TOP NEWS @ 7pm
posted on Oct 7, 2021 @ 6:53PM
1. తెలంగాణలో భారీ పెట్టుబడి పెట్టనున్నట్టు ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల సంస్థ ట్రిటాన్ ఈవీ ప్రకటించింది. త్వరలో రాష్ట్రంలో రూ.2100 కోట్లతో విద్యుత్ వాహనాల యూనిట్ ప్రారంభిస్తామని తెలిపింది. ఈ మేరకు తెలంగాణ సర్కారుతో ట్రిటాన్ ప్రతినిధులు అవగాహన ఒప్పందం చేసుకున్నారు. జహీరాబాద్ పారిశ్రామిక ప్రాంతంలో పరిశ్రమ ఏర్పాటుకు పరిశీలిస్తున్నారు.
2. ఆసరా కాదు.. పచ్చి దగా అని, కోటి మంది డ్వాక్రా మహిళలకు జగన్ రెడ్డి టోకరా పెడుతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. 98 లక్షల మంది డ్వాక్రా మహిళలుంటే ఆసరా 78 లక్షల మందికా? సెప్టెంబరులో నొక్కాల్సిన ఆసరా మీట.. ఎందుకు ఆలస్యమైంది? అంటూ అచ్చెన్న ప్రశ్నించారు. మొత్తం సొమ్మును నాలుగు విడతల్లో నాలుగేళ్ల పాటు ఇస్తానన్నావ్... ఇప్పుడు ఒక విడతను పది విడతలు చేశావని ఆగ్రహం వ్యక్తం చేశారు.
3. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మనకు తెలిసి పవన్ కల్యాణ్ కు ముగ్గురు భార్యలు, తెలియకుండా ఎంతమంది ఉన్నారో.. అన్నారు. హీరోయిన్ పూనమ్ కౌర్‌ను ప్రేమించి, ప్రెగ్నెసి వస్తే అబార్షన్ చేయించి, రూ.5కోట్లు ఇచ్చి సెటిల్ చేశాడని ఆరోపించాడు. పవన్ కల్యాణ్ రెండు రోజులు రాష్ట్రంలో తిరిగితే రాష్ట్రమంతా అల్లకల్లోలమేనన్నారు. జన సైనికులను అసాంఘిక శక్తులుగా మారుస్తున్నాడన్నారు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్.
4. బతుకమ్మలపై నుంచి తన కారు వెళ్లిన ఘటనపై టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి స్పందించారు. తాను ఆ సమయంలో కారులో లేనని, నడుచుకుంటూనే వెళ్లానని చెప్పారు. కొందరు కావాలనే తనపై బురదజల్లుతున్నారని ఆరోపించారు. మహిళల మనోభావాలు దెబ్బతింటే క్షమాపణలు కోరతామని చల్లా ధర్మారెడ్డి ప్రకటించారు.
5. ప్రజలు దోమల బారినపడి, డెంగ్యూ మలేరియా, ఇతర విషజ్వరాలతో అల్లాడుతున్నా ప్రభుత్వంలో చలనంలేదని టీడీపీ అధికార ప్రతినిధి పిల్లి మాణిక్యరావు అన్నారు. దోమల దెబ్బ ఎలా ఉంటుందో తెలియాలంటే, మంత్రులు ప్రజలతో కలిసి రోడ్లపై తిరగాలని అన్నారు. దోమలు రక్తాన్ని పీల్చిబతికితే, మంత్రులు ప్రజలను అన్నిరకాలా పీల్చిపిప్పిచేసి బతికేస్తున్నారన్నారు. రాష్ట్రంలో తక్షణమే హెల్త్ ఎమర్జన్సీ విధించాలని డిమాండ్ చేశారు.
6. ప్రభుత్వం రుణ యజ్ఞం పేరిట అప్పులు తెస్తోందని ఎంపీ రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కొత్త కోణాల్లో అప్పు ఎలా తీసుకురావాలని తమ ప్రభుత్వం ఆలోచిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వం ఏపీ స్టేట్ రోడ్ డెవలప్‌మెంట్ కింద రూ. 3వేల కోట్లు రుణం తెచ్చిందని, ఇప్పుడు తమ ప్రభుత్వం కొత్తగా జీవో ఇచ్చి 574 ఎకరాలు, ఆర్‌అండ్‌బీ ఆస్తులపై అప్పులు తేవాలని చూస్తోందన్నారు.
7. ఏపీలో ఉద్యోగులకు జీతాలు సరైన సమయంలో ఇవ్వడంలేదని, పెన్షన్లు అందని పరిస్థితి నెలకుందని ఏపీ ఉద్యోగ సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఏ ఏరియర్స్, పీఆర్సీ పెండింగ్‌లో ఉన్నాయని, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకపోతే ఉద్యమ కార్యాచరణ మొదలు పెడతామని ఏపీఎన్జీవో ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు.
8. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి సంస్థ ద్వారా రూ. 25 వేల కోట్లు రుణం తీసుకురావడంపై హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిగింది. రుణం తీసుకునే అంశాలు, బ్యాంకుతో కుదుర్చుకున్న ఒప్పందంలో గవర్నర్ సార్వభౌమాధికారాన్ని అధిగమించటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 361కి ఇది పూర్తి వ్యతిరేకమన్నారు. అలా చేసేందుకు తమకు అధికారం ఉందని ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత దవే వాదించారు. గవర్నర్‌కు నోటీసులు జారీ చేసే ఆచారాన్ని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నిస్తూ.. ఈనెల 21వ తేదీ లోపు కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది న్యాయస్థానం.
9. దేశంలో ఆసుపత్రుల సామర్థ్యం మరింత పెరిగిందని ప్రధాని మోదీ అన్నారు. పీఎం కేర్స్ నిధి క్రింద కొత్తగా 4,000 ఆక్సిజన్ ప్లాంట్లను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. దేశంలోని అన్ని జిల్లాల్లోనూ పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటవుతాయని ప్రకటించారు.
10. తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ధ్వజారోహణంతో వైభవంగా ఆరంభమయ్యాయి. ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటం ఎగరవేశారు. రాత్రికి పెద్దశేష వాహన సేవ జరగనుంది. ఈ నెల 15 వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.