గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వ్యాఖ్యలతో విస్మయానికి గురయైన టీడీపీ నేతలు.....
posted on Oct 29, 2019 @ 3:03PM
అడుగు పెట్టగానే పిడుగుపడ్డట్లు అంటారే అలాగే ఉందట ఏపిలో వైఎస్ జగన్ పరిపాలన. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ప్రత్యర్థులపై కక్ష సాధింపులు శృతి మించాయని మాట గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో నెలకొన్న వివిధ సమస్యల పై తెలుగుదేశం పార్టీకి చెందిన అనేక మంది నేతలు ఇటీవల రాజ్ భవన్ గడప తొక్కుతున్నారు. ప్రజలెదుర్కొంటున్న సమస్యలు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్ల తమపై పెడుతున్న అక్రమ కేసుల గురించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ను కలిసి ఫిర్యాదు చేస్తున్నారు.
ఇందులో భాగంగానే ఇటీవల విజయవాడ టిడిపి ఎంపి కేశినేని నాని సారధ్యంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గవర్నర్ ను కలిశారు. రాష్ట్రంలో తెలుగుదేశం నేతల పైనా చివరకు వైస్ ఛాన్సలర్ పై కూడా అక్రమ కేసులు మోపుతున్నారంటూ ఓ వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ దామోదర్ నాయుడు పై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసి అరెస్టు చేశారని గవర్నర్ వద్ద వారు ప్రస్తావించారు. రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్ గా ఉండే మీకు తెలియకుండా ఆయనపై కేసు ఎలా నమోదు చేస్తారని గవర్నర్ ను అడిగారు. ఈ పరిణామాలపై తక్షణం చర్యలు తీసుకోవాలంటూ ఆయనను అభ్యర్థించారు. ఈ సమయంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఓ ఆసక్తికర వ్యాఖ్య చేశారు. వైస్ ఛాన్సెలర్ అరెస్ట్ వార్తను తాను పత్రికల్లో చూశానని చెప్పడంతో తెలుగుదేశం నేతలు ఆశ్చర్యపోయారు.
వైస్ ఛాన్సలర్ పై కేసు, ఆయన అరెస్ట్ విషయాన్ని తమ దృష్టికి తెచ్చి ముందస్తు అనుమతి తీసుకోవాలి గవర్నర్ వద్ద తెలుగుదేశం నేతలు తమ మనసులో ఉన్న మాటను అడిగారు. తెలుగుదేశం నేతలు ఇచ్చిన వినతి పత్రాన్ని గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఆసాంతం పరిశీలించారు.ఆయా ఘటనలపై తగిన చర్యలు తీసుకుంటామని వారికి హామీ ఇచ్చారు. అంతేకాదు కేశినేని నాని బృందం తనను కలిసిన సంగతిని అదే రోజు సాయంత్రం గవర్నర్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పేర్కొన్నారు.
టిడిపి నేతలు సమర్పించిన వినతి పత్రంలోని అంశాల పై రాజ్ భవన్ తగిన సమాచారాన్ని రప్పించుకోవడం ఈ వ్యవహారంలో కొసమెరుపు. రాజ్ భవన్ నుంచి బయటకొచ్చిన తర్వాత తెలుగుదేశం నేతలు మీడియాతో మాట్లాడారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అందరిపై అక్రమ కేసులు బనాయిస్తూ ఉందంటూ ఆరోపణలు గుప్పించారు. గవర్నర్ ని కలిసి వినతి పత్రం సమర్పించిన విషయాన్ని చెప్పారు. వైస్ ఛాన్సలర్ పై కేసు నమోదైన విషయాన్ని గవర్నర్ దృష్టికి తెచ్చినప్పుడు ఆయన ఇలా స్పందించారు కూడా టిడిపి నేతలు వివరించారు. ఇదే సమయంలో గవర్నర్ చీఫ్ సెక్రటరీల ప్రమేయం లేకుండా సచివాలయంలో బిజినెస్ రూల్స్ మార్చారంటూ పత్రికల్లో వార్తలు వెలువడ్డాయి. ఈ అంశం కూడా తీవ్ర చర్చోపచర్చలకు దారి తీసింది.
బిజినెస్ రూల్స్ కు మార్పులు చేర్పులు చేస్తున్నట్లుగా సీఎం కార్యాలయం నుంచి జీవో రావడం చూసి సచివాలయంలోని సీనియర్ ఐఏఎస్ లు సైతం ఆశ్చర్యపోయారు. ఈ వ్యవహారం కూడా చివరికి రాజ్ భవన్ కే చేరింది. ఈ రెండు అంశాల పై టిడిపి నేతలు మీడియా వద్ద మాట్లాడుతూ జగన్ సర్కారు ఏక పక్షంగా వ్యవహరిస్తోందని వెల్లడించారు . ఈ అంశాల పై ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.