అమరావతి అందరి రాజధాని.. ధర్మపోరాటం ఆగదన్న చంద్రబాబు..
posted on Dec 17, 2021 @ 4:58PM
ఏపీలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి.. రాష్ట్రానికి ఏకైక రాజధానిగా మాత్రం అమరావతినే ఉండాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపు ఇచ్చారు. తిరుపతి సభ సాక్షిగా అన్నిపార్టీలు రాజకీయాలకు అతీతంగా ఒకే వేదికపైకి వచ్చి అమరావతికి మద్దతు పలికారని.. సీఎం జగన్ ఇప్పటికైనా కళ్లు తెరవాలని చంద్రబాబు స్పష్టం చేశారు. రాజధాని ఉద్యమానికి కుల ముద్ర వేయడం దారుణమన్నారు. అమరావతి ఏ ఒక్కరి రాజధానో కాదని.. 5 కోట్ల ఆంధ్రులదని.. ప్రజా రాజధాని అందరిదనీ.. జగన్‌రెడ్డి రాజధాని అస్సలే కాదని టీడీపీ అధినేత చంద్రబాబు తిరుపతి సభ వేదికగా తేల్చి చెప్పారు. తిరుపతి సభకు రాకుండా ప్రజలను అడ్డుకోవడంపై మండిపడ్డారు.
ఎస్సీలపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టిన పనికి మాలిన దరిద్రపు ప్రభుత్వం ఇదని మండిపడ్డారు చంద్రబాబు. అమరావతి రైతులు చేసిన తప్పేంటని నిలదీశారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో.. 40 రోజుల పాటు 450 కి.మీ.లు పాదయాత్ర చేయగా.. పాదయాత్రలో 2500 మందిపై 100 కేసులు పెట్టారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నైనా కేసులు పెట్టుకోండి.. తాము మాత్రం ధర్మపోరాటం ఆపేది లేదని చంద్రబాబు తేల్చిచెప్పారు.
మడమ తిప్పనన్న జగన్.. అమరావతిపై ఎందుకు మాట తప్పారు? అమరావతి మునిగి పోతుందని దుష్ప్రచారం చేశారు..ఎప్పుడైనా నీళ్లొచ్చాయా? అమరావతిలో భూమి గట్టిది కాదన్నారు.. హైదరాబాద్ కంటే గట్టి నేల అని చెన్నై ఐఐటీ నిపుణులు తేల్చారు. ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందని అపోహలు సృష్టించారు.. కాదని తేలిపోయింది. వేంకటేశ్వరస్వామి సాక్షిగా చెబుతున్నా.. ఈ ధర్మ పోరాటంలో విజయం మనదే. త్యాగం, పోరాటం అమరావతి రైతులది. వారి త్యాగం 5 కోట్ల ఆంధ్రుల కోసమే అని చంద్రబాబు స్పష్టం చేశారు.