రాజకీయపార్టీల అదృష్టాలను తారుమారు చేసిన 2014
posted on Dec 31, 2014 @ 9:53AM
ఈ 2014సం.లో దేశ, రాష్ట్ర రాజకీయాలలో ఊహించని అనేక మార్పులు జరిగాయి. పదేళ్ళపాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ స్వయంకృతాపరాదం వల్లనే రెండు చోట్ల కూడా నామరూపాలు లేకుండా తుడిచిపెట్టుకుపోయింది. అయినా అది పశ్చాత్తాపపడలేదు. తప్పులను సరిదిద్దుకొనే ప్రయత్నమూ చేయలేదు. బహుశః అందువలననేమో ఈ ఆరు నెలలలో జరిగిన అన్ని ఎన్నికలలో ఘోరపరాజయాలు మూటగట్టుకట్టుకొంటూ క్రమంగా ఒక ప్రాంతీయ పార్టీ స్థాయికి దిగజారిపోయింది.
ఇక సాధారణ ఎన్నికలకు ముందు బీజేపీలో సీనియర్ నేతలయిన అద్వానీ, సుష్మాస్వరాజ్ వంటివారినందరినీ కాదని మోడీకి పార్టీ పగ్గాలు అప్పగించడం వలననే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రాగలిగింది. క్రమంగా దేశమంతా విస్తరిస్తోంది కూడా.
గత ఆరు దశాబ్దాలుగా సాగిన ఉద్యమాలన్నీ ఒక ఎత్తయితే, తెరాస అధ్యక్షుడు కేసీఆర్ నేతృత్వంలో గత పదేళ్ళుగా సాగిన ఉద్యమాలు మరొక ఎత్తని చెప్పవచ్చును. కాంగ్రెస్ పార్టీ తనే తెలంగాణా ఇచ్చిందని చెప్పుకొంటున్నప్పటికీ, కేసీఆర్ అనుసరించిన అనేక రకాల వ్యూహాల కారణంగానే తెలంగాణ ఇవ్వకతప్పని పరిస్థితి కల్పించారు. కనుక ఆ ఖ్యాతి ఆయనకు, ఆయన వెంట నిలిచి పోరాడిన కోట్లాది తెలంగాణా ప్రజలకు, రాష్ట్రం కోసం బలిదానాలు చేసుకొన్నా విద్యార్థులకే దక్కుతుంది. అందుకే ప్రజలు ఆయనకే పట్టం కట్టారు. ఆయన కూడా ప్రజలు తనపై పెట్టుకొన్న ఆశలు వమ్ముచేయకుండా ముందుకు సాగుతున్నట్లే ఉన్నారు. ఐదేళ్ళ తరువాత తెలంగాణాలో జరిగిన అభివృద్దే ఆయన పాలనకు గీటురాయిగా నిలుస్తుంది.
ఇక పదేళ్ళ పాటు ప్రతిపక్షంలో కూర్చొన్న తెదేపా అనేక ఆటుపోటులను ఎదుర్కొంది. అయినప్పటికీ ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు చాలా నిబ్బరంగా వ్యవహరిస్తూ ఒంటి చేత్తో తన పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకు రాగలిగారు. కానీ రాష్ట్ర విభజన తరువాత అనేక క్లిష్ట సమస్యలను ఎదుర్కోవలసి రావడం, వాటిని ఆయన అదే నిబ్బరంతో ఎదుర్కొంటూ, ఈ ఆరునెలల కాలంలోనే క్రమంగా రాష్ట్రాన్ని గాడిలో పెట్టడం చాలా అభినందనీయం. ఆయన రాష్ట్రం కోసం చాలా భారీ కలలే కంటున్నారు. వచ్చే ఎన్నికలలోగా వాటిని నెరవేర్చి చూపి, ప్రజలను మెప్పించి అధికారం నిలబెట్టుకోవాలని ఆయన ఆరాటపడుతున్నారు.
ఇక 2014 సం. వైకాపాకు తీవ్ర నిరాశనే మిగిల్చింది. సరిగ్గా ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి బెయిలు సంపాదించుకొని చంచల్ గూడా జైలు నుండి బయటపడగలిగినప్పటికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్నికలలో మాత్రం గెలువలేకపోయారు. ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని రాష్ట్రాన్ని పాలించాలని తపించిపోతున్న ఆయన తనకు బాగా పట్టు ఉన్న ఆంధ్రలో గెలిచేందుకు తెలంగాణా నుండి బయటపడి సమైక్యాంధ్ర శంఖారావం పూరించినప్పటికీ, ఆయన ఉద్దేశ్యం గ్రహించిన ప్రజలు ఎన్నికలలో వైకాపాను తిరస్కరించారు. ఇది ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బేనని చెప్పవచ్చును. కానీ 67 అసెంబ్లీ సీట్లు గెలుచుకొని బలమయిన ప్రతిపక్షంగా నిలబడగలిగారు. కానీ ఎన్నికల కోసం మరో నాలుగున్నరేళ్లు వేచి చూడక తప్పదు. అప్పటికి ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుందో ఎవరూ ఊహించలేరు.
ఇక కాంగ్రెస్ తన స్వార్ధ రాజకీయ ప్రయోజనాలను మాత్రమే దృష్టిలో ఉంచుకొని ఎన్నికల ముందు హడావుడిగా రాష్ట్ర విభజన చేసింది. అందుకు అది తగిన శిక్ష ఎలాగూ అనుభవించింది. కానీ అది చేసిన పొరపాటుకు, రెండు ప్రభుత్వాలు, ఇరు రాష్ట్ర ప్రజలు నేటికీ భారీ మూల్యం చెల్లిస్తున్నారు. రాష్ట్ర విభజన ఒకరికి మోధం మరొకరికి ఖేదం మిగిల్చింది. కాంగ్రెస్ అధిష్టానం ఏ ఉద్దేశ్యంతో రాష్ట్ర విభజన చేసినప్పటికీ, తెలంగాణా రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరింది కనుక వారు చాలా ఆనందించారు. కానీ కనీసం రాజధాని కూడా లేని రాష్ట్రంగా అవతరించిన ఆంద్రప్రదేశ్ పరిస్థితి చూసి ఆ రాష్ట్ర ప్రజలు చాలా బాధపడ్డారు. అసలు ఈ దుస్థితి నుండి ఎప్పటికయినా బయటపడగలమా? అని బెంగపెట్టుకొన్నారు కూడా.
రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నేటికీ గొడవలు కొనసాగుతున్నప్పటికీ, ప్రజలు మాత్రం చాలా త్వరగానే ఆ విభజన ప్రభావం నుండి బయటపడటం విశేషం. అందుకు కారణం వారికి నచ్చినట్లుగా సుస్థిరమయిన ప్రభుత్వాలు వారు ఏర్పాటుచేసుకోవడమేనని చెప్పవచ్చును. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, ఇప్పుడు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అభివృద్ధి మంత్రం జపిస్తున్నాయి. రెండు రాష్ట్రాలు అభివృద్ధిలో పోటీలు పడుతున్నాయి. ఇంతవరకు దేశంలో అతిపెద్ద బలమయిన రాష్ట్రంగా ఉంటూ వచ్చిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంరెండు ముక్కలయినందుకు బాధపడాలో లేకపోతే విడిపోయిన తరువాత వేగంగా అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషించాలో తెలియని పరిస్థితి. కానీ అంతా మన మంచికేనని సరిపెట్టుకొని ముందుకు సాగడమే మేలు.