బీజేపీని వారే భ్రష్టు పట్టిస్తున్నారా? అమిత్‌షా చెప్పేదాకా తెలియదా?
posted on Nov 16, 2021 @ 11:44AM
ఏపీ రాజధాని అమరావతి. టెక్నికల్‌గా ఇప్పటికీ రాష్ట్ర రాజధాని అమరావతినే. కేవలం వైసీపీ వారికి మాత్రమే మూడు రాజధానులు. ప్రజలు, ప్రతిపక్షాలు, కోర్టులు, ప్రభుత్వ రికార్డుల్లో అమరావతినే ఏపీకి ఏకైక రాజధాని. ఇంత చిన్న లాజిక్.. బీజేపీ నేతలకు మాత్రం అర్థం కావట్లేదు ఎందుకనో? అమరావతి కోసం పార్టీ తీర్మానం చేసినా పట్టించుకోవడం లేదు.. రాజధాని రైతులు 700 రోజులుగా ఉద్యమిస్తున్నా.. వారికి సంఘీభావం చెప్పడం లేదు.. అసలు అమరావతికి తమకు ఎలాంటి సంబంధం లేదన్నట్టే ఉంటున్నారు ఏపీ బీజేపీ నేతలు. ఎందుకిలా? కమలనాథులు అమరావతితో టచ్ మీ నాట్ అన్నట్టు ఎందుకుంటున్నారు? ఢిల్లీ నుంచి వచ్చిన అమిత్‌షా.. మొట్టికాయలు వేసే వరకూ రాష్ట్ర నేతలకు రాజధాని కోసం ఉద్యమించాలనే విషయం తెలీదా? రైతుల పాదయాత్రలో పాల్గొనాలనే సంగతి తెలీదనుకోవాలా? ఇదంతా కొందరు కోవర్టులు చేస్తున్న కుట్రనా? అధికార వైసీపీతో అంటకాగుతున్న యవ్వారమా? అంటే అవుననే అంటున్నారు.
ఒకప్పుడు బీజేపీ ఎలా ఉండేది? ఇప్పుడెలా ఉంది? పార్టీ సిద్ధాంతాల కోసం ప్రాణంపెట్టి పోరాడేవారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అంతా సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుంటే.. కమలనాథులు మాత్రం ఎప్పుడో చేసిన కాకినాడ తీర్మానానికి కట్టుబడి.. తెలంగాణకే మద్దతుగా నిలిచారు. ఏపీలో బీజేపీకి తీవ్ర నష్టం జరుగుతుందని తెలిసినా.. పార్టీ తీర్మానానికే కట్టుబడి ఉన్నారు. కానీ, ఇప్పటి బీజేపీలో ఏం జరుగుతోంది? ఏపీ రాజధానిగా అమరావతికి మద్దతిస్తూ పార్టీ తీర్మానం చేశాక కూడా కాషాయదళం అమరావతి రైతులకు ఎందుకు మద్దతుగా నిలవడం లేదు? మహా పాదయాత్రలో ఎందుకు పాల్గొనడం లేదు? అమిత్‌షా చెప్పే వరకూ.. ఈ తోలుమందం నేతలు ఎందుకు కదలకుండా, కదం కదపకుండా సైలెంట్‌గా ఇంట్లో కూర్చొన్నారు? అంటూ మండిపడుతున్నారు ఆ పార్టీ అభిమానులు.
ఈ విషయంలో అమిత్‌షా ముందు పెద్ద రచ్చే జరిగింది. అమరావతిపై పార్టీ తీర్మానం చేశాక వెనక్కి వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందని అమిత్‌షా ప్రశ్నించారు. మరో నాయకుడు జోక్యం చేసుకుని అది ఓ పార్టీ చేయిస్తోందని చెప్పడానికి ప్రయత్నించగా.. ‘రైతులు భూములిచ్చారా? లేదా? ఉద్యమిస్తోంది రైతులా? కాదా? పాల్గొంటోంది రైతులే అయినప్పుడు అభ్యంతరం ఎందుకు? పాదయాత్రలో పాలుపంచుకోవాలి’ అని షా ఆదేశించారు.
ఇంతకీ అమరావతి ఉద్యమంలో భాగస్వామి కాకుండా బీజేపీని తప్పుదారి పట్టించింది ఎవరు? అనే ప్రశ్న పార్టీ వర్గాల్లో తలెత్తుతోంది. ఇంకెవరు స్వయానా రాష్ట్ర పార్టీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఆయన ప్రధాన అనుచరుడు విష్ణువర్థన్‌రెడ్డిలే అంటున్నారు. పార్టీ ఇంఛార్జి సునీల్ దియోధర్‌ను తమ బుట్టలో వేసుకొని.. ఆ ముగ్గురూ కలిసి జగన్‌కు, వైసీపీ ప్రభుత్వానికి లాభం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారనేది ఓపెన్ సీక్రెట్. పదే పదే చంద్రబాబును, టీడీపీని టార్గెట్ చేస్తున్నారే కానీ, వైసీపీ జోలికి మాత్రం వెళ్లడం లేదు. జస్ట్.. తమలపాకుతో కొట్టినట్టు ప్రభుత్వంపై ఉత్తుత్తి పోరాటం చేస్తున్నారని అంటున్నారు. ఇక విష్ణువర్థన్‌రెడ్డి చేసే ఓవరాక్షన్ అంతాఇంతా కాదంటున్నారు. అమరావతి ఉద్యమాన్ని అనేక సార్లు అవహేళన చేసిన ఘనుడు విష్ణువర్థన్‌రెడ్డి. అందుకే జేఏసీ నేతల చేతిలో చెప్పుదెబ్బలు కూడా తినాల్సి వచ్చిందంటున్నారు. ఆ ముగ్గురు నేతల వల్లే ఏపీ బీజేపీ భ్రష్టుపట్టిందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అమిత్‌షా సైతం వారిపై సీరియస్ అయ్యారని తెలుస్తోంది. ఇప్పటికీ కొందరు ప్రతిపక్ష టీడీపీనే లక్ష్యంగా చేసుకుంటూ విమర్శించడం సరైంది కాదని.. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై ఉద్యమించాలని, ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సొంతగా కృషి చేయాలని అమిత్‌షా ఆదేశించారు.
ఇక టీడీపీ నుంచి బీజేపీలో చేరిన ఎంపీలు సుజనాచౌదరి, సీఎం రమేశ్‌లను పార్టీలో అంటరాని వారిగా చూస్తుండటంపైనా అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ‘పార్టీ బలోపేతం కావాలంటే చేరికలు తప్పనిసరి. ఒకసారి సభ్యత్వమిచ్చాక వారంతా మన కుటుంబ సభ్యులే. వారికి సముచిత స్థానం దక్కాల్సిందే. ఏ విషయంలోనూ వారిని దూరం పెట్టరాదు. అసోంలో హిమంత బిశ్వశర్మను పార్టీలో చేర్చుకున్నాం. ఇప్పుడు ముఖ్యమంత్రిని చేశాం’ అని అమిత్‌షా పార్టీ శ్రేణులకు హితోపదేశం చేశారు. లోపాలను సరిచేసుకుంటూ.. అందరినీ కలుపుకు పోవాలని గట్టిగా సూచించారు. మరి, బిగ్‌బాస్ వార్నింగ్ తర్వాత అయినా.. ఏపీ బీజేపీ నేతలు దారి కొస్తారా? వైసీపీతో అంటకాగడం మానేసి.. అమరావతి పాదయాత్రలో పాల్గొంటారా?