ఏపీ పర్యటనలో పవన్ కల్యాణ్.. పోసానికి ఎలా కౌంటరిస్తారో?
posted on Sep 29, 2021 @ 11:22AM
వైసీపీ, జనసేన మధ్య సాగుతున్న మాటల యుద్ధంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక పెరిగింది. జగన్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ విమర్శలు చేయగా.. ఆయన వైసీపీ మంత్రులు కౌంటరిచ్చారు. ఇందులోకి ఎంట్రీ ఇచ్చిన పోసాని కృష్ణ మురళీ.. పవన్ కల్యాణ్ పై బండ బూతులతో విరుచుకుపడ్డారు. పవన్ ను టార్గెట్ చేస్తూ పోసాని మాట్లాడిన మాటలు ప్రకంపనలు స్పష్టిస్తున్నాయి. హైదరాబాద్ లో కేసుల వరకు వెళ్లింది.
పీకే, పోసాని మాటల వార్ హద్దులు దాటిన సమయంలోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏపీలో పర్యటిస్తుండటం కాకరేపుతోంది. రెండు రోజుల పర్యటన కోసం విజయవాడ వచ్చిన పవన్ కు జనసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం నుంచి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు జన సేనాని. నాదేండ్ల మనోహర్, ఇతర సభ్యులు, పార్టీ ముఖ్య నేతలతో పవన్ భేటీ కానున్నారు. స్టీల్ ఫ్లాంట్, అమరావతి, శ్రమదానం, బద్వేల్ ఉప ఎన్నిక, ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించనున్నారు. ఈ సమావేశం తర్వాత ప్రభుత్వంపై పోరాడేందుకు ప్రత్యక్ష కార్యాచరణ ప్రకటించే అవకాశముంది. రెండు రోజులపాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పవన్ పర్యటన కొనసాగుతుందని పార్టీ నేతలు తెలిపారు.
కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్ వర్సెస్ వైసీపీ మంత్రులుగా వ్యవహారం మారింది. పవన్ దూకుడుపై ప్రభుత్వ పెద్దల్లో చర్చ జరుగుతోంది. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించడానికే పోసానితో విమర్శలు చేయిస్తున్నారని జనసేన నేతలు విమర్శిస్తున్నారు. మంగళవారం హైదరాబాద్ లో మాట్లాడిన పోసాని కృష్ణ మురళీ.. తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడ్డారు. మెగా ఫ్యామిలీని కూడా విమర్శించారు. పోసాని వ్యాఖ్యలపై జన సైనికులు రగిలిపోతున్నారు. ఈ నేపథ్యంలో పోసాని మాటలపై పవన్ కల్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.