బీజేపీకి బిగ్ షాక్.. కాంగ్రెస్ గూటికి డీఎస్!
posted on Dec 16, 2021 @ 7:25PM
బీజేపీకి షాక్ తగిలింది. టీఆర్ఎస్ ఎంపీ కాంగ్రెస్ లో చేరబోతున్నారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ తండ్రి ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ గూటికి చేరబోతున్నారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గురువారం ఢిల్లీలో సోనియాగాంధీలో ఆయన సమావేశమయ్యారు. దాదాపు 40 నిమిషాలకు పైగా ఇద్దరి మధ్య చర్చ జరిగింది. ఈ సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీలో డీఎస్ చేరిక దాదాపు ఖరారైంది. దీనిపై ఏఐసీసీ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తెలిపారు. అధిష్ఠానం పిలుపుమేరకు భట్టి కూడా ఢిల్లీ వెళుతున్నారు.
టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్న డి.శ్రీనివాస్ గతంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నారు. 1989 నుంచి 2015 జులై వరకు ఆయన కాంగ్రెస్ పార్టీలో సుధీర్ఘంగా పని చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో పలు కీలక పదవులు అనుభవించారు. పీసీసీ చీఫ్ రెండు సార్లు పనిచేశారు. డీఎస్ పీసీసీ చీఫ్ గా ఉన్న రెండు సార్లు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి క్యాబినెట్లో మంత్రిగానూ వ్యవహరించారు డీఎస్. 2009 ఎన్నికల్లో డీఎస్ ఓటమిపాలయ్యారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లారు. ఆయనకు టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ అవకాశం ఇచ్చింది.
గత కొన్నేండ్లుగా డి.శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. సీఎం కేసీఆర్ తో ఆయనకు విభేదాలు వచ్చాయి. పీసీసీ చీఫ్ గా నియామకం అయిన కొన్ని రోజులపై రేవంత్ రెడ్డి డీఎస్ ఇంటికి వెళ్లి ఆయనతో సమావేశమయ్యారు. అప్పుడే డీఎస్ తిరిగి సొంత గూటికి వస్తారనే ప్రచారం జరిగింది. అయితే డి.శ్రీనివాస్ తనయుడు ధర్మపురి అర్వింద్ నిజామాబాద్ బీజేపీ ఎంపీగా ఉండటంతో పాటు కేసీఆర్ సర్కార్ పై పోరాటం చేస్తున్నారు. కేసీఆర్ కుటుంబాన్ని ఆయన తీవ్రంగా టార్గెట్ చేస్తున్నారు. దీంతో డీఎస్ అర్వింద్ కు మద్దతుగా బీజేపీలో చేరుతారని అంతా భావించారు. కాని ఆయన ఏఐసీసీ చీఫ్ సోనియా గాంధీతో సమావేశం కావడంతో కాంగ్రెస్ లో చేరడం ఖాయమైంది. డీఎస్ కాంగ్రెస్ లో చేరితే బీజేపీ ఎంపీ అర్వింద్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని చెబుతున్నారు. అర్వింద్ సోదరుడు సంజయ్ కుడా ఇటీవలే కాంగ్రెస్ లో చేరారు. అంతేకాదు తన తమ్ముడిపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.