రాజకీయపార్టీల్ని టిజెఎసి శాసించగలదా?
posted on Sep 27, 2012 @ 10:57AM
హైదరాబాద్ అట్టుడుకుతోంది ... జనంలో ఏదో తెలియని భయం ... తెలంగాణా మార్చ్ ఎలాంటి పరిణామాలకు దారితీస్తోందోనని అనుమానాలు ... "సాగారహారం'' హింసాహారంగా మారితే ఏమైనా జరగచ్చు. తెలంగాణాపేరుతొ ఉద్యమం పేరుతొ, కడుపుమంట పేరుతొ, ఆస్తులను ధ్వంసం చేయడం, విగ్రహాలను పగులగోట్టడం, బస్సులు తగలబెట్టడం లాంటి చర్యలు నిత్యకృత్యాలైపోవడంతో చాలామంది ఇప్పటికే విసిగిపోయి ఉన్నారు. మీ స్వేచ్చకోసం మా స్వేచ్చను మా శాంతిని హరిస్తారా అంటూ చాలామంది మండిపడుతున్నారు. అందుకే పోలీసులు సైతం తెలంగాణా మార్చ్ కి అనుమతి ఇవ్వలేదు. ఇచ్చేది లేదని తేల్చి చెప్పేసారు. పర్మిషన్ ఉన్నా లేకున్నా పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణా మార్చ్ ని జరిపి సత్తాను చాటుతామని టిజెఎసి అధ్యక్షుడు కోదండరామ్ అంటున్నారు. 'సాగరహారం' కార్యక్రమానికి అనుమతి ఇస్తే వచ్చే ఇబ్బంది ఏంటి? వినాయక నిమజ్జనం, జీవవైవిధ్య సదస్సులకు మధ్య రోజు జరుగుతున్న సాగర హారం నిరసన కార్యక్రమం వల్ల ఇబ్బందులు వస్తాయని ప్రభుత్వం, పోలీసుల భావన. ఇంతవరకు అయితే పెద్ద నష్టం ఉండదు. కాని ఒకసారి అనుమతి ఇస్తే, ఆందోళనకారులు హుస్సేన్ సాగర్ చుట్టూరా ఉండి రెండు రోజులపాటు కదలకపోతే వచ్చే పరిస్థితిని ఎదుర్కోవడం పోలీసులకు కష్టం అవుతుంది. సదస్సు జరిగే రోజు కూడా వీరి నిరసన కొనసాగితే హైదరాబాద్ ప్రతిష్ట మంట కలుస్తుంది. గతేడాది జెఎసి నిర్వహించిన మిలియన్ మార్చ్ కూడా అవాంఛనీయ ఘటనలతోనే ముగిసింది. టాంక్ బండ్ పై విగ్రహాలను కూల్చివేసి కలకలం సృష్టించారు. తెలంగాణవాదులుగా పేరొందిన నేతలు మధుయాష్కి, కె.కేశవరావులపైనే నిరసనకారులు దాడి చేశారు. ఒకసారి అది చేయి దాటిపోతే ఏ మలుపు అయినా తిరగవచ్చనడానికి ఇదే ఉదాహరణ. అంతేకాక భావోద్రేకాలు పెచ్చుమీరిన సమయంలో టాంక్ బండ్, హుస్సేన్ సాగర్ వంటి ప్రదేశాలు ఎంతవరకు నిరసనలకు అనువైనవి అన్న చర్చ కూడా వస్తుంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమతి ఇవ్వలేదు. తెలంగాణాపై ఒక ప్రకటన చేయమని టిజెఎసి పట్టుబడుతోంది. అవన్నీ తరువాత మాట్లాడుకుందాం ముందు మార్చ్ ను వాయిదా వేయమని ప్రభుత్వం అంటోంది. చివరికి ఎం జరుగుతుందో వేచి చూద్దాం.