జ్వరం, గొంతు నొప్పి మందులను ఏమైనా కొన్నారా?
posted on Apr 18, 2020 @ 10:33AM
ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారి వివరాలను తెలుసుకోవాడానికి డ్రగ్ ఇన్ స్పెక్టర్ల సహకారంతో ఆయా మున్సిపాలిటీలలోని ఫార్మసి అసోసియేషన్ సభ్యులతో ప్రత్యేకంగా సమీక్షించాలని తెలంగాణా ప్రభుత్వం నిర్ణయించింది. జ్వరం, గొంతు నొప్పి మందులను కొనుగోలు చేసిన వారి వివరాలను తప్పనిసరిగా అందజేయాలని ఆదేశిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
సొంత వైద్యం మరింత ప్రమాదకరమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇటీవల జ్వరం, గొంతు నొప్పి నివారణకు మెడికల్ షాపుల నుండి మందులు కొనుగోలు చేసిన వారు వెంటనే స్వచ్ఛందంగా ముందుకు రావాలని, అలా చేస్తే పెద్ద ప్రమాదాన్ని నివారించడానికి వీలౌతుందని మంత్రి తెలిపారు. పారాసిటమాల్‌తో జ్వరం తగ్గినట్లు కనిపించినప్పట్టికీ ఒక వేళ కరోనా వైరస్ అలాంటి వారికి ఉన్నట్లైతే వారితో ద్వారా జబ్బు చాలా మందికి విస్తరిస్తోంది కనుక వెంటనే మెడికల్ షాపుల ద్వారా మందులు కొన్నవారు స్థానిక ప్రభుత్వ మెడికల్ అధికారులకు, లేదా ఆరోగ్య కార్యకర్తలను సంప్రదించాలి.
రోజు రోజుకీ తెలంగాణాలో హైదరాబాద్‌తో సహా జిల్లాల్లో పాజిటివ్ సంఖ్య పెరుగుతన్న నేపథ్యంలో ప్రజలు సహకరించి కరోనా ప్రమాదాన్ని నియంత్రించడానికి ప్రభుత్వంతో కలిసిరావాలని కేటిఆర్ పిలుపునిచ్చారు.
లాక్ డౌన్ నిబంధనలు అమలులో ఉన్నందున ఎక్కడ ఉన్న ప్రజలు అక్కడే ఉండాలని, ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు అనుమతిలేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు మరో సారి తెలిపారు. మార్చి నుండి లాక్ డౌన్ విధించినందున వలస కార్మికులు తమ రాష్ట్రాలు, జిల్లాలకు వెళ్లేందుకు తొందరపడుతున్నప్పటికీ, రోడ్లపైకి ఎవరిని అనుమతించరాదని తెలిపారు. ఒకవేళ వలస కార్మికులు రోడ్లపైకి వస్తే ఇప్పటి వరకు ప్రభుత్వం తీసుకున్న చర్యలన్నీ వ్రుధా అవుతాయని పేర్కొన్నారు.