ఏపీలో ఎమ్మెల్సీ పదవులు దక్కేది వీళ్లకేనా? కేబినెట్ లోనూ ఆయనకు చోటు ఖాయమా?
posted on Oct 31, 2021 @ 4:52PM
కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ముగియగానే ఏపీలో మరో ఎన్నికల నగారా మోగింది. శాసనమండలిలో ఖాళీల భర్తీకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఏపీ శాసనమండలిలో ప్రస్తుతం 14 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు మూడు కాగా... స్థానిక సంస్థల ఎమ్మెల్సీలు పదకొండు. అయితే ఆదివారం ఎమ్మెల్యే కోటాలోని మూడు మండలి సీట్ల భర్తీకి ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చింది. నవంబర్ 9న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. నవంబర్ 16 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. నవంబర్ 17న పరిశీలన, 22న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. నవంబర్ 29న పోలింగ్ నిర్వహించి, అదే రోజు కౌంటింగ్ నిర్వహిస్తారు.
శాసనమండలి ఎన్నికల షెడ్యూల్ రావడంతో పెద్దల సభకు కొత్త ఎంపిక అయ్యేది ఎవరు.. ఎవరికి అవకాశం దక్కనుంది అనే చర్చ సాగుతోంది. ప్రస్తుతం అసెంబ్లీలో ఉన్న బలాన్ని బట్టి ఎమ్మెల్యే కోటాలో జరగనున్న మూడు సీట్లు వైసీపీ ఖాతాలోనే పడనున్నాయి. వైసీపీ అధినేత సీఎం జగన్..ఎమ్మెల్యే కోటాలోని మూడు సీట్లతో పాటు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు పూర్తి చేశారని తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని జిల్లాల్లోనూ వైసీపీనే మెజార్టీ సాధించటంతో ఆ 11 స్థానాలు వైసీపీనే గెలవనుంది. దీంతో మొత్తంగా 14 స్థానాలకు లిస్ట్ దాదాపుగా ఖరారైందని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. సామాజిక సమీకరణాల, 2024 సార్వత్రిక ఎన్నికలకు ఉపయోగపడేలా అభ్యర్థులను ఖరారు చేశారని అంటున్నారు, గతంలో సీఎం జగన్ హామీ ఇచ్చిన వారికి ఈ సారి ఖాయంగా అవకాశం దక్కుతుందని చెబుతున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా ఎంపిక చేసిన ఎమ్మెల్సీలతో కొందరికి జగన్ కేబినెట్ లో స్థానం దక్కుతుందనే ప్రచారం సాగుతోంది.
ఇందులో మొదటగా గుంటూరు జిల్లా చిలకూలురు పేట మాజీ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ కు ఈసారి మండలి బెర్త్ ఖాయమని అంటున్నారు. వైసీపీలో మొదటి నుంచి యాక్టివ్ గా ఉన్న మర్రికి గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదు జగన్. అయితే ఎన్నికల ప్రచారంలో మాత్రం మర్రిని మంత్రిని చేస్తానని ప్రకటించారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావించారు. కాని రెండున్నర ఏండ్లు అవుతున్నా మర్రికి మాత్రం న్యాయం జరగలేదు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన ప్రతిసారి మర్రికి ఖాయమని ప్రచారం జరగడం.. చివరకు ఆయనకు షాక్ తగలడం వస్తూ ఉంది. ఈసారి మాత్రం మర్రి రాజశేఖర్ కు సీటు ఖాయమైందని అంటున్నారు.
గుంటూరు జిల్లాకే చెందిన పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు కూడా రేసులో ముందున్నారని అంటున్నారు. వైసీపీ నుంచి గతంలోనూ ఎమ్మెల్సీగా చేశారు ఉమ్మారెడ్డి. మండలిలో వైసీపీఎల్పీ నేతగా
వ్యవహరించారు. నెల్లూరు జిల్లాకు చెందిన బీద మస్తాన్ రావుకు ఎమ్మెల్సీ ఖాయమని చెబుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత టీడీపీకి రాజీనామా చేసి వైసీపీలో చేరారు. చిత్తూరు జిల్లా కుప్పం వైసీపీ ఇంచార్జ్ గా ఉన్న భరత్ కు మండలి సీటు కన్మామ్ అయిందంటున్నారు. కుప్పంపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ వైసీపీ మంచి ఫలితాలు సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టడానికి భరత్ కు ఎమ్మెల్సీ ఇస్తు్న్నారని అంటున్నారు.
పార్టీలో మొదటి నుంచి చురుకుగా పని చేసిన విశాఖపట్నం జిల్లాకు చెందిన వరుదు కళ్యాణి.. సీఎం జగన్ హామీ ఇచ్చారని తెలుస్తోంది. కృష్ణా జిల్లా గన్నవరం నేత యార్లగడ్డ వెంకట్రావుకు ఎమ్మెల్సీ ఖరారైందని సమాచారం. గన్నవరం నుంచి టీడీపీ అభ్యర్థిగా గెలిచిన వంశీ.. ప్రస్తుతం వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికల్లో గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థిగా యార్లగడ్డ పోటీ చేశారు. వంశీ చేరిక తర్వాత నియోజకవర్గంలో రెండు వర్గాల ఆదిపత్య పోరు సాగుతోంది. దీంతో యార్గగడ్డను మండలికి పంపించి వంశీకి లైన్ క్లియర్ చేయాలని జగన్ భావిస్తున్నారని సమాచారం.
ప్రకాశం జిల్లా చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ కు శాసనమండలి బెర్త్ ఖాయమైందని తెలుస్తోంది. ఆమంచి గత ఎన్నికల్లో చీరాలలో ఓడిపోయారు. తర్వాత ఆమంచిపై గెలిచిన కరణం బలరాం వైసీపీలో చేరారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య కోల్డ్ వార్ సాగుతోంది. దీంతో ఇద్దరి మధ్య సయోద్య కుదిర్చిన జగన్.. ఆమంచిని శాసనమండలికి పంపించి కరణంకు చీరాలలో ఇబ్బంది రాకుండా చూస్తున్నారని చెబుతున్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన హరిప్రసాద్ రెడ్డి, అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సీనియర్ నేత వై లక్ష్మీదేవి మండలి రేసులో ముందున్నారని చెబుతున్నారు.