గవర్నరునే బుక్ చేశారు.. మేమో లెక్కా? జగన్ తీరుతో ఐఏఎస్ ల బెదురు..
posted on Nov 16, 2021 @ 11:12AM
ఏపీలో ఐఏఎస్ అధికారులు హడలెత్తిపోతున్నారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా దివాలా తీయిస్తున్న ఏపీ సర్కార్ నిధులు ఇవ్వాలంటూ ఎప్పుడు ఏ శాఖపై పడుతుందో అని తలలు పట్టుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల తీరుతో ఒక్కొక్క శాఖ నిర్వహణకు కూడా నిధుల్లేక అల్లాడిపోయే దుస్థితిలోకి వెళ్లిపోతున్నాయి. శాఖల నిధులు ఇవ్వడం ఫైనాన్షియల్ కోడ్ కు విరుద్ధం.. ఆ విషయమే చెబితే తమను ఉండనిస్తారా? అని పలువురు ఐఏఎస్ లు ఆందోళన చెందుతున్నారు.
రోజువారీ ఖర్చుల కోసం కూడా ఏపీ సర్కార్ ఏదో ఒక శాఖపై పడి నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలించుకుపోతోంది. అడిగిన విధంగా నిధులు ఇవ్వని ఆయా శాఖల ఐఏఎస్ లను ప్రాధాన్యం లేని శాఖలకు బదిలీచేసి భయపెడుతోంది. ఏపీలో ఏ ఇద్దరు ఐఏఎస్ అధికారులు కలిసినా ఇప్పుడు ఇదే అంశంమీద చర్చ జరుగుతోంది. గతంలో ఏ ఇద్దరు ఐఏఎస్ లు ప్రైవేటుగా కలుసుకున్నా.. ఆరోగ్యాలు, వీకెండ్ టూర్ ల గురించి మాట్లాడుకునే వారు. ఇప్పుడు వారిలో ఆ పరిస్థితి లేదు. వచ్చే నెల జీతాలు వస్తాయా? లేదా అని వారి సంభాషణల్లో కనిపిస్తోంది. అప్పు కోసం గవర్నర్ నే బుక్ చేసిన ప్రభుత్వ పెద్దలు తమను మాత్రం ఎలా వదిలిపెడతారనే టెన్షన్ ఐఏఎస్ లలో పెరిగిపోతోంది.
రాష్రంలోని ఆర్థికశాఖే కాకుండా అన్ని శాఖలూ తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోతున్నాయి. సిబ్బందికి జీతాలు ఇవ్వలేని దుస్థితిలోకి శాఖలు వెళ్లిపోతున్న వైనం ఐఏఎస్ అధికారుల మాటల్లో వ్యక్తం అవుతోంది. తప్పు అని తెలిసినా ప్రభుత్వ పెద్దల వత్తిడితో తమ తమ శాఖల్లోని నిధులు ఇవ్వక తప్పడంలేదని వారు నిట్టూర్పులు విడుస్తుండడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా దివాలా తీయడం తథ్యం.. అయితే.. అది ఎప్పుడనేదే తేలాలని ఓ ఐఏఎస్ వ్యక్తం చేసిన ఆందోళన. ఏపీ దివాలా తీసిన వాస్తవాన్ని అరచేయి అడ్డంపెట్టి దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరో అధికారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా ఆర్థిక శాఖకే పరిమితమైన సంక్షోభం ఇప్పుడు అన్ని శాఖల్నీ చుట్టేస్తోందని వారు తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు.
‘మా శాఖలో ఉణ్న కొద్దిపాటి నిధుల్నీ ప్రభుత్వం లాగేసుకుంది. ఇన్నాళ్లూ ఆ డబ్బులపై వచ్చే వడ్డీతోనే ఉద్యోగులు జీతాలు, పెన్షన్లు, ఆఫీసు నిర్వహణ నడుస్తోంది. మా శాఖ డబ్బుల్ని తిరిగి ప్రభుత్వం ఇస్తుందనే నమ్మకం లేదు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని దుస్థితి అతి త్వరలోనే దాపురిస్తుందనే భయం మరో ఐఏఎస్ అధికారి మాటగా ఉంది. డబ్బుల కోసం ప్రభుత్వం తనపై ఒత్తిడి తీరును సహచర ఐఏఎస్ లతో పంచుకున్నారు. ‘నిధుల గోల్ మాల్ పై భవిష్యత్తులో వచ్చే ప్రభుత్వాలు విచారణ చేయిస్తే.. తమ పరిస్థితి ఏంటనే కలవరం పలువురిని పట్టుకుందని తెలుస్తోంది. తమ శాఖలో రెండేళ్లుగా పేమెంట్ల లేవని, చిన్న చిన్న మెయింటెనెన్స్ బిల్లులు కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని, ఇలా అయితే.. ఆఫీసులు ఇంకెన్నాళ్లు నడపగలమంటే ఓ ఐఏఎస్ వాపోతున్నారట. ఈ పరిస్థితి చూసి సెలవుపెట్టి వెళ్లిపోవాలనిపిస్తోందని కొందరు ఆవేదనతో చెప్పుకుంటున్నారని సమాచారం. గతంలో కాస్త ఫేవర్ చేసినందుకే సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మి జైలు జీవితం గడపాల్సి వచ్చింది. ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉన్న విషయం వారు గుర్తుచేసుకుంటున్నారు.
బడ్జెట్ లో కేటాయించిన డబ్బులు శాఖలకు ఇవ్వాల్సింది పోయి.. రివర్స్ లో అన్ని శాఖల నుంచీ నిధుల్ని ప్రభుత్వం లాగేసుకుంటోందని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ శాఖ ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని ‘నో‘ చెబితే బదిలీ చేసి మరీ లాగేసుకుంటోందని కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు కట్టిన ఫీజులు, పరీక్షల నిర్వహణకు వచ్చిన నిధుల్ని కూడా విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి సతీష్ చంద్ర ప్రభుత్వానికి ముట్టజెప్పిన వైనాన్ని పలువురు ఐఏఎస్ లు ప్రస్తావించుకుంటున్నారు. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ రామకృష్ణ తమ వద్ద ఉన్న 500 కోట్ల రూపాయలు ఇచ్చేందుక నిరాకరించారు. అంతే.. ఆయనను ఊహించని విధంగా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖకు బదిలీ అయిపోయారు.
ఇలా ఒక్కటేమిటి ప్రతి శాఖ నుంచి నిధులు లాక్కుపోయేందుకు ప్రభుత్వం రకరకాల ఫీట్లు చేస్తోందీ ప్రభుత్వం.
ఈ ప్రభుత్వం తీరు కారణంగా ఐఏఎస్ లు, ప్రభుత్వ సలహాదారులు వినియోగిస్తున్న కార్లకు కూడా నెలనెలా అద్దె చెల్లించే పరిస్థితి లేదు. ఒక్కో కారుకు నెలకు 60 వేల చొప్పున ఆరు నెలల అద్దె బకాయిలు ఉన్నాయట. దీంతో యజమానులు ఏ క్షణమైనా అద్దె కార్లను ఆపివేసే చాన్స్ ఉంది.