వివేకా కేసులో పెద్దలున్నారు.. వైసీపీ అదే రచ్చ.. కేసీఆర్ ట్విస్ట్.. టాప్ న్యూస్@1PM
posted on Nov 16, 2021 @ 11:41AM
వైఎస్ వివేకా హత్య కేసులో డ్రైవర్ దస్తగిరి వాంగ్మూలంలో కీలక విషయాలు బయటకొచ్చాయని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరాం అన్నారు. వివేకా హత్య వెనుక ఉన్న ముఖ్య వ్యక్తి డి.శంకర్‌రెడ్డి అని పేర్కొన్నారు. హత్య తర్వాత దస్తగిరి.. రాజారెడ్డి ఆస్పత్రికి ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. నిందితులందరిని ముందుండి నడిపించింది డి.శంకర్‌రెడ్డేనని అన్నారు. హత్య తర్వాత వివేకా ఇంటికి ముందు చేరుకున్నది.. శంకర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలేనని, వైఎస్ కుటుంబానికి అవినాష్‌రెడ్డి అత్యంత సన్నిహితుడని పట్టాభి అన్నారు.
---------
విశాఖపట్నం జిల్లా ఆనందపురం జెడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ నేతలు ప్రచారం చేస్తున్నారు. క్యూలో నిలబడిన ఓటర్లకు ఫ్యాన్... ఫ్యాన్ అంటూ వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. అయితే చాలా మంది ఓటర్లకు..తాము ఏ ఎన్నికలకు ఓటు వేస్తున్నారో తెలియక పోవడం విశేషం.. ఓటు మాత్రం వేశామని ఓటర్లు చెబుతున్నారు.
------
ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషాకు సీఎం జగన్ మోహన్‌రెడ్డి బీ–ఫారం అందజేశారు. ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఎమ్మెల్సీల స్ధానాలకు తమ పేరును ఖరారు చేయడంతో ఎమ్మెల్సీ అభ్యర్థులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సీఎం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ అభ్యర్ధులు డీసీ గోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్, ఇషాక్ బాషా... ముఖ్యమంత్రిని కలిసి పుష్పగుచ్చం అందజేసి కృతజ్ఙతలు తెలిపారు.
-----
తిరుమల శ్రీవారి పూజా కైంకర్యాలపై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ జరిగింది. తిరుమల దేవస్థానంలో శ్రీవారికి ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు జరగడం లేదంటూ సుప్రీంలో పిటిషన్ దాఖలైంది. కాగా ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తోసిపుచ్చింది. పూజకార్యక్రమాలను ఆగమశాస్త్రం ప్రకారమే జరుగుతున్నాయని గతంలో టీటీడీ అఫిడవిట్ దాఖలు చేసింది. పిటీషనర్ కేవలం ప్రచారం కోసమే వస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేసింది.
--------
శ్రీశైలంలో అవినీతిపై మరోసారి ఏసీబీ విచారణ చేపట్టింది. 2016-19లో దేవస్థానంలోని పలు కౌంటర్లలో జరిగిన స్కామ్‌పై విచారణ జరుగనుంది. ఇప్పటికే 5 కేసులకు సంబంధించి 8 మంది ఉద్యోగులపై కేసు నమోదు అయ్యింది. తాజాగా మరో 8 కేసులు ఏసీబీ నమోదు చేసింది. శ్రీశైలం దేవస్థానంలోని పలు కీలక రికార్డులను ఏసీబీ పరిశీలించనుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సిబ్బందిని ఏసీబీ అధికారులు ప్రశ్నించనున్నారు.
---------
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను టీఆర్ఎస్ అధిష్టానం ఖరారు చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా రవీందర్‌రావు, వెంకట్రామిరెడ్డి, కడియం శ్రీహరి, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండ ప్రకాష్, కౌశిక్ రెడ్డిల పేర్లను ప్రకటించింది. నిన్న కలెక్టర్ పదవికి రాజీనామా చేసిన వెంకట్రామిరెడ్డితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడు, ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ అనూహ్యంగా తెరపైకి వచ్చారు
-------
రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో బీజేపీ బృందం మంగళవారం భేటీ అయ్యింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి, పోలీసులు వ్యవహారశైలిపై గవర్నర్‌కు నేతలు ఫిర్యాదు చేశారు. వానాకాలం పంటను కొనకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెడుతోందన్న విషయాన్ని గవర్నర్ దృష్టికి బీజేపీ బృందం తీసుకెళ్లింది. ఈ సమావేశానికి ఈటల, రఘనందనరావు, రాజసింగ్, డీకే అరుణ, లక్ష్మణ్, గరికపాటి, విజయరామారావు, పొంగులేటి హాజరయ్యారు.
-----
మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలం అచ్చంపేటలో బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కుటుంబానికి చెందిన జమున హెచరీస్ కబ్జా ఆరోపణలపై సర్వే ప్రారంభమైంది. మంగళవారం ఉదయం తూప్రాన్ ఆర్డీవో శ్యాం ప్రసాద్, డివిజనల్ సర్వేయర్ లక్ష్మీ సుజాత, తహశీల్దార్ మాలతి ఆధ్వర్యంలో సర్వే మొదలైంది. పోలీసు బందోబస్తు మధ్య భూముల సర్వే జరుగుతోంది.
-----
మైసూరులోని చాముండేశ్వరి కొండల ప్రదేశాన్ని హంపి తరహాలో హైటెక్ మెరుగులతో తీర్చదిద్దనున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ఇప్పటికే ఆధ్యాత్మిక, పారంపరిక పథకం కింద రూ.110 కోట్ల గ్రాంటు ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం పంపించింది. ఇటీవల బెంగళూరు నగరాన్ని పర్యటించిన సమయంలో కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డికి కూడా రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్ మైసూరు చాముండేశ్వరి కొండల సమగ్ర అభివృద్ధికి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
----
టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా చిక్కుల్లో పడ్డారు. దుబాయ్ నుంచి టీ20 ప్రపంచకప్ ముగించుకుని దుబాయ్నుంచి వస్తున్న పాండ్యా వద్ద రూ. 5 కోట్ల విలువైన రెండు చేతి గడియారాలను ఎయిర్ పోర్టులో కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన పాండ్యా వద్ద రూ.5 కోట్ల విలువైన రెండు లగ్జరీ వాచీలు ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు హార్దిక్ పౌండ్యా వద్ద గుర్తించారు. వాటికి బిల్లులు లేవని లేవని సీజ్ చేసినట్లు తెలుస్తుంది.