుపతిలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. సీపీఐ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా విజ్ఞతతో వ్యవహరించాలని సూచించారు. అమరావతినే రాజధానిగా కొనసాగిస్తూ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.
---
అమరావతి రైతుల మహాపాదయాత్రకు సంఘీభావంగా గురువారం మాజీమంత్రి, టీడీపీ నేత పరిటాల సునీత యాత్ర చేపట్టారు. వెంకటాపురంలోని పరిటాల రవీంద్ర ఘాట్ నుంచి.. తిరుమల దేవస్థానం వరకు పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో మహిళలు, పార్టీ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఒకే రాష్ట్రం..ఒకే రాజధాని.. ఏపీ రాజధాని అమరావతే అంటూ నినాదాలు చేస్తూ సునీత పాదయాత్ర సాగింది.
---------
సీఎం జగన్‌తో ఫ్లిప్‌కార్ట్ సీఈవో కల్యాణ్ కృష్ణమూర్తి భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులపై చర్చించారు. రైతుల పంటలకు మంచి ధరలు వచ్చేందుకు దోహదపడాలని, విశాఖను పెట్టుబడుల వేదికగా మలుచుకోవాలని జగన్ కోరారు. ఐటీ, నైపుణ్యాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కోరారు. జగన్ ప్రతిపాదనలపై సానుకూలంగా ఫ్లిప్‌కార్ట్ స్పందించింది. ఆర్బీకేల ద్వారా రైతుల ఉత్పత్తుల కొనుగోలుకు సుముఖత వ్యక్తం చేసింది.
--------
ఏపీలో నిరుపేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను చెల్లించకుండా వేల కోట్ల రూపాయలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను సీఎం జగన్ పక్కదారి పట్టించారని మాజీ కేంద్రమంత్రి చింతామోహన్ అన్నారు. ప్రజల డబ్బుతో జగనన్న గోరు ముద్ద పేరుతో మధ్యాహ్న భోజన పథకాన్ని ఎలా పెడతారని ప్రశ్నించారు. జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పేరుతో కోట్ల రూపాయల ప్రజల డబ్బును పక్కదారి పట్టించారని మండిపడ్డారు
--------
పీఆర్సీ పూర్తి నివేదిక ఉద్యోగులకు ఇవ్వాలని అమరావతి జేఏసీ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం బొప్పరాజు మీడియాతో మాట్లాడుతూ.. 11వ పీఆర్సీ కమిషన్ నివేదికను పట్టించుకోలేదన్నారు. అధికారులను కమిటీ వేసి నచ్చినట్టు నివేదిక ఇచ్చారని చెప్పారు. 14.39 పిట్‌మెంట్‌కు ఉద్యోగులు వ్యతిరేకమన్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు హెచ్‌ఆర్ఏ, డీఏ ఇవ్వాలని డిమాండ్ చేశారు
---------
ఏపీ ఇరిగేషన్ సెక్రటరీ జవహర్ రెడ్డిపోలవరం ప్రాజెక్టుని సందర్శించారు. తొలుత హిల్‌వ్యూ ప్రాంతం నుంచి స్పిల్వే, స్పిల్ చానల్, ఆప్రోచ్ చానల్‌లను పరిశీలించారు. అనంతరం ఆయన ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌లు, డయాఫ్రంవాల్, గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 ప్రాంతాలను, స్పిల్‌వే, రేడియల్ గేట్లు, ఫిష్ ల్యాడర్, పవర్ హౌజ్, స్పిల్వేలో ఆప్రోచ్ చానల్, కుడి ప్రధాన కాలువ కనెక్టివిటీలో హెడ్ రెగ్యులేటర్, ఫేజ్ 4, ఫేజ్ 5 లలో జంటగుహల నిర్మాణం పనులు పరిశీలించారు.
----
రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి పునరాగమనం చేసేందుకు రంగం సిద్ధమైంది. డీఎస్ ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో చర్చలు జరిపారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఈ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైనట్టే తెలుస్తోంది. దీనిపైఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు.
----
స్థానిక సంస్థలను, గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తున్న సీఎం కేసీఆర్ సర్కార్‌పై రాజకీయాలకు అతీతంగా సర్పంచ్‌లంతా తిరగబడాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇప్పటివరకు రాష్ట్రంలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలే చూశామని, సర్కార్ తీరుతో సర్పంచ్‌ల ఆత్మహత్యలను చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
--
బీజేపీ నేత ‘మెట్రో’ శ్రీధరన్ రాజకీయాల నుంచి వైదొలగారు. ఆయన స్వస్థలం మలప్పురంలో మీడియాతో మాట్లాడుతూ, తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్లు ప్రకటించారు. తన వయసు తొంభయ్యేళ్ళని చాలా మందికి తెలియదన్నారు. తన వయసుకు సంబంధించి తాను అడ్వాన్స్‌డ్ స్టేజ్‌లో ఉన్నానని చెప్పారు. క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని తాను చెప్పానంటే, దాని అర్థం రాజకీయాలను వదిలిపెడుతున్నట్లు కాదన్నారు.
--------
కర్ణాటకలో మత మార్పిడి నిషేధ బిల్లుకు సంబంధించిన ముసాయిదాను న్యాయశాఖ సన్నద్ధం చేసింది. మత స్వాతంత్య్ర సంరక్షణ హక్కు చట్టం 2021ని బెళగావిలో జరుగుతున్న శాసనసభ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదించాలని రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీ తీరని వారిని, మహిళలు, మానసిక వైకల్యం ఉన్నవారిని బలవంతంగా మతమార్పిడి చేస్తే 3 నుంచి 10 ఏళ్ల వరకు జైలుశిక్ష, రూ.50 వేల జరిమానా విధిస్తారు.
----