అవును పాక్ ఎన్నటికీ మారదు
posted on Jan 3, 2015 8:18AM
మా ఇంట్లో జరిగితే పెళ్లి...మీ ఇంట్లో జరిగితే కంగాళీ...అన్నట్లుంది పాకిస్తాన్ తీరు. తన పిల్లలని తానే తినేసే పామువంటి తాలిబాన్ ఉగ్రవాదులను పెంచి పోషించినందుకు పాకిస్తాన్ భారీ మూల్యమే చెల్లించింది. తాలిబన్ విషసర్పాలు అన్నెంపున్నెం తెలియని అమాయకులయిన పాక్ పిల్లలను పొట్టన పెట్టుకొన్నప్పుడు కేవలం పాకిస్తాన్ మాత్రమే ఆక్రోశించలేదు. యావత్ ప్రపంచంలో మానవత్వం ఉన్న ప్రతీ మనిషి చలించిపోయాడు. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను ఏరి పారేస్తుంటే అందరూ మెచ్చుకొన్నారు.
‘ఉగ్రవాదులలో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అంటూ వేరే ఉండరని, ఉగ్రవాదులు ఎవరయినా నరహంతకులేనని’ తను అనుభవపూర్వకంగా కనుగొన్న గొప్ప సత్యాన్ని లోకానికి ప్రకటించిన పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, పాక్ ఉగ్రవాద కోర్టు ముంబై మారణఖాండకు కారకుడయిన లక్వీకి బెయిలు ఇచ్చినప్పుడు, భారత్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసిన తరువాత గానీ మళ్ళీ అతనిని అరెస్ట్ చేయాలనే ఆలోచన కలగలేదు. పాక్ పిల్లలను, పౌరులను పొట్టన పెట్టుకొంటున్న ఉగ్రవాదులను ఏరిపారేస్తూ, భారత్ లో పౌరులను పొట్టన పెట్టుకొనే ఉగ్రవాది లక్వీని కంటికి రెప్పలా కాపాడుకొంటూ రాచమర్యాదలు చేస్తున్నారు.
పాక్ ప్రభుత్వం ఉగ్రవాదుల పట్ల అవలంభిస్తున్న ఈ ద్వంద వైఖరి ఆదేశానికే కాదు, భారత్ కు కూడా ప్రాణ సంకటంగా మారింది. పాక్ వైఖరి చూస్తుంటే భారత్ ని లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాదులు, పాక్ ని లక్ష్యంగా చేసుకొన్న ఉగ్రవాదులని రెండుగా విభజించినట్లుంది. అందుకే ముంబై దాడుల తరహాలోనే మరో భారీ దాడికి ఉగ్రవాదులను పాక్ గడ్డపై నుండే రవాణా అవ్వగలిగారు. కానీ భారత నావికాదళాలు సకాలంలో అప్రమత్తమవడంతో అదృష్టవశాత్తు భారత్ ఆ ఉగ్రవాదుల దాడిని తప్పించుకోగలిగింది. ఈనెల 26న డిల్లీలో జరుగబోయే గణతంత్ర దినోత్సవ వేడుకలను భగ్నం చేసేందుకు కొంతమంది ఉగ్రవాదులు డిల్లీలో జొరబడ్డారనే వార్త చాలా కలవరం కలిగిస్తోంది.
మత ఛాందసవాదంతో కళ్ళు మూసుకుపోయున్న ఉగ్రవాదులు తమ స్వంత మతస్తులనే అందరినీ పొట్టన పెట్టుకొంటున్నారు. కానీ భాద్యత గల పాక్ ప్రభుత్వం కూడా అదే విధంగా వ్యవహరిస్తుండటం చాలా విస్మయం కలిగిస్తోంది. పాక్ ప్రభుత్వం ఉగ్రవాదులను నియంత్రించలేని పరిస్థితిలో ఉందని సర్ది చెప్పుకోవచ్చు, కానీ భారత్-పాక్ సరిహద్దులలో జరుగుతున్న కాల్పులను చూస్తుంటే పాక్ ప్రభుత్వం తన సైనిక దళాలను కూడా నియంత్రించలేని పరిస్థితిలో ఉందనుకోవాలా? లేక పాక్ ప్రభుత్వమే భారతదళాలపై కాల్పులు జరుపుతూ ఉగ్రవాదులను భారత్ లోకి ప్రవేశపెట్టేందుకు కృషి చేస్తోందనుకోవాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
తమది ఉగ్రవాద బాధిత దేశమని పదేపదే చెప్పుకొనే పాకిస్తాన్, వారిని అణచివేసేందుకు ఏటా విదేశాల నుండి లక్షల కోట్ల డాలర్లు కప్పం కట్టించుకొంటోంది. కానీ ఆ డబ్బుతోనే వారిని పెంచి పోషిస్తున్నట్లుంది. ఉగ్రవాదుల భారి నుండి తనను తాను కాపాడుకోలేని పాకిస్తాన్, వారిని ఇతర దేశాలకు కూడా రవాణా చేస్తోంది.
దాదాపు మూడు దశాబ్దాలుగా పాక్ చేస్తున్న ఈ ఆగడాలను భారత్ భరిస్తోనే ఉంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత తమ ప్రభుత్వం ఇకపై మెతక వైఖరి అవలంభించబోదని పాక్ ప్రభుత్వానికి, ఉగ్రమూకలకు చాలా స్పష్టంగానే చెప్పారు. అయినప్పటికీ పాక్ ప్రభుత్వం భారత్ తో ఇంకా చెలగాటం ఆడుతూనే ఉంది. పాక్ అస్తిరపడితే అది తనకు ఏ మాత్రం మంచిది కాదని భారతప్రభుత్వం భావిస్తుంటే, పాక్ ప్రభుత్వం మాత్రం భారత్ ను అస్థిరపరిచేందుకు ఎందుకు అంతగా తహతహలాడుతోందో మరి? పొరుగింటికి నిప్పు పెడితే అది తన ఇంటిని కూడా దహించి వేస్తుందనే సంగతి పాక్ అనుభవ పూర్వకంగా తెలుసుకొన్నప్పటికీ, తన బుద్ధి మార్చుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది.
భారత్ పట్ల పాక్ వైఖరి ఇక ఎన్నడూ మారబోదని స్పష్టమయింది కనుక, ఇక భారత్ కూడా పాక్ నుండి ఎదురయ్యే ఇటువంటి సవాళ్ళను ఎదుర్కొనేందుకు ప్రత్యేక వ్యవస్థలను శాశ్విత ప్రాతిపాదికన ఏర్పాటు చేసుకోక తప్పదు.