తిరుపతి ఉపఎన్నికల కౌటింగ్ లో తెదేపా ఆధిక్యత
posted on Feb 16, 2015 8:56AM
తిరుపతి శాసనసభ నియోజక వర్గానికి జరిగిన ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ రోజు ఉదయం స్థానిక ఎస్‌వీ ఆర్ట్స్ కళాశాలలో ప్రారంభమైంది. ఇంతవరకు రెండు రౌండ్లు కౌటింగ్ పూర్తవగా వాటిలో తెదేపా అభ్యర్ధి సుగుణమ్మ 13,256 ఓట్ల ఆధిక్యత సంపాదించారు. ఇంకా మరో 17 రౌండ్ల లెక్కింపు జరుగవలసి ఉంది. ఈ ఉపఎన్నికలలో తెదేపా, కాంగ్రెస్, లోక్ సత్తా పార్టీ అభ్యర్ధులతో సహా మొత్తం 13 మంది పోటీలో ఉన్నారు. కానీ పోటీ ప్రధానంగా తెదేపా-కాంగ్రెస్ పార్టీల మధ్యనే సాగింది. కాంగ్రెస్ తరపున జిల్లాలో డ్వాక్రా సంఘాల అధ్యక్షురాలు రుద్రరాజు శ్రీదేవి పోటీచేశారు. ఈ ఎన్నికలలో కనీసం లక్ష ఓట్ల మెజార్టీతో తమ పార్టీ గెలుస్తుందని తెదేపా ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీదేవి కూడా అంత భారీ మెజార్టీ రాకపోయినా తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరొక గంటలోగానే తుది ఫలితాలు వెలువడవచ్చును.