తుళ్ళూరు రైతులు ఎవరిని విశ్వసించాలి?
posted on Jan 2, 2015 @ 10:10AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న నూతన సంవత్సర వేడుకలని రాజధాని నిర్మించబోయే తుళ్ళూరులోనే జరుపుకోవడం చాలా తెలివయిన నిర్ణయమనే చెప్పాలి. ఆయన స్వయంగా అక్కడికి వచ్చి నేరుగా రైతులతోనే మాట్లాడటం వలన వారిలో నెలకొన్న అనుమానాలు, అపోహలు తొలగి ప్రభుత్వం పట్ల నమ్మకం ఏర్పడేందుకు దోహదపడింది. నిన్న జరిగిన సభలో ఐదుగురు రైతులు తమ 161 ఎకరాల పొలాల తాలూకు పాసు పుస్తకాలను ముఖ్యమంత్రి అందజేశారు. అంతే కాకుండా స్థానిక రైతులు ఆయనకి వెండి కిరీటం బహూకరించడం విశేషం.
మొదటి నుండి కూడా రాజధాని భూసేకరణకు అడ్డుపడుతున్న వైకాపా ఉద్దేశ్యాలను ఈ సందర్భంగా చంద్రబాబు ప్రజలకు వివరించడం ద్వారా ఆ పార్టీ నేతలు ప్రజలలో రేకెత్తించిన అనుమానాలు, భయాలను దూరం చేసే ప్రయత్నం చేసారు.
చిత్తూరు జిల్లాకు చెందిన చంద్రబాబు నాయుడు రాజధానిని తన ప్రాంతంలోనే ఏర్పాటు చేసుకొనే అవకాశం ఉంది. అక్కడ ప్రభుత్వ భూముల లభ్యత కూడా ఉంది గనుక ఆయనను ఎవరూ తప్పు పట్టడానికి కూడా అవకాశం ఉండేది కాదు. పైగా రాయలసీమ ప్రజలు కూడా ఆయనకు మద్దతు పలికేవారు. కానీ రాజధాని నగరం రాష్ట్రానికి మధ్యలో అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతోనే ఆయన తుళ్ళూరును ఎంచుకొన్నారు.
ఒకవేళ తెదేపా అధికారంలోకి రాకపోయుంటే వైకాపా రాజధాని నగరాన్నితనకు బాగా పట్టున్న ఇడుపులపాయలో ఏర్పాటు చేసి ఉండేదని, కానీ అలా జరగకపోవడంతో అసూయతో ప్రజలను భయబ్రాంతులను చేసి రాజధాని భూసేకరణకు అడ్డంకులు సృష్టించేందుకే పచ్చటి పంట పోలాలకు నిప్పు పెట్టిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. రాయలసీమలో రాజకీయ కక్షలు పెంచుకొన్నవారు చెరుకు తోటలకు నిప్పుపెడుతుంటారని, జగన్మోహన్ రెడ్డి అదే విష సంస్కృతిని తుళ్ళూరులో కూడా అమలుచేసారని చంద్రబాబు ఆరోపించారు. అటువంటి ప్రయత్నాలు చేసేవారిని సహించబోనని తీవ్రంగా హెచ్చరించారు.
ఇంతవరకు అనేకమంది మంత్రులు ఈ అంశంపై వైకాపాను, జగన్మోహన్ రెడ్డిని విమర్శించినప్పటికీ దానిని ఎవరూ అంత సీరియస్ గా తీసుకోలేదు. కానీ ఇప్పుడు స్వయంగా ముఖ్యమంత్రే జగన్ పై తీవ్ర ఆరోపణలు చేయడంతో ప్రజలను కూడా ఆలోచింపజేస్తోంది. ఎందువలన అంటే ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి నిరాధారమయిన ఆరోపణలు చేస్తే దాని పర్యవసనాలు చాలా తీవ్రంగా ఉంటాయి.
చట్టబద్దంగా భూసేకరణ చేసేందుకు ప్రభుత్వానికి అధికారాలున్నప్పటికీ, రైతులకు గరిష్టంగా ప్రయోజనం కలగాలనే ఉద్దేశ్యంతోనే చాలా లోతుగా అధ్యయనం చేసిన తరువాత ఈ ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలుచేస్తున్నామని ఆయన రైతులకు తెలిపారు. ఇంతవరకు మీడియాలో వస్తున్న వార్తలు, వివరాల ద్వారానే ల్యాండ్ పూలింగ్ విధివిధానాల గురించి, ప్రభుత్వం ఇవ్వబోయే పరిహారం గురించి తెలుసుకొంటున్న రైతులకు, ముఖ్యమంత్రి స్వయంగా వారికి నిన్న అన్నీ వివరించి వారికి తన ప్రభుత్వం పట్ల నమ్మకం కల్పించేందుకు ప్రయత్నించారు. రైతులు అందరూ ప్రభుత్వానికి సహకరించి తమ భూములు అప్పగించినట్లయితే, వీలయినంత తొందరగా రాజధాని నిర్మాణం చేసి వారికి గరిష్టంగా ప్రయోజనం కలిగేలా చేస్తానని తెలిపారు.
వచ్చే ఎన్నికల నాటికి రాష్ట్రంలో ఎటువంటి రాజకీయపరిణామాలు చోటు చేసుకొంటాయో ఎవరికీ తెలియదు. కనుక రాజధాని కోసం భూములు ఇస్తున్న రైతులు అందరూ కూడా ఈ ఐదేళ్ళలోనే పూర్తి ప్రయోజనం పొందడం చాలా అవసరం. వచ్చే ఎన్నికల నాటికి కనీసం రాజధాని నగర పరిధిలో నిర్మాణాలు పూర్తయితేనే అక్కడ భూములు ఇచ్చినవారికి పూర్తి ప్రయోజనం చేకూరుతుంది. అప్పుడే మిగిలిన ప్రాంతాలలో భూములు ఇచ్చిన వారికి కూడా ఎటువంటి ప్రయోజనం పొందబోతున్నారనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది. కనుక రైతులు కూడా వాస్తవిక దృక్పధంతో ఆలోచించి సరయిన నిర్ణయం తీసుకోవాలి.
ఎన్నికలలో గెలిచేందుకే ఓదార్పు యాత్రలు, సమైక్యాంధ్ర ఉద్యమాలు చేసిన వైకాపాను నమ్మడమా లేక రాజధాని నిర్మించి తమ భూముల విలువలను పదిరెట్లు పెంచి ఇస్తామని చట్టబద్దంగా హామీ ఇస్తున్న ప్రభుత్వాన్ని నమ్మడమా? ఏది మంచిదో రైతులే ఆలోచించుకోవాలి.