బండా, కడియంలకు డిప్యూటీ సీఎం? వెంకట్రామిరెడ్డికి ఫైనాన్స్? ఇద్దరు రెడ్లకు ఊస్టింగ్?
posted on Nov 17, 2021 @ 11:34AM
కేసీఆర్ రాజకీయ చాణక్యుడు.. మాంత్రికుడు.. మాయల మరాఠీ.. పిట్టల దొర.. ఇలా రకరకాలుగా అంటుంటారు. పాజిటివ్ లేదా నెగటివ్.. ఎవరు ఏమన్నా.. ఆయన తెలంగాణ చాణక్యుడు అనే సంగతిని మాత్రం అంతా ఒప్పుకుంటారు. బొక్కబోర్లా పడినా కూడా.. ఎవరూ తనను చూసి నవ్వకుండా.. టక్కున లేచి నిలిచుంటారు. ఓడినా.. తానే గెలిచినట్టు బిల్డప్ కూడా ఇస్తుంటారు. ఇక ఆయన ఆడే రాజకీయ జూదం మామూలుగా ఉండదు. ఏ పావును.. ఎప్పుడు ఎక్కడ ఎలా కదపాలో కేసీఆర్‌కు బాగా తెలుసంటారు. హుజురాబాద్ ఓటమి.. ఈటల గెలుపు.. దళితబంధు ఫెయిల్యూర్.. రేవంత్‌రెడ్డి దూకుడు.. తదితర కీలక పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీల రూపంలో కేసీఆర్ వేగంగా పావులు కదిపారు. అనూహ్యంగా కొందరు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఆ పావుల వెనుక ఆనేక వ్యూహాలు ఉన్నాయని అంటున్నారు.
బండా ప్రకాశ్‌ను రాజ్యసభ నుంచి తీసుకొచ్చి.. మండలిలో కూర్చోబెడతారని ఎవరూ ఊహించి ఉండకపోవచ్చు. కేసీఆర్ చాతుర్యం అలా ఉంటుంది మరి. బండా ప్రకాశ్ ముదిరాజ్. ఆయన పేరు చివరున్న ముదిరాజ్ పదమే ఇప్పుడు ఆయనకు ప్రత్యేకతను, ప్రమోషన్‌ను తీసుకొస్తోంది. ముదిరాజ్ వర్గానికి చెందిన ఈటల రాజేందర్‌ను ఎదుర్కొడానికే మరో ముదిరాజ్ నేత బండా ప్రకాశ్‌ను రాష్ట్రానికి తీసుకొస్తున్నారని తెలిసిందే. జస్ట్ ఎమ్మెల్సీని చేయడమే కాదు.. త్వరలో కేబినెట్ విస్తరణలో ఏకంగా డిప్యూటీ సీఎంను కూడా చేస్తారని అంటున్నారు. తెలంగాణలో చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్న ఆ సామాజిక వర్గాన్ని టీఆర్ఎస్ నుంచి దూరం కానీయకుండా.. వారంతా ఈటల వెట ఉండకుండా.. బండాతో బండేసి ఆ ప్రవాహాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు. గెలిచినా ఈటలకు మనశ్శాంతి లేకుండా వెంటాడేలా.. కనీసం ముదిరాజ్ సామాజిక వర్గం కూడా ఆయన వెంట లేకుండా చేసేలా.. కేసీఆర్ స్కెచ్ వేశారని చెబుతున్నారు. బండా ప్రకాశ్‌ను ఎమ్మెల్సీ.. మంత్రి.. డిప్యూటీ సీఎం చేసి.. ముదిరాజ్‌లను, బీసీలను కారులోనే బంధించాలనేది గులాబీ బాస్ వ్యూహంలా కనిపిస్తోంది.
ఇక కడియం శ్రీహరికి ఎమ్మెల్సీ అంతా ఊహించిందే. అంతా దళిత మంత్రం జపిస్తున్న ఈ సమయంలో కడియంకు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే రచ్చ రచ్చ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఆయనకు ఎమ్మెల్సీ ఇవ్వక తప్పలేదంటున్నారు. లేదంటే.. ఇచ్చుండకపోవచ్చుని కూడా చెబుతున్నారు. కడియం శ్రీహరి పదవికాలం ముగిసి చాలా రోజులే అవుతోంది. చాన్నాళ్లుగా ఆయన ఎలాంటి పదవీ, పనీ లేకుండా ఖాళీగా ఉంటున్నారు. కేసీఆర్ ఆయన్ను దాదాపు పక్కనపెట్టేశారు. ఈటల పుణ్యానే కడియంకు ఎమ్మెల్సీ రాబోతోందని అనుకోవచ్చు. దళితబంధు, సీఎంవోలో దళిత ఐఏఎస్, దళితుడైన కడియంకు ఎమ్మెల్సీ.. ఇదే కోవలో చూడాల్సి ఉంటుందని అంటున్నారు. కడియంకు ఎమ్మెల్సీతోనే సరిపెట్టక.. గతంలో మాదిరే డిప్యూటీ సీఎం కూడా చేస్తారని చెబుతున్నారు. ఏమో.. చేసినా చేయొచ్చు.
ఇక, అనూహ్యంగా వెంకట్రామిరెడ్డితో ఎమ్మెల్సీగా రాజకీయ ఎంట్రీ చేయించారు కేసీఆర్. ఆయన మాజీ కలెక్టర్ కాదు.. కేసీఆర్ బంట్రోతు.. అవినీతి అనకొండా అంటున్నారు రేవంత్‌రెడ్డి. ఎవరేమన్నా.. తనకు నమ్మకస్తుడైన వెంకట్రామిరెడ్డిని ఎమ్మెల్సీని చేసి.. మంత్రిని కూడా చేస్తారని ప్రగతి భవన్ వర్గాల సమాచారం. ఏకంగా కీలకమైన ఆర్థిక శాఖనే వెంకట్రామిరెడ్డికి కట్టబెడుతారని తెలుస్తోంది. హరీశ్‌రావు నుంచి ఆర్థికం తీసేసి.. కేవలం ఆరోగ్యానికి మాత్రమే పరిమితం చేస్తారని అంటున్నారు.
కేబినెట్‌లో మరో ఈటల లాంటి వారు తయారవకుండా.. అనుమానం ఉన్న వారందరినీ బయటకి పంపించేయడం ఖాయమంటున్నారు. ఇద్దరు ముగ్గురు 'రెడ్డి' మంత్రులకు గండం పొంచిఉందని తెలుస్తోంది. హంపి రిసార్ట్‌లో తనకు వ్యతిరేకంగా వాగిన ఓ మంత్రితో పాటు, రెడ్లకే అధికారం దక్కాలని బలంగా కోరుకుంటూ, గప్‌చుప్‌గా రేవంత్‌రెడ్డితో టచ్‌లో ఉన్న మరో మంత్రికి సైతం కేబినెట్ నుంచి ఉద్వాసన తప్పదని ప్రచారం జరుగుతోంది. ఇలా.. ఎమ్మెల్సీల్లానే త్వరలో జరగబోవు మంత్రిమండలి విస్తరణలోనూ పలు షాకింగ్‌లు, షేకింగ్‌లు తప్పకపోవచ్చని అంటున్నారు. కేసీఆర్ కదపబోవు మంత్రి పావు ఎవరికి చెక్ పెడుతుందో చూడాలి..