థర్డ్‌వేవ్ అలర్ట్.. వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్.. డెల్టాకంటే డేంజరస్ వేరియంట్ AY 4.2
posted on Oct 30, 2021 @ 5:23PM
కరోనా లేదు పాడూ లేదు. ఫుల్ టూ బిందాస్. ఎందుకైనా మంచిదని మాస్క్ ఒక్కటి మెడకు వేలాడదీస్తున్నారు. ఎవరైనా తుమ్మినప్పుడు మాత్రమే ముక్కు మీదకు మాస్క్ లాగుతున్నారు. లేదంటే లేదు. గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. దగ్గర దగ్గరగా ఉంటున్నారు. గుసగుసలు పెట్టుకుంటున్నారు. షేరింగ్‌లు.. చుమ్మాలు.. అంతా కామన్. అచ్చం మామూలు రోజుల్లా.. కరోనా అనేదే లేదన్నట్టుగా జీవించేస్తున్నారు జనాలు. కానీ, ఓవైపు చలికాలం స్టార్ట్ అవుతోంది.. మరోవైపు పాజిటివ్ కేసుల్లో కదలిక వస్తోంది. ఇంకోవైపు కొత్త వేరియంట్ పుట్టుకొచ్చింది. గతంలో సెకండ్ వేవ్‌కు ముందున్న పరిస్థితే ప్రస్తుతం కొనసాగుతోంది. రానున్న థర్డ్ వేవ్‌కు సింబాలిక్‌గా.. విదేశాల్లో కరోనా మారణహోమం మొదలైపోయింది. అమెరికా, యూరప్, రష్యా, సింగపూర్.. ప్రపంచ దేశాలన్నీ పాజిటివ్ కేసులతో బెదిరిపోతున్నాయి. డెల్టా కంటే డేంజరస్ వేరియంట్ ఏవై 4.2 విజృంభిస్తోంది. తాజాగా, మన దేశంలోనూ అందులోనూ తెలంగాణలోనూ ఏవై 4.2 కేసులు కనిపించడం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలో 48 ఏళ్ల వ్యక్తి, 22 ఏళ్ల యువతికి డెల్టా ఏవై 4.2 రకానికి చెందిన కరోనా వైరస్ సోకిందని తెలుస్తోంది. అయితే, వైద్య అధికారులు ఈ విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నారని అంటున్నారు. ఏవై 4.2 వేరియంట్ వైరస్సే ప్రస్తుతం ప్రపంచ దేశాలను చుట్టేస్తోంది. మూడోవేవ్‌కు ముందస్తు సిద్ధం చేస్తోంది. ఏవై 4.2 అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. డెల్టా వేరియంట్‌లోని 60 రకాల్లో ఇది ఒకటని, ఇది డెల్టా సాధారణ వేరియంట్ కంటే 15 శాతం వేగంగా విస్తరించే ప్రమాదం ఉందనేది నిపుణుల ఆందోళన. తెలంగాణతో పాటు ఏపీ, కర్ణాటకలోనూ ఈ కొత్త వేరియంట్ వెలుగు చూసిందని తెలుస్తోంది.
రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్న వారికీ ఈ వైరస్ వదిలిపెట్టడం లేదంటున్నారు. వ్యాక్సిన్‌కు విరుగుడు మంత్రంతో వచ్చిందీ ఏవై 4.2 వేరియంట్. సింగపూర్‌లో అదే జరుగుతోంది. ఆ దేశంలో 84శాతం మంది రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకోగా.. అందులో 14శాతం మంది బూస్టర్ డోస్‌లు కూడా పూర్తి చేసుకున్నారు. అయినా సింగపూర్‌లో రోజురోజుకీ కొవిడ్ కేసులు పెరిగిపోతుండటం ఆందోళనకరంగా మారింది. తాజాగా ఒక్కరోజులోనే నాలుగువేలకు పైగా కొత్త కేసులు నమోదవగా.. 16 మంది కొవిడ్‌తో చనిపోయారు. ఇక, రష్యాలో కొత్త వేరియంట్ బీభత్సం మామూలుగా లేదు. రోజూ లక్షలాది కేసులు వస్తుండటం.. అందులో చాలామంది రెండు డోసుల వ్యాక్సిన్లు వేసుకున్నవారే కావడం కలకలం రేపుతోంది. ఏవై 4.2 వేరియంట్ వ్యాక్సిన్‌ను తట్టుకొని మరీ విస్తరిస్తుండటం.. పొంచిఉన్న మూడో వేవ్ ముప్పుకు నిదర్శనం అంటున్నారు. అందుకే, భారతీయులారా.. బీ కేర్‌ఫుల్.. కరోనా ఎక్కడికీ పోలేదు.. మన మధ్యనే పొంచి ఉండి.. మరింత పదునుగా రాటుదేలుతోంది. సో, మాస్కులు, సోషల్ డిస్టెన్స్ మరిచిపోవద్దు. జాగ్రత్తే కరోనా నుంచి రక్ష. లేదంటే.. అసలే శీతాకాలం.. ఎప్పుడైనా కరోనా కుమ్మేయ వచ్చు.. థర్డ్ వేవ్ చుట్టేయ వచ్చు..