పోలవరంపై కేంద్రం పితలాటకం.. జగన్ సర్కారు చేతగానితనం!
posted on Oct 7, 2021 @ 4:14PM
ఓ శాఖ నిధులు ఇవ్వమంటోంది. మరో శాఖ పైసా విదిల్చేది లేదు పొమ్మంటోంది. రెండూ కేంద్ర ప్రభుత్వ శాఖలే. ఒకరు కనికరించమంటే, మరొకరు కనికరం లేకుండా ముఖం మీదే చెప్పేస్తున్నారు. పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం డబుల్ గేమ్ ఆడుతోంది. విషయం తెలిసి మన ఆర్థిక మంత్రి బుగ్గన.. ఢిల్లీ వెళ్లి నిర్మలమ్మను బతిమిలాడుకున్నా ప్రయోజనం లేకపోయింది. ఆయనేమైనా చంద్రబాబా.. పోలవరంకు నిధుల వరద పారించడానికి? సొమ్ములు తెచ్చుకునే సామర్థ్యం లేక.. జగన్ సర్కారు చేతగానితనంతో.. ఏపీ జీవనాడైన పోలవరం ప్రాణం తీసేస్తున్నారు నేటి పాలకులు.
పోలవరం ప్రాజెక్టు నిధులపై కేంద్రం తేల్చేసింది. దేశంలోని మిగతా ప్రాజెక్టులకు మాదిరిగా పోలవరం ప్రాజెక్టుకు కూడా అదనంగా నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల శక్తి శాఖ కోరింది. మరో రూ. 4వేల కోట్లను అదనంగా మంజూరు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖకు, కేంద్ర జలశక్తి శాఖ లేఖ రాసింది. ఆ లేఖను పరిశీలించి నిధులు ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ మొండికేసింది. 2017లో కేంద్ర క్యాబినెట్ తీర్మానం మేరకు రూ. 20 వేల కోట్లకు మించి ఒక్క రూపాయి కూడా అదనంగా ఇచ్చేది లేదని ఆర్థిక శాఖ స్పష్టం చేస్తూ.. ఆ మేరకు జలశక్తి శాఖకు లేక రాసింది.
విషయం తెలిసి.. ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ని.. ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కలిశారు. పోలవరం నిధులకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ లేఖపై మంతనాలు జరిపారు. అయితే, కేబినెట్ తీర్మానానికి కట్టుబడి ఉంటామని.. అదనంగా నిధులిచ్చేది లేదని.. నిర్మల.. బుగ్గన ముఖం మీదే చెప్పేశారు. పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చారు కదా అని బుగ్గన చెబితే.. జాతీయ హోదా ఇచ్చిన మాట గుర్తుందని, ఇతర రాష్ట్రాల్లోనూ జాతీయ హోదా కలిగిన ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని మించిన ప్రాధాన్యం పోలవరానికి ఇవ్వలేమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల అన్నారని తెలుస్తోంది. కనీసం సవరించిన అంచనాలనైనా ఆమోదించండి అని ప్రాధాయపడినా.. పోలవరం ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్లకు మించి.. నయా పైసా కూడా ఇచ్చేది లేదని నిర్మలా సీతారామన్ బుగ్గనకు ఒకింత గట్టిగానే చెప్పారని అంటున్నారు. దీంతో.. జగమొండి కేంద్ర ప్రభుత్వాన్ని ఏమీ చేయలేక.. ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఏమి సేతురా లింగా.. అంటూ అయోమయంలో పడింది.
పోలవరం విషయంలో కేంద్రం మొదటి నుంచీ డబుల్ గేమ్ ఆడుతోంది. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమయ్యే నిధులన్నీ తామే ఇస్తామని వాగ్దానం చేసిన కేంద్రం ఆ తర్వాత మాట మార్చేసింది. ప్రాజెక్టు తొలి నాళ్ల అంచనాల మేరకే నిధులు విడుదల చేస్తామని, సవరించిన అంచనాల మేరకు రూ.56 వేల కోట్ల మేర నిధులను విడుదల చేసే ప్రసక్తే లేదని కూడా తేల్చేసింది. అప్పట్లో ఆ నిధుల కోసం చంద్రబాబు గట్టిగా పోరాడారు. జగన్ వచ్చాక ఆ పోరాటమే లేకుండాపోయింది. అందుకే, పోలవరం ప్రాణం పోతోంది.