దళిత బంధు.. దగా బంధు అవుతుందా? యూటర్న్ సీఎం కేసీఆర్..
posted on Oct 7, 2021 @ 7:07PM
సూది కోసమని సోదికెళితే.. పాత రంకులు బయట పడ్డాయని సామెత. అలాగే, తీగలాగితే డొంకంతా కదిలిందని మరో సామెత. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట మార్చడంలో, తిమ్మిని బమ్మిని చేయడంలో మహా దిట్ట. కానీ, అదేమిటో ఆయన అసెంబ్లీ సాక్షిగా, దళితులకు మూడెకరాల భూమి విషయంలో ఒక్కసారిగా పిల్లి మొగ్గ వేశారు. ప్రభుత్వం సగర్వంగా ప్రకటించి, కొద్దోగొప్పో అమలు చేసిన పథకం విషయంలోనే ముఖ్యమంత్రి అసలు అలాంటి వాగ్దానమే చేయలేదని పిల్లి మొగ్గ వేయడం విపక్షాల నుంచే కాదు, స్వపక్షం నుంచి కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతే కాదు, ఇద్దామన్నా రాష్ట్రంలో ఇవ్వటానికి భూములెక్కడున్నయ్’ అంటూ ముఖ్యమంత్రి ముక్తాయింపు ఇవ్వడమూ విమర్శలకు అవకాశం కలిపిస్తోంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ ఏడేళ్ళలో చేసిన వాగ్దానాలు, వాగ్దాన భంగాలు, ముఖ్యంగా దళితులకు ప్రత్యేకించి చేసిన వాగ్దానాలు, వాగ్దాన భంగాలు ఒకటొకటిగా బయటకు వస్తున్నాయి. దళిత ముఖ్యమంత్రి మొదలు ఏ ఒక్క వాగ్దానం సక్రమంగా అమలు కాని విషయాన్ని ముఖ్యమంత్రి ప్రకటన మరో మారు గుర్తుకు తెచ్చింది. కొద్దిరోజుల క్రితం మంత్రి కేటీఆర్ ప్రభుత్వ ఉద్యోగాలకు పంగనామాలు పెట్టారు. ఉద్యమ సమయంలో ఊదర కొట్టిన, ఎన్నికల సమయంలో వాగ్దానం చేసిన ఇంటికో ఉద్యోగం హామీని, కేటీఆర్ అటక ఎక్కించారు. అది అయ్యేది కాదు, పొయ్యేది కాదని లెక్కలు చెప్పారు. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి మూడు ఎకరాలకు మంగళం పాడేశారు. ఇలా ఒక్కొక్క వాగ్దానం వదిలించుకుంటూ పోవడంతో, ప్రభుత్వం విశ్వసనీయత ప్రశ్నార్ధకంగా మారుతోందని అంటున్నారు.
ఈ నేపధ్యంలో, దళిత బంధు గతేంటని చర్చ జరుగుతోంది. నిజానికి, దళిత బంధు విషయంలో ప్రభుత్వం ఇప్పటికే అనేక పిల్లి మొగ్గలు వేసింది. ఇక్కడని అక్కడ, అక్కడని ఇక్కడ ప్రారంభోత్సవాలతో మొదలైన కంఫూజన్, గందరగోళం, ఎంపిక ప్రక్రియ, విధి విధానాలు, ఖాతాల్లో సోమ్ములేసి, ఎద్దు మూతికి చిక్కం కట్టినట్లు, అకౌంట్స్ ఫీజ్’ చేయడం వరకు అనేక అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి. చివరకు, లబ్దిదారులు కూడా ‘నిజంగా వస్తదంటవా’ అన్న సందేహాలను వ్యక్త పరుస్తున్నారు. మరోవంక, హుజూరాబాద్‌కేనా, రాష్ట్రం మొత్తంలో అమలవుతుందా? అనే అనుమానాలు ఉన్నాయి.
నిజానికి, ముఖ్యమంత్రి కేసీఆర్, అసెంబ్లీలో ఆడిన అసత్యంతో.. తెరాస ఎమ్మెల్యేలు, నాయకులలో కూడా దళిత బంధు దగా బంధు అవుతుందా అన్న చర్చ మొదలైంది. నిజానికి, అన్ని వర్గాల, అన్ని కులాల నుంచి, కుల బంధు కోసం వస్తున్న డిమాండ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి మూడెకరాల విషయంలో యూ టర్న్ తీసుకోవడంతో మరింతగా ఉలిక్కి పడుతున్నారు. మరోవంక రాష్ట్రమంతా దళిత వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా తెరాస ప్రభుత్వ పాలనలో దళితులకు జరుగతున్నఅన్యాయాలపై దళితసంఘాలు, దళిత నాయకులు అధికార పార్టీ నాయకులను నిలదీస్తున్నారు. కేబినెట్ లో దళిత మంత్రులకు సముచిత స్థానం కల్పించకుండా మోసం చేస్తున్నారని మండిపడుతున్నాయి. సీఎం ఆఫీస్ లో దళిత అధికారులకు సముచిత స్థానం కల్పించకుండా ఇన్నాళ్లు దూరం పెట్టిన విషయాన్ని కూడా గుర్తు చేస్తున్నాయి. అంతేకాదు కేసీఆర్ ప్రభుత్వంలో దళిత అధికారులు ఎదుర్కొంటున్న ఘోర అవమానాలను గుర్తు చేసుకుంటున్నాయి.
125 అడుగుల అంబేద్కర్ విగ్రహం కడతామని చెప్పి ఎన్నేళ్లవుతుంది? పంజాగుట్ట అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ పెట్టారు? నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరు? ఎందుకు స్పందించరు? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో ఎంతమంది దళితులకు ఉద్యోగాలు ఇచ్చారు? ఇలా అనేక ప్రశ్నలను లేవనెత్తుతూ కేసీఆర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నాయి దళిత సంఘాలు. దళిత బంధు సంగతి కూడా ఇంతేనా? అని అనుమానిస్తున్నాయి. అసెంబ్లీలో మూడెకరాలపై సీఎం స్పీచ్ చూసిన దగ్గర నుంచి దళితుల్లో భయం మరింత ఎక్కువైందని చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో అనవసరపు విషయాలను ప్రస్తావించి ఉన్న సమస్యలు చాలవన్నట్లు కొత్త సమస్యలను తలకు చుట్టుకుంటున్నారని అంటున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలపై ఈ ప్రభావం తప్పకుండా ఉంటుందని అంటున్నారు.