ఏపీ ఎంపీలు పరమ వేస్ట్.. రఘురామ లేఖాస్త్రం.. మరో సమరం.. బిగ్ ఫైట్.. టాప్ న్యూస్@7PM
posted on Oct 31, 2021 @ 6:24PM
ఆంధ్రప్రదేశ్ ఎంపీలను తీవ్ర స్థాయిలో టార్గెట్ చేశారు జనసేన చీఫ్ పవన్ కల్యాణ్. తమను గెలిపించిన ప్రజలను గాలికొదిలేసి వ్యాపారులు చేసుకుంటున్నారని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి సంఘీభావం తెలిపి బహిరంగ సభలో పాల్గొన్నారు. కార్మిక సంఘాలకు సభాముఖంగా మద్దతు ప్రకటించారు. సభలో స్టీల్ ప్లాంట్ అంశాలపై ఆగ్రహావేశాలతో ప్రసంగించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలపై ఎంపీలు ఎందుకు స్పందించరని పవన్ మండిపడ్డారు.
----
ఎన్‌జీటీ చైర్మన్ ఆదర్శ్‌కుమార్ గోయల్‌కి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాసారు. విశాఖ రుషికొండ ప్రాంతంలో పర్యావరణ ఉల్లంఘన, పర్యావరణ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని రఘురామ పేర్కొన్నారు. వెంటనే కేసు విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేసారు. పర్యావరణ ఉల్లంఘనలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకోవాలని రఘురామ కోరారు.
----------
ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఏపీ నుంచి ముగ్గురు, తెలంగాణ నుంచి ఆరుగురు ఎమ్మెల్సీలకు పదవీకాలం ముగిసింది. ఈ నేపథ్యంలో వీటికి నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుంది. నవంబర్ 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న పరిశీలన జరగనుంది. 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టనున్నారు.
--------
వ్యక్తులకు పదవి అలంకారం కాదు బాధ్యత అని సుప్రీంకోర్టు న్యాయమూర్తి లావు నాగేశ్వరరావు అన్నారు. పూర్వ విద్యార్థులు ఎదిగిన తర్వాత తమ స్కూలు గురించి మర్చిపోకుండా స్కూలు అభివృద్ధికి సహకారం అందించారన్నారు. పదవి వచ్చిన తర్వాత సమాజం గురించి మర్చిపోకుండా సేవ చేయడమే పదవికి న్యాయం చేయడమని ఆయన పేర్కొన్నారు. మనిషికి మానసిక వికాసానికి విద్య ఉపయోగపడుతుందన్నారు.
---------
2023 ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 78 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్కం ఠాగూర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఇక్కడ జరిగిన పార్లమెంటరీ నియోజకవర్గ సమావేశంలో పాల్గొన్న ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అరాచకాలు, అక్రమ కేసులపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.
---------
పశ్చిమ గోదావరి జిల్లాలో నకిలీ కరెన్సీని చలామణి చేస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులైన ఏలేటి చంద్ర శేఖర్, లాగు శ్రీను, పాపదాసు రమేష్ రెడ్డి, దోరేపల్లి మధు శేఖర్, శింగలూరు సురేష్, సిద్ధానిలను ఏలూరులో మీడియా ముందు పోలీసులు ప్రవేశపెట్టారు. వారి నుంచి లక్షా 50 వేలు అసలు నోట్లు, 12 లక్షల విలువైన నకిలీ నోట్లు, 3 మోటార్ సైకిల్స్, 4 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు
---------
ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వాలని సీఎం కేసీఆర్ ను కోరుతూ తెలంగాణ లో మరో నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ని కోటపల్లి మండలం బబ్బెరు చెలక గ్రామానికి చెందిన అసంపల్లి మహేష్ అనే నిరుద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. టీచర్ ట్రైనింగ్ చేసిన మహేష్ కొన్నాళ్లు గా నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నాడు. అయినా ఫలితం లేక పోవడం తో మనస్తాపానికి లోనయ్యారు.
-----
కుమురం భీం జిల్లాలోని కాగజ్‌నగర్‌లో పెద్దపులి చర్మాన్ని పోలీసులు పట్టుకున్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసారు. పెద్దపులి చర్మాన్ని మహారాష్ట్రకు తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండంలోని హీరాపూర్ అటవీ ప్రాంతంలో కొన్నాళ్ల క్రితం పులిని చంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులతో కలిసి అటవీ ప్రాంతాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.
-------
కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కాన్వాయ్‌పై కాంగ్రెస్ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడికి పాల్పడ్డారు. ఒడిశా రాజధాని భుబనేశ్వర్‌లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లో ఈ ఘటన జరిగింది. మంత్రిపై కోడిగుడ్ల దాడిని ఖండిస్తూ బీజేపీ కార్యకర్తలు ఎయిర్‌పోర్ట్ ముందు నిరసనకు దిగారు.కొద్ది రోజుల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌లో జరిగిన దుర్ఘటనలో అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
--------
తాలిబన్ సుప్రీం లీడర్ హైబతుల్లా అఖుండ్‌జాదా చనిపోయాడంటూ కొంత కాలంగా పుకార్లు షికారు చేస్తున్నాయి. కాగా, ఈ వార్తలను తోసిపుచ్చుతూ మొదటిసారిగా పబ్లిక్ ముందుకు హైబతుల్లా వచ్చారంటూ తాలిబన్లు ప్రకటించారు. కాందహార్‌లోని జామియా దారుల్ అలూమ్ హకీమియా అనే ఇస్లామిస్ట్ పాఠశాలను హైబతుల్లా ఆదివారం సందర్శించారని, అక్కడ ప్రజలకు ఆయన కనిపించారని ఓ అంతర్జాతీయ మీడియాకు తాలిబన్ తెలిపింది.