గవర్నర్‌కు కోపమొచ్చింది.. జగన్ సర్కారుకు మూడినట్టేనా?
posted on Nov 1, 2021 @ 6:53PM
ఊరందరిదీ ఒక దారి అయితే, ఉలిపి కట్టెది వేరొక దారి. రాష్ట్రంలో జరుగుతున్న పరినామాలను గమనిస్తే ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానిది కూడా అదే ‘అడ్డదారి’ అనుకోవలసి వస్తోంది. ఏపీ ప్రభుత్వమే కాదు, అన్ని ప్రభుత్వాలు అప్పులు చేస్తాయి, కానీ, ఏపీ ప్రభుత్వం అప్పులు మాత్రమే చేస్తుంది. అప్పుల కోసం తప్పులు చేస్తుంది. అడ్డదారులు తొక్కుతుంది. అది ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రత్యేకత. అంతే కాదు. అప్పుల కోసం ఏ తప్పు చేసేందుకు అయినా వైసీపీ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగానే ఉంటుందనే స్థాయికి రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చింది. ఇదీ ఈ రెండున్నరేళ్ళ జగన్ రెడ్డి పాలనలో అందరికీ అర్థమైన నిజం. ఇంతవరకు ఏపీ ప్రభుత్వం చేసిన అప్పులు రోజుకు అక్షరాల రూ. 116 కోట్లు వడ్డీ కట్టే (అసలు అప్పు రూ. 6 లక్షల కోట్లు అలా ఉండగా) దౌర్భాగ్యస్థితిలో రాష్ట్రం ఉందంటే, ప్రభుత్వం అప్పుల కోసం ఎన్నెన్ని తప్పులు చేసిందో, ఎన్నెన్ని అడ్డదారులు తొక్కింది వేరే చెప్పనక్కర లేదు. అందుకే ఏపీ అంటే అప్పుల రాష్ట్రం, అరాచక రాష్ట్రం అనే పేర్లు ట్యాగ్’ లైన్’ గా చేరిపోయాయి. అందుకే గతంలో అంతర్జాతీయ సంస్థలు ఏపీ ప్రభుత్వం తప్పుడు విధానాలను పసికట్టి, ఒప్పందాలను వెనక్కి తీసుకున్నాయి. పెట్టుబడుల విషయంలో వెనకడుగు వేశాయి.
ఇప్పుడు, అప్పులకోసం ప్రభుత్వం ఏకంగా తమ పేరునే ఉపయోగించుకోవడం పట్ల రాష్ట్ర గవర్నర్ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి వచ్చింది. వివరాలోకి వెళితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి రూ.25 వేల కోట్ల అప్పు తెచ్చింది. ఇందుకోసం ఏకంగా రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేరును వాడేసుకుంది. ఇంకా స్పష్టంగా చెప్పుకోవాలంటే, జగన్ రెడ్డి ప్రభుత్వం గవర్నర్’ కున్న సార్వభౌమాదికారాలను రూ. 25 వేల కోట్లకుకు తాకట్టు పెట్టింది. ఇది ఎవరో చేసిన ఆరోపణ కాదు. రాష్ట్ర హైకోర్టు సంధించిన ప్రశ్న. అప్పు ఒప్పంద పత్రంలో గవర్నర్ పేరు ఎలా చేరుస్తారని, రాష్ట్ర హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజానికి కోర్టు అక్షింతలు వేసిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
ఆ వివరాలలోకి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్‌డీసీ) ద్వారా తీసుకున్న అప్పులు, జరిపిన లావాదేవీలకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లన్నింటినీ తమ ముందుంచాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అంతేకాదు ఈ విషయంలో కౌంటరు దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. ఏపీఎస్‌డీసీ ద్వారా రూ.25వేల కోట్ల రుణం పొందేందుకు... బ్యాంకులతో చేసుకున్న ఒప్పందంలో వ్యక్తిగతంగా గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ పేరు ఎలా చేరుస్తారని న్యాయస్థానం ప్రశ్నించింది. ఆస్తులు తనఖా పెట్టి తీసుకున్న రుణం చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైతే గవర్నర్‌కు ఆయా బ్యాంకులు నోటీసులు జారీ చేసి, కేసులు పెట్టేందుకు వీలు కల్పించడాన్ని న్యాయస్థానం తప్పుపట్టింది. రాజ్యాంగంలోని 361 అధికరణ ప్రకారం గవర్నర్‌పై సివిల్, క్రిమినల్ కేసులు నమోదు చేయడానికి వీల్లేకుండా రక్షణ ఉందని గుర్తు చేసింది. ఒప్పందం ద్వారా గవర్నర్ సార్వభౌమాధికారాన్ని తొలగించడం సరికాదని తెలిపింది.
ఇక, వ్యక్తిగతంగా తన పేరును చేర్చడంపై గవర్నర్ బిశ్వభూషన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఇలా ప్రభుత్వం అప్పు పత్రంలో తమ పేరును చేర్చడం పట్ల గవర్నర్ అసహనంతో ఉన్నారని, దీంతో ఆయనకు వివరణ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కార్యాలయం, ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు పడరాని పాట్లు పడుతున్నారని అధికార వర్గాల్లో వినవస్తోంది. అదే సమయంలో కొందరు అధికారులు, పాలకుల పాపాలకు తాము తలవచుకోవలసి వస్తోందని వాపోతున్నారు.
నిజానికి భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రానికి అధిపతి గవర్నర్.. ప్రభుత్వ కార్యకలాపాలన్నీ గవర్నర్ పేరు మీదనే జరుగుతాయి. అయితే గవర్నర్ పేరును ఎక్కడా కూడా ప్రస్తావించరు. ప్రస్తావించరాదు. ప్రభుత్వం జారీ చేసే జీవోలు ఇతర ఉత్తర్వులలో కూడా, ‘గవర్నర్ పేరున’( 'ఇన్ ద నేమ్ ఆఫ్ గవర్నర్') అని మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేసుకున్న రుణ ఒప్పందంలో గవర్నర్ పేరును చేర్చారు. అంతే కాదు, రేపు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం అప్పు తిరిగి చెల్లించలేక పొతే, నోటీసులు ఎవరికి ఇవ్వాలి? అన్నచోట బిశ్వభూషన్ హరిచందన్ అని గవర్నర్ పేరు రాశారు. దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
నిజానికి ఈ ఉచ్చులోంచి ఎలా బయట పడాలి అనే విషయంలో అధికారాలు మల్లగుల్లాలు పడుతున్నారు. అంతే కాదట, వారి ఆందోళనకు ఇంకో కారణం కూడా ఉందట. తీగలాగితే ఇంకెన్నిడొంకలు కదులుతాయో, ఇంకెందరు అధికారులు బలిపశువులు అవుతారో అన్న ఆందోళన అధికారవర్గాల్లో వ్యక్తమవుతోంది. మరోవంక ఈ మధ్య కాలంలో ప్రభుత్వం జీవోలని దాచేయడంతో రాజకీయ వర్గాల్లోనూ, జగన్ రెడ్డి అప్పుల లోగుట్టు మీద అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ ప్రతిష్టను దిగజార్చడంతో పాటుగా, రాష్ట్ర హైకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయలని కోరింది. ఈ నేపధ్యంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తేలుకుట్టిన దొంగలా.. తప్పులను కప్పిపెట్టేందుకు కేంద్రంతో కాళ్ళబేరానికి వచ్చినట్లు సమాచారం.