దాడులకు భయపడేది లేదు.. పట్టాభి ఆన్ ఫైర్..
posted on Nov 8, 2021 @ 11:16AM
ఇంటిపై దాడులు చేశారు. ఆయనపై కేసులు పెట్టారు. అరెస్ట్ చేసి జైలుకు కూడా తరలించారు. అయితేనేం.. ఆయన నిఖార్సైన పసుపు సైనికుడు. అందుకే, అలాంటి అదిరింపులకు, బెదిరింపులకు భయపడలేదు. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మరోసారి మీడియా సమావేశంలో ప్రభుత్వంపై చెలరేగిపోయారు. చిన్న గ్యాప్ తర్వాత.. కాస్త రీచార్జ్ అయ్యాక.. ప్రెస్‌మీట్ పెట్టి మరోసారి తఢాఖా చూపించారు పట్టాభి.
వైసీపీ ప్రభుత్వం బెదిరింపులకు, దాడులకు భయపడేది లేదని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ మరోసారి స్పష్టం చేశారు. నిజాలు మాట్లాడుతున్నందుకు వైసీపీ శ్రేణులు తనపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికి మూడు సార్లు తనపై దాడులు చేశారన్నారు. ఏ నాయకుడు అవినీతికి పాల్పడినా ఎండగడుతామని తేల్చి చెప్పారు. నిజాయతీ గల నాయకుడు చంద్రబాబు సారథ్యంలో నడుస్తున్నామని, పసుపు సైనికులు వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పట్టాభిరామ్ స్పష్టం చేశారు.
వైసీపీకి రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి ఇప్పుడు గుర్తొచ్చిందా? అంటూ పట్టాభి నిలదీశారు. ఆధారాలతోనే అధికార పార్టీని ప్రశ్నిస్తున్నామన్నారు. ప్రభుత్వం పన్నుల రూపంలో ప్రజలపై అనేక రకాల భారాలు మోపుతోందని మండిపడ్డారు. ఏడాది కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు విపరీతంగా పెంచారని పట్టాభి ఆరోపించారు.