ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్.. హుజురాబాద్ లో గెలిచేది ఎవరంటే..!
posted on Oct 30, 2021 @ 6:24PM
తెలంగాణలో జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నిక దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడటం, పోటాపోటీగా డబ్బులు ఖర్చు చేయడంతో హుజురాబాద్ బైపోల్ దేశంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికగా నిలిచిందనే టాక్ వినిపిస్తోంది. జూన్ లో మొదలైన హుజురాబాద్ రాజకీయ హీట్.. శనివారం జరిగిన పోలింగ్ తో చల్లారింది. అయితే పోలింగ్ ముగియడంతో ఇప్పుడు విజయం ఎవరిది అన్నది ఉత్కంఠ రేపుతోంది. హోరాహోరీగా సాగిన హుజురాబాద్ పోరులో ఎవరూ గెలుస్తారన్నదానిపై వేల కోట్ల రూపాయల్లో బెట్టింగులు జరుగుతున్నాయి. హుజురాబాద్ ఉప ఎన్నికలో పోలింగ్ శాతం భారీగా నమోదు కావడం పార్టీలను భయపెడుతోంది. పోలింగ్ సరళీని బట్టి పార్టీల తమ విజయవకాశాలపై అంచనాలు వేసుకుంటున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికలో 35 మంది బరిలో ఉన్నా ప్రధాన పోటీ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి ఈటల రాజేందర్ మధ్యే సాగింది. హుజురాబాద్ నియోజకవర్గంలో ఐదు మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, వీణవంక, జమ్మికుంట, ఇల్లంతుకుంట, కమలాపూర్ మండలాలు ఉన్నాయి. హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలుగా ఉన్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల ఓట్లు ఉండగా.. వీళ్ల కోసం 306 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ దాదాపు 80 శాతం కావడంతో మొత్తంగా లక్షా 80 వేల వరకు ఓట్లు పోలయ్యాయి. దీంతో మండలాలు, గ్రామాలు, పోలింగ్ కేంద్రాల లెక్కన తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో అంచనా వేసుకుంటున్నారు అధికార టీఆర్ఎస్, బీజేపీ నేతలు.
హుజురాబాద్ నియోజకవర్గంలో ఎవరూ గెలుస్తారన్న దానిపై పోలింగ్ రోజున తెలుగువన్ బృందం సర్వే నిర్వహించింది. ఓటర్ల నాడిని పట్టింది. ముందు నుంచి సాగినట్లే పోలింగ్ రోజు కూడా టీఆర్ఎస్, బీజేపీ మధ్య పోరాటం హోరాహోరీగానే నడిచినట్లు కనిపించింది. హుజురాబాద్ మండలంలో బీజేపీకి కొంత ఆధిక్యత వస్తుందని సర్వేలో తేలింది. హుజురాబాద్ పట్టణంలో బీజేపీకి పూర్తిగా సానుకూలత కనిపించింది. ఉద్యోగులు, విద్యావేత్తలు, యువత ఈటలకు సపోర్టుగా నిలిచారు. హుజురాబాద్ రూరల్ మండలంలో మాత్రం రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ నడిచింది. ఓవరాల్ గా హుజురాబాద్ మండలంలో బీజేపీకి లీడ్ రానుందని సర్వేలో స్పష్టమైంది.
హుజురాబాద్ నియోజకవర్గంలో అత్యంత కీలకమైన జమ్మికుంట మండలంలో పోలింగ్ భారీగా నమోదైంది. జమ్మికుంట మొదటి నుంచి టీఆర్ఎస్ కు కంచుకోటగా ఉంది. గతంలో ఈటలకు ఇక్కడే భారీ మెజార్టీ వచ్చేంది. దీంతో ఇక్కడ ఈసారి కూడా టీఆర్ఎస్ కు లీడ్ వస్తుందని అంతా భావించారు. కాని పోలింగ్ లో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. జమ్మికుంట పట్టణంలో బీజేపీకి లీడ్ కనిపించింది. జమ్మికుంట రూరల్ లో కారుకు స్వల్ప ఆధిక్యత రావచ్చు. మొత్తంగా జమ్మికుంట మండలంలో రెండు పార్టీల మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండే అవకాశం ఉంది.
వీణవంక మండలంలో బీజేపీ అభ్యర్థి ఈటలకు మంచి లీడ్ వచ్చే అవకాశం ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ సొంత మండలం అయినప్పటికి వీణవంక మండలంలో ఈటల రాజేందర్ కు క్లియర్ మద్దతు కనిపించింది. గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హిమ్మత్ నగర్ లోనూ ఈటలకు మద్దతు కనిపించింది. అంతేకాదు తమకు డబ్బులు ఇవ్వలేదంటూ గెల్లు సొంతూరులోనే ఓటర్లు ఆందోళనకు దిగడం అధికార పార్టీని ఇబ్బందులకు గురి చేసింది. ఇల్లంతకుండ మండలంలో మాత్రం టీఆర్ఎస్ కు కొంత లీడ్ వస్తుందని సర్వేలో స్పష్టమైంది.
ఇక ఈటల రాజేందర్ సొంత మండలం కమలాపూర్ లో బీజేపీకి స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. కమలాపూర్ తో పాటు మండలంలోని అన్ని గ్రామాల్లో కమలానికి ఓటర్లు జైకొట్టిన పోలింగ్ రోజున తేలింది. కమలాపూర్ మండలం తమకు టఫ్ గా ఉండటంతో టీఆర్ఎస్ నేతలు ఇక్కడే ఎక్కువ ఫోకస్ చేశారు. ఓటర్లకు డబ్బులు కూడా బాగా పంపిణి చేశాయి. అయితే పోలింగ్ రోజున మాత్రం ఓటర్లు మనీ కంటే సెంటిమెంట్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్లు స్పష్టమైంది. కమలాపూర్ మండలంలో ఈటలకు స్పష్టమైన మెజార్టీ వస్తుందని తెలుగువన్ సర్వేలో తేలింది.
పోలింగ్ సరళిని భట్టి హుజురాబాద్ ఉప సమరంలో బీజేపీ అభ్య్రర్థి ఈటల రాజేందర్ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఆయనకు టీఆర్ఎస్ పై 10 నుంచి 15 శాతం వరకు ఓట్ల మెజార్టీ రావచ్చొని తెలుగువన్ సర్వేలో స్పష్టమైంది.అధికార పార్టీ విచ్చలవిడిగా డబ్బులు పంపిణి చేసినా.. ఈటలపై ఉన్న సానుభూతి ముందు నిలవలేదని స్పష్టమైంది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో అధికార పార్టీ నేతలు పంచిన డబ్బులు ఓటర్లకు అందలేదు. దీంతో వాళ్లంతా ఓపెన్ గానే ఈటలకు మద్దతు ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో కేసీఆర్ ను తిట్టుకుంటూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వెళ్లడం కనిపించింది. పోలింగ్ సరళిని అంచనా వేసిన కమలం నేతలు సంతోషంలో ఉండగా... మధ్యాహ్నానికే కారు పార్టీ లీడర్లు ఢీలా పడిపోయారు.