టిటిడి కార్మికుల్లో ఆనందాలు నింపిన సిఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి...
posted on Oct 29, 2019 @ 4:34PM
చాలా మంది కార్మికులు శ్రీ వారి సేవలోనే ఉన్నారు, తిరుమల కొండల్లో పచ్చదనం పెంపొందించడంతో పాటు అటవీ సంరక్షణకు ఏళ్లుగా పాటు పడుతున్నారు. చాలీ చాలని వేతనంతో ఇబ్బంది పడుతున్న తమను ఆదుకోవాలంటూ గత ప్రభుత్వాలకు వారు ఎన్నో విజ్ఞప్తులు చేశారు కానీ, ఆ ప్రభుత్వాలు వారిని పట్టించుకున్న పాపాన పోలేదు. అయితే సీఎం వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాలుగు నెలల్లోనే ఆ కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపాయి. దశాబ్దాల వారి కలలను సాకారం చేశారు దీంతో, వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాసుడు వెలసిన దివ్య క్షేత్రం తిరుమల, ఆ ఆపదమొక్కుల వాడిని దర్శించుకునేందుకు నిత్యం వేల మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.
దేశం లోని వివిధ ప్రాంతాల నుండి కొండపైకి వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బంది పడకుండా వారికి వివిధ సేవలను అందించేందుకు టీటీడీలో అనేక విభాగాలున్నాయి. టీటీడీకి చెందిన వివిధ శాఖల్లో శాశ్వత ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు అనేక మంది ఉన్నారు. టీటీడీలో అలాంటి కార్మికులు పది వేలకు పైగా ఉన్నారు, వారిలో అనేక మంది పదిహేను నుండి ఇరవై ఏళ్లుగా టిటిడిలో విధులను నిర్వహిస్తున్నారు. టీటీడీకి చెందిన అటవీ శాఖలో దాదాపు 250 మంది కార్మికులు కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్నారు. తిరుమలకు వచ్చే భక్తులను క్రూరమృగాల బారి నుండి కాపాడటంతో పాటు అడవిలో కార్చిచ్చు ఏర్పడిన సందర్భాల్లో వీరే ఆ మంటలను అదుపు చేస్తుంటారు. దశాబ్ధాలుగా టీటీడీకి సేవలందిస్తున్న ఈ కార్మికులను శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలని అటవీ శాఖ గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విజ్ఞప్తి చేసింది కానీ, ఫలితం లేకపోయింది.
దీంతో గత ఎన్నికల ముందు వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో టిటిడి అటవీ శాఖ కార్మికులు తమ సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వారందరికీ న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు వైయస్ జగన్ మోహన్ రెడ్డి. అందులో భాగంగా కల్యాణ కట్టలో పని చేసే కార్మికులతో పాటు అటవీ శాఖలో పని చేస్తున్న 164 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించటానికి టిటిడి పాలక మండలి ఆమోదం తెలిపింది. తమకు న్యాయం చేయాలని ఎన్ని విజ్ఞప్తులు చేసినా గత పాలకులు పట్టించుకోలేదని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్య మంత్రి అయిన నాలుగు నెలల్లోనే తమకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవటం సంతోషంగా వుందని చెబుతున్నారు పలువురు కార్మికులు. అలాగే టీటీడీ లో ఖాళీగా ఉన్న పోస్టులను కూడా భర్తీ చేయాలని వారు కోరుతున్నారు.