తిరుపతిలో అమరావతి.. జగన్ 100 తప్పులు.. రేవంత్ పాదయాత్ర.. టాప్‌న్యూస్ @ 7pm
posted on Dec 17, 2021 @ 5:38PM
1. ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా మాత్రం అమరావతినే ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తిరుపతి సభ సాక్షిగా అన్నిపార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి అమరావతికి మద్దతు పలికారని.. సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి ఏ ఒక్కరి రాజధానో కాదని.. 5 కోట్ల ఆంధ్రులదని.. ప్రజా రాజధాని అందరిదనీ.. తిరుపతి సభ వేదికగా తేల్చి చెప్పారు.
2. ఏపీ రాజధాని అమరావతి రూపశిల్పి చంద్రబాబు.. ఆయనే అమరావతిని సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్‌గా రూపొందించారని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. తిరుపతి మహాద్యమ బహిరంగ సభలో పాల్గొన్న రఘురామ.. ఏకైక రాజధాని కోసం పాదయాత్ర చేసిన ప్రతీ ఒక్కరినీ కొనియాడారు. పాదయాత్రలో మహిళలను ఎన్నో ఇబ్బందులకు గురి చేశారని మండిపడ్డారు. పాదయాత్ర చేసిన మహిళల త్యాగానికి ఏదీ సాటిరాదని అన్నారు.
3. దోచుకునేందుకు ఏమీలేదనే అమరావతిని వద్దంటున్నారని సీఎం జగన్ పై బీజేపీ మాజీ అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. విశాఖను దోచుకునేందుకే అక్కడ రాజధాని అంటున్నారని ఆరోపించారు. రాజధాని పేరుతో దోచుకుంటారని విశాఖ ప్రజలు భయపడుతున్నారని చెప్పారు. అమరావతిలో అనేక ప్రాజెక్ట్‌లకు కేంద్రం నిధులిచ్చిందని.. అమరావతి రాజధానికి బీజేపీ మద్దతు ఉంటుందని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.
4. అమరావతి అనే శిశువును జగన్‌రెడ్డి 3 ముక్కలు చేశారని సీపీఐ నేత నారాయణ మండిపడ్డారు. జగన్‌రెడ్డి లాంటి మూర్ఖుడు మరొకరు ఉండరన్నారు. మహిళల కన్నీరు ఏపీకి మంచిది కాదని చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చాక రాజధాని లేని రాష్ట్రం మనదేనని నారాయణ అన్నారు.
5. నిత్యావసర ధరల పెరుగుదలకు నిరసనగా శనివారం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పాదయాత్ర చేపట్టనున్నారు. చేవెళ్ల మండలంలోని ముడిమ్యాల నుంచి చేవెళ్ల వరకు 9 కి.మీ.లు ఈ యాత్ర సాగనుంది. చేవెళ్ల పట్టణంలో రోడ్‌షో, బహిరంగ సభ ఉంటుంది. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి దిగ్విజయ్ సింగ్ హాజరయ్యే అవకాశం ఉంది.
6. సీఎం కేసీఆర్‌కి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. నెల రోజుల్లో ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తప్పదంటూ హెచ్చరించారు. ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగ ఖాళీలపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. జోన్లు, మల్టీ జోన్లకు అనుగుణంగా సర్వీసు రూల్స్‌ను రూపొందించలేదని.. న్యాయపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉందని లేఖలో తప్పుబట్టారు.
7. తెలంగాణలో బీజేపీ ప్రళయం రాబోతోందని.. తట్టుకోవడం సీఎం కేసీఆర్ వల్ల కాదని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘కేసీఆర్ మీద ప్రతీకారం తీర్చుకుంటానని ప్రతిజ్ఞ చేస్తున్నా. కేసీఆర్ వ్యూహాలు తెలిసివాడిని. ఆయన ఎంత గట్టిగా మాట్లాడుతాడో అంత పిరికివాడు. ప్రగతి భవన్ ఇనుప కంచెలు తెగిపోయే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. అటు సూర్యుడు ఇటు ఉదయించినా కేసీఆర్ మళ్లీ గెలవడు అని ఈటల రాజేందర్ సవాల్ చేశారు.
8. పీఆర్సీ, ఉద్యోగుల డిమాండ్లపై సీఎం జగన్ సమీక్షించారు. మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిలు ఉద్యోగ సంఘాలతో చర్చల వివరాలను జగన్‌కు వివరించారు. ఫిటిమెంట్ ఎంత శాతం ఇవ్వాలనే అంశంపై సీఎం చర్చించారు. ఉద్యోగ సంఘాల నేతలతో సజ్జల మరోసారి చర్చించే అవకాశం ఉంది.
9. ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి ఉమ్మడి ఉద్యమాన్ని మధ్యలోనే ఆపేసి సీపీఎస్ ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీశారని ఏపీ సీపీఎస్ అధ్యక్షుడు ఆర్ అప్పలరాజు అన్నారు. ఉమ్మడి జేఏసీ ఉద్యమం విరమణను వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ హామీలు రాకుండానే ఉద్యమానికి విరామం ప్రకటించారని తప్పుబట్టారు. సీపీఎస్ రద్దయ్యేవరకు ఉద్యమాన్ని ఆపేది లేదన్న మీరు సీపీఎస్ ఉద్యోగుల అభిప్రాయాన్ని తీసుకోకుండా ఉద్యమాన్ని ఆపేశారని నిలదీశారు.
10. ఏపీ అభివృద్ధి పట్ల వైసీపీ ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా ఉందని నటుడు శివాజీ మండిపడ్డారు. జగన్ ప్రజావ్యతిరేక నిర్ణయాలను విద్యార్థులు ప్రశ్నించాలన్నారు. మీ భవిష్యత్తును తొక్కేస్తున్న వ్యక్తి గురించి మాట్లాడరా? అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎన్నో తప్పులు చేస్తున్నారని.. జగన్ చేసిన తప్పులు ఇప్పటికే వంద దాటాయని శివాజీ అన్నారు.