మైసమ్మకు విస్కీ పోసిన ఆర్జీవీ.. బండ బూతులు తిడుతున్న భక్తులు..
posted on Oct 12, 2021 @ 7:08PM
వివాదాలకే కేరాఫ్ దర్శకుడు రాంగోపాల్ వర్మ. ఆయన ఏం చేసినా వివాదమే. వివాదం అయ్యేలానే ఆయన వ్యవహారశైలి, ఆయన తీరు ఉంటుందని అంటారు. వర్మ సినిమా తీసినా... ఎవరినైనా టార్గెట్ చేసినా... ఏ సమస్యపై అయినా స్పందించినా అది సంచలనంగానే ఉంటుంది. కొన్నేండ్లుగా అలా జరుగుతూనే ఉంటోంది. రాజకీయాల్లోనూ ఆయన తలదూర్చి రచ్చ చేస్తుంటారు. అయితే ఎక్కువగా ఏపీ విషయాలపైనే ఆయన రియాక్ట్ అవుతుంటారు. తెలంగాణ అంశాలపై స్పందించినా.. ఏపీతో పోలిస్తే చాలా తక్కువ.
వరంగల్ జిల్లాకు చెందిన ఫైర్ బ్రాండ్ లీడర్లు కొండా దంపతుల బయోపిక్ తీసే పనిలో ఉన్నారు రాంగోపాల్ వర్మ. కొండా సురేఖ, మురళీ సమక్షంలో సినిమా షూటింగ్ ను మొదలుపెట్టారు. కొండా దంపతుల బయోపిక్ ఎలా ఉంటుందన్నదే వివాదంగా మారగా... తాజాగా మరో సంచలనానికి తెర తీశారు వర్మ. సినిమా షూటింగ్ కోసం వరంగల్ లో పర్యటిస్తున్న రాంగోపాల్ వర్మ.. చిత్రయూనిట్‌తో స్థానిక మైసమ్మ టెంపుల్‌ను దర్శించుకున్నారు. ఇందులో భాగంగా అమ్మవారికి విస్కీని సాకగా పోస్తూ(తాగిస్తున్నట్టు) ఓ ఫొటోను తన ట్విట్టర్‌లో అప్‌లోడ్ చేశారు. అంతేకాదు ‘నేను వోడ్కా మాత్రమే తాగినప్పటికీ, మైసమ్మ దేవతను విస్కీ తాగేలా చేసాను’ అంటూ ట్వీట్ చేయడంతో రాంగోపాల్ వర్మపై దుమారం రేగుతోంది.
సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లపై ఆర్జీవీ వేసే సెటైర్లను అంతగా పట్టించుకోని నెటిజన్లు.. మైసమ్మకు విస్కీ పోయడంపై మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నారు. హిందూ దేవుళ్లపై నమ్మకం లేకపోతే వదిలేయండి కానీ, తరతరాలుగా వస్తున్న ఆచరాలను హేళన చేయకండి అంటూ హిందూ బంధువులు మండిపడుతున్నారు. కత్తి మహేష్‌కు పట్టిన గతే ఆర్జీవీకి పడుతోంది అంటూ కొందరు బండ బూతులు తిడుతున్నారు. ఇతర మతాలపై కూడా ఇదే విధంగా వ్యవహరిస్తారా అంటూ నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చెప్పుతో కొట్టేవారు లేక ఇలాంటి చేష్టలు చేస్తున్నాడని.. మైసమ్మ తల్లితో ఆటలు ఆడొద్దు అంటూ నెటిజన్లు హెచ్చరిస్తున్నారు. ఈ వ్యవహారం ప్రస్తుతం నెట్టింట్లో తెగవైరల్ అవుతోంది.